సీఎం జగన్ అనుకున్నవన్నీ చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా.. రెండేళ్లు అంతా ఇబ్బంది పడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్ని చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు.. ఒకటో తేదీనో ఎప్పుడో అది కూడా జరుగుతుందని ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన కాపు సామాజికవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుకున్నవన్నీ చేసే వరకు సీఎం వైఎస్ జగన్ నిద్రపోరని తెలిపారు. ఇక, టీడీపీ, జనసేనపై హాట్ కామెంట్లు చేసిన కారుమూరి… ముద్రగడ పద్మనాభం జీవితం కొవ్వత్తి.. తాను కరిగిపోతూ ఎంతో మందికి వెలుగు ఇచ్చారని పేర్కొన్నారు. కాపులను అడ్డు పెట్టుకొని కొందరు పైకి రావడానికి చూస్తున్నారు.. కానీ, తన జాతిపైకి రావడానికి ముద్రగడ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కాపుల సహకారం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను.. పేదలకు మేలు చేయాలని ఆలోచించే సీఎం జగన్ కు ముద్రగడ తోడు కావడంతో మరిన్ని మంచిపనులు చేసే అవకాశం వచ్చిందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
ఆ 20 సీట్లను కూడా త్యాగం చేసి.. పార్టీ ప్యాకప్ చేస్తే త్యాగశీలిగా పేరు వస్తుంది..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు కాపు ఉద్యమ నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం.. కూటమిలో పవన్ కల్యాణ్ తీసుకున్న 20 సీట్లను కూడా త్యాగం చేసి జనసేన పార్టీ ప్యాకప్ చేస్తే.. త్యాగశీలిగా పేరు వస్తుందని ఎద్దేవా చేశారు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. క్లబ్బులు నడిపే వాళ్లచేత నన్ను పవన్ కల్యాణ్ తిట్టిస్తున్నారని.. దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టీ నన్ను తిట్టండి అంటూ సవాల్ విసిరారు ముద్రగడ. ఇక, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యమం ఎందుకు ఆపేశారు అంటున్న పవన్ కల్యాణ్.. చంద్రబాబు సీఎం అయ్యాక మీరు ఏ మడుగులో దాక్కున్నారని ప్రశ్నించారు. చాటున ఉండి మాట్లాడటం మగతనం అనిపించుకోదని మండిపడ్డారు. చంద్రబాబు తన తనయుడు లోకేషన్ తో పాదయాత్ర చేయించింది పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి కాదన్నారు ముద్రగడ.
ఎన్నికల కోడ్ ఉండగానే రూ.20 వేల కోట్ల అప్పు..! యనమల ఆరోపణ
ఏపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఏపీలో వైఎస్ జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతే అని హెచ్చరించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ రెడ్డి ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చారు. 2023-24 లో ఆర్బీఐ నుంచే కేవలం మంగళవారం అప్పులే రూ.70 వేల కోట్లు చేశారని.. జగన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు రూ.257 కోట్లు చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు బహిరంగ మార్కెట్‌లో అప్పులు చేసిందని విమర్శించారు. శాసనసభకు చెప్పి చేస్తామన్న అప్పులు ఇవి రెండింతలు ఎక్కువ. రాబోయే ప్రభుత్వాల అప్పులను సైతం జగన్ రెడ్డే చేయాలనుకుంటున్నాడు. ఎన్నికల కోడ్ ఉండగానే 2024-25 ఆర్ధిక సంవత్సరం అప్పులలో రూ.20 వేల కోట్లు జూన్ 4 లోపే చేసేయాలని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇక, రాష్ట్రాన్ని ఆర్ధిక అధోగతి పాలుకాకుండా కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ రెడ్డిని ఓడించాల్సిందే అని పిలుపునిచ్చారు యనమల రామకృష్ణుడు.. అప్పులతో కొనసాగే సంక్షేమ రాజ్యం ఎప్పటికైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. పేదలను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించాలంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం అందించే కూటమిని గెలిపించాలని సూచించారు. కాగా, గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే. ఎన్నికల తరుణంలో మరోసారి హాట్ కామెంట్స్ చేశారు యనమల.
వైసీపీకి మరోషాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఓ విడియో విడుదల చేసిన ఆమె.. తాను వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇంత కాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.. వైసీపీకి రాజీనామా చేశాను.. రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి, పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఫ్యాక్స్ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి శింగనమల టికెట్ ఆశించి భంగపడ్డారు యామిని బాల.. దీంతో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. ఇప్పుడు రాజీనామా చేశారు.. మరి ఏ పార్టీలో చేరతారు అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శింగనమల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు యామిని బాల.. అప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.. కానీ, 2019 ఎన్నికల్లో అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామినిబాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు చంద్రబాబు.. అయితే, తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.. దీంతో.. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. టీడీపీకి రాజీనామా చేసి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్‌లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానమని కేటీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారని.. చిత్తశుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్‌కు లెటర్ రాయాలని, తాము కూడా ఉత్తరం రాస్తామన్నారు. కరువు వస్తే మమ్ములను తిడుతారా అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారన్నారు. ఈ ఏడాది 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని.. కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ ఆయన ఆరోపించారు. మేడిగడ్డ నుంచి రోజూ 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రిపేరు చేయకుండా కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారన్నారు. కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని.. కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలనకు వెళితే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో రెండు పిల్లర్లు రిపేరు చేస్తే తెలంగాణలో కరువు రానే రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు. రైతుల హక్కుల తరపున కొట్లాడుదామని ఆయన బీఆర్‌ఎస్ నేతలకు, రైతులకు పిలుపునిచ్చారు. ప్రజలకు మొండి చేయి చూపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయని భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దగాకోరు అని ప్రజలకు వివరించి చెబుతామన్నారు. రేపటి నుండి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్‌పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని కేటీఆర్ రైతులకు సూచించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ భేటీ
మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్తితుల కారణంగా వేసవిలో నీటి సరఫరా చాలా కీలకమని, అన్ని గ్రామీణ ఆవాసాలలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడం ఈ శాఖ బాధ్యత అని ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తు చేశారు. పంపు సెట్‌లలో లేదా పైప్‌లైన్‌లో లేదా విద్యుత్ సరఫరాలో ఏదైనా చిన్న మరమ్మతులు కానీ వైఫల్యం కానీ సంభవించినట్లైతే కొన్ని ఆవాసాలకు సరఫరా ఇబ్బంది కలిగే అవకాశముందన్నారు.గృహాలకు నిరవధికంగా, 100 శాతం సరఫరా చేయడానికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమైనదని, చాలా కీలకమని గుర్తు చేశారు. అన్ని పంపు సెట్ల మరమ్మతులను ఏప్రిల్ 12 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ విషయంలో పంప్ సెట్స్ ఏజెన్సీలు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, సంబంధిత చీఫ్ ఇంజనీర్‌లకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఏజెన్సీలు పంపుసెట్స్‌కు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పైప్‌లైన్ మరమ్మతులన్నింటిని 12 గంటల్లో చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ అండ్ ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ఏజెన్సీలకు నిర్దేశించారు. డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన సమయానికి తాము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని, ప్రస్తుతం ఉన్న మరమ్మతులకు, భవిష్యత్తులో జరిగే మరమ్మతులకు సానుకూలంగా హాజరవుతామని ఏజెన్సీలు హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యాత్మక ఇళ్లను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతిరోజూ నీటి సరఫరా అయ్యేటట్టు చూడాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్లును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించడం జరిగిందని ఆయన వెల్లడించారు.
క్రైమ్ కాపిటల్‌గా ఢిల్లీ, ప్రపంచంలో 70వ స్థానం.. హైదరాబాద్, బెంగళూర్ ర్యాంక్ ఎంతంటే..?
గ్లోబర్ క్రైమ్ సర్వే నంబియో తాజా ర్యాకింగ్స్ ప్రకారం.. దేశంలో ఎక్కువ నేరాలు జరుగుతున్న నగరాల్లో న్యూఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే ఢిల్లీ అత్యధిక నేరాలు జరిగే నగరాల్లో 70వ స్థానంలో ఉంది. ఢిల్లీతో పాటు భారత్‌లోని 10 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. నోయిడా 87వ స్థానంలో ఉండగా.. గురుగ్రామ్ 95వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో బెంగళూర్ నగరంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ జాబితాలో బెంగళూర్ 102వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్ 174వ స్థానంలో ఉంది. మిగతా నగరాలను పరిశీలిస్తే ఇండోర్ (136), కోల్‌కతా (159), ముంబై (169), చండీగఢ్ (177), మరియు పూణే (184) స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేరాలు ఎక్కువగా జరిగే నగరాల్లో మొదటిస్థానంలో వెనుజులాలోని కారకాస్ ఉండగా, దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా రెండో స్థానంలో ఉంది. డర్బన్3వ స్థానంలో, జోహన్నెస్‌బర్గ్ 4వ స్థానంలో, పోర్ట్ ఎలిజబెత్ 8వ స్థానంలో, కేప్ టౌన్ 18వ స్థానంలో ఉన్నాయి.
జోబైడెన్ డ్రగ్స్ తీసుకున్నాడు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్దీ విమర్శలు, ఆరోపణ ధాటి ఎక్కువ అవుతోంది. తాజాగా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెంట్ జోబైడెన్ డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపించాడు. ప్రసంగ సమయంలో బైడెన్ ‘గాలిపటం కన్నా ఎత్తు’లో ఉన్నాడని ఆరోపించారు. డ్రగ్ టెస్టులు జరగాలని డిమాండ్ చేశారు. గత నెలలో స్టేట్ ఆప్ ది యూనియన్ ప్రసంగంలో అధ్యక్షుడు జో బైడెన్ డ్రగ్స్‌పై ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. ఆయనతో చర్చ జరగాలని డిమాండ్ చేస్తూనే, ఇలాంటి కార్యక్రమాలకు ముందు డ్రగ్ టెస్టు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం కన్జర్వేటివ్ రేడియో షో హోస్ట్ హ్యూ హెవిట్‌తో కలిసి ట్రంప్ ముచ్చటించారు. ‘‘ వైట్ హౌస్‌లో కొకైన్ కనుగొన్నారని అనుకుంటున్నాను. అక్కడ ఏదో జరుగుతుందని నేను అనుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ నేను బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని చూశాను. అతడు మొదట్లో ఉవ్వెత్తున ఎగిసి, వేగంగా క్షీణిస్తున్నాడు. అక్కడ ఏదో జరుగుతోంది’’ అని ట్రంప్ అన్నారు. బైడెన్ కొకైన్ వాడినట్లు ట్రంప్ చెబుతున్నారా..? అని అడిగినప్పుడు.. ఏమి ఉపయోగిస్తున్నాడో తనకు తెలియదని అని చెప్పారు. అయితే, ‘‘అతను గాలిపటం కన్నా ఎత్తులో ఉన్నాడు’’ అని పరోక్షంగా డ్రగ్స్ మత్తులో ఉన్నాడని ఆరోపించారు.
ఎస్ఆర్హెచ్పై ఓటమి.. కారణమేంటో చెప్పిన కెప్టెన్
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం)సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్లో గెలిచి సత్తా చాటింది. కాగా.. ఈ మ్యాచ్తో చెన్నై వరుసగా రెండు ఓటములను నమోదు చేసుకుంది. మ్యాచ్ జరిగింది హైదరాబాద్లో అయినప్పటికీ.. అభిమానులు అందరూ చెన్నైకి సపోర్ట్ చేశారు. అయినా చెన్నై విజయం సాధించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఏదేమైనప్పటికీ ఈ ఓటమిపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించారు. ఓటమికి గల కారణాలను చెప్పారు. పవర్ ప్లేలో హైదరాబాద్ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణమని రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ఈ పిచ్ చాలా స్లోగా ఉందని.. సన్ రైజర్స్ బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారన్నారు. ఉప్పల్ స్టేడియం నల్లరేగడి పిచ్ కావడంతో నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశామని పేర్కొన్నారు. కానీ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ మరింత స్లో అయిందని తెలిపారు. అంతేకాకుండా.. బౌలింగ్లో రాణించినప్పటికీ, తాము ఫీల్డింగ్లో తప్పిదాలు చేశామని చెప్పారు. అయినా ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకొచ్చాం అని రుతురాజ్ పేర్కొన్నారు. ఇక.. సీఎస్కే తర్వాతి మ్యాచ్ కోల్కతా నైట్రైడర్స్ ఉంది. ఈనెల 8వ తేదీన సోమవారం హోంగ్రౌండ్ చెన్నైలో జరుగనుంది.
పాకిస్థాన్ ఆటగాళ్లకు స్నైపర్ ట్రైనింగ్.. వీడియో వైరల్
కాకుల్లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ (ASPT)లో పాకిస్తానీ క్రికెటర్ల ఆర్మీ శిక్షణా కొనసాగుతుంది. శిక్షణా శిబిరంలో వారంతా కొండలపై రాళ్లను మోస్తూ కనిపించారు. మొత్తం 29 మంది ఆటగాళ్లు కఠినమైన ఫిట్‌నెస్ సాధించేదుకు కసరత్తులు చేస్తున్నారు. కొత్తగా నియమించబడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు యొక్క ఫిట్‌నెస్ స్థాయిలలో గణనీయమైన మెరుగుదల.. స్థిరంగా బౌండరీలు కొట్టే వారి పవర్-హిటింగ్ సామర్థ్యాన్ని చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాకిస్థాన్ ప్లేయర్లకు స్నైపర్ ట్రైనింగ్, అడ్వాన్స్ కాంబాట్ శిక్షణ కూడా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో.. ఆటగాళ్ళు తమ శక్తిని మెరుగుపరచుకోవడానికి ఇతర వ్యాయామాలను ప్రదర్శించారు. కొండ ఎక్కేటప్పుడు తలపై రాళ్లను మోసుకెళ్లమని పాకిస్థాన్ జట్టును కోరింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇందులో నసీమ్ షా, మహ్మద్ రిజ్వాన్ మరియు ఇఫ్తికర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు సాయుధ దళాల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం చూడవచ్చు. అంతే కాకుండా.. ఒక వీడియోలో పాకిస్తాన్ ఆటగాళ్ళు స్నిపర్ షూటింగ్ చేస్తున్నట్లు చూడవచ్చు.
ఆంధ్రా అంధుడిపై బాలీవుడ్ సినిమా.. అసలెవరు ఈ శ్రీకాంత్ బొల్లా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన శ్రీకాంత్ చిత్రం నుండి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు గాను తుషార్ హీరా నందిని దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ జ్యోతిక, ఆలయ ఎఫ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 10న విడుదల అవుతోంది. ఈ సినిమాలో కంటి చూపు లేక ఎంతో ఇబ్బంది పడి అనేక సవాళ్లను ఎదుర్కొని ఉన్న చదువుతోపాటు అనేక విజయాలు సాధించిన వ్యక్తిగా శ్రీకాంత్ బోల్ల గురించి సినిమా తీర్చిదిద్దారు. ఇకపోతే అసలు ఎవరు ఈ శ్రీకాంత్.. ఆయన ఏమి సాధించాడు అన్న విషయాలు చూస్తే.. ఈయన 1991 సంవత్సరంలో కంటి చూపు లేకుండా జన్మించాడు. దాంతో వారి కుటుంబ సభ్యులు పుట్టిన వెంటనే అతనిని వదిలించుకోవాలని వారి తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. కాకపోతే వారి తల్లిదండ్రులు మాత్రం ఆయనను పట్టుదలతో చదివించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థులతో కళ్ళు సరిగా కనిపించని లాంటి అనేక సూటిపోటి మాటలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈయన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం. అతడు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తనకు కంటి చూపు లేని ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని కష్టపడి చదివి అమెరికాలోని ఎంఐటి నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అంతర్జాతీయ అందరి విద్యార్థిగా చరిత్ర లిఖించాడు.
ఈ పని చేస్తే, మీ ఇంటికే “ఫ్యామిలీ స్టార్” టీమ్!
విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ సినిమా యూనిట్ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. దాని ప్రకారం సినిమా టీం మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారట. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోందని సినిమా యూనిట్ వెల్లడించింది తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్ కాగా అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోందని సినిమా యూనిట్ వెల్లడించింది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గొప్ప అవకాశం ఇదని పేర్కొంది. ఈ అనౌన్స్ మెంట్ లోని ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారని, ఈ ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలని పేర్కొన్నారు. ఇక నిన్న థియేటర్స్ లోకి వరల్డ్ వైడ్ రిలీజ్ కు వచ్చింది ఫ్యామిలీ స్టార్ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతోందని సినిమా యూనిట్ వెల్లడించింది.