కోటి మంది అభిప్రాయాలతో మేనిఫెస్టో సిద్ధం చేశాం..!
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు రాజమండ్రి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి.. గతంలో మాదిరిగా కాకుండా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు సలహాలు తీసుకున్న తర్వాత బీజేపీ మేనిఫెస్టో సిద్ధం చేసిందని తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి.. సుమారుగా కోటి మంది అభిప్రాయాలు తెలుసుకుని వాటన్నింటినీ క్రోడీకరించి మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లు, రైతులను ప్రామాణికంగా తీసుకుని మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని, ఐదు కోట్ల మంది చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని పేర్కొన్నారు.
వైసీపీకి దువ్వాడ గుడ్‌బై..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. రాజీనామాలు, మరో పార్టీలో చేరికకు అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. ఇక, ఆయన బాటలో ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ కూడా అడుగులు వేశారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. 11 ఏళ్లుగా పార్టీకి సేవలందించానని అయినా తనకు తగిన గుర్తింపు లేదంటున్న దువ్వాడ శ్రీకాంత్.. దానికి తోడు గడిచిన కొన్నేళ్లుగా పార్టీలో తనకు అవమానాలు జరిగాయని.. వాటిని తట్టుకోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. మరోవైపు.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్ననట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు దువ్వాడ శ్రీకాంత్.
ఫ్లెక్సీ కలకలం.. జనసేన అభ్యర్థి, నేతలు మా గ్రామంలోకి రావొద్దు..!
ఎన్నికల తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థి గానీ, నాయకులు గానీ.. మా గ్రామంలోకి రావొద్దు అని హెచ్చరిస్తూ మాగపువారిపేట గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం మాగపువారిపేటలో ఈ వార్నింగ్ ఫ్లెక్సీలు కలకలం రేపుపుతున్నాయి.. మాగపువారిపేట ఎదురుగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. అసలు జనసేన అభ్యర్థి, నేతలు తమ గ్రామంలోకి ఎందుకు అడుగుపెట్టదో కూడా.. ఆ ఫ్లెక్సీలపై రాసుకొచ్చారు స్థానికులు.. అయినవిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి రాజేష్ తమ సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. అతడిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదంటున్నారు.. తమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో మా గ్రామాల్లోకి రావొద్దు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. మా కులాన్ని దూషించి మా గ్రామంలోకి ఎలా వస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మా గ్రామంలోకి జనసేన అభ్యర్థి, నాయకులు ఎవరూ రావొద్దు అంటూ ఫ్లెక్సీపై రాసుకొచ్చారు.. కులాన్ని దూషించిన వ్యక్తి పై చర్యలు తీసుకోకపోతే జనసేన నేతలను దళితపేటల్లో తెరగనివ్వమంటూ హెచ్చరిస్తున్నారు దళిత సంఘాల నేతలు.. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నేతలో ప్రచారంపై ఫోకస్ పెట్టిన ఈ సమయంలో.. ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు అయినవిల్లి మండలంలో కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.2.5 కోట్లు సీజ్
ఐపీఎల్ వచ్చిందంటే చాలు నగరంలో బెట్టింగ్ ముఠాలు చెలరేగుతాయి. రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. యువత బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులతో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటి పోలీసులు ఐదు బెట్టింగ్ ముఠాలను ఏకకాలంలో పట్టుకున్నారు. ఐదు ముఠాల నుంచి రెండున్నర కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 మందిని అరెస్టు చేశారు. వారికి సంబంధించి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. ఈ ముఠాలు ప్రతిరోజు కోట్ల రూపాయల బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని బెట్టింగ్లకు పాల్పడ్డారు. ఐపీఎల్ సీజన్లో పెద్ద మొత్తంలో బెట్టింగ్లో పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసేది కాంగ్రెస్.. బీజేపీ కాదు..!
అంకాపూర్ లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధి బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ సంకల్ప పత్రం ఓట్లు దండుకోవడానికి కాదు.. దేశ ప్రజల భవిష్యత్త్ నిర్ధారించదానికి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ హయాంలో 100 రూపాయల్లో 15 రూపాయలు మాత్రమే లబ్ది దారులకు అందేవి, మధ్యలో 85 రూపాయలు దళారులకు వెళ్ళేవి అని ఆరోపించారు. ప్రధాని ద్వారా పసుపు బోర్డ్ ప్రకటన ఇప్పిచ్చిన ఘనత ఎంపీ అరవింద్ కే దక్కుతుంది అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డ నాయకుడు ఎంపీ అరవింద్.. కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్ని ఇబ్బందులే.. ఎంఎస్పీ కింద రైతులకు మద్దతు ధర ఇస్తాం అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తాం..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వివేక్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా 5 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రైతులకు మేలు చేసే స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతు గ్యారంటీ ఉంటుంది.. ఏడాది పాటు నిరసన వ్యక్తం చేసిన 72 మంది రైతుల ప్రాణాలు పోయిన తర్వాత నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది బీజేపీ అని శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించింది.
గుడ్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు..
ఈ సారి రుతుపవన కాలంలో వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రుతపవనాలకు అనుకూలంగా పసిఫిక్ మహాసముద్రంలో ‘‘లానినా’’ పరిస్థితులు ఆగస్టు- సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. 1951-2023 మధ్య గణాంకాలను పరిశీలిస్తే, ఎల్ నినో తర్వాత లా నినా పరిస్థితులు భారతదేశంలో రుతుపవన కాలంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేలా చేసిందని భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర విలేకరులు సమావేశంలో వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం అందిస్తుంది, ఇది వ్యవసాయ రంగానికి కీలకం. దేశ జిడిపిలో వ్యవసాయం వాటా 14 శాతంగా ఉంది. నాలుగు నెలల రుతుపవనా సీజన్‌లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాల సగటు( 87 సెం.మీ)లో 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. వర్షకాలానికి అనుకూలంగా హిందూ మహాసముద్రంలో ‘‘ ఇండియన్ ఓషియన్ డైపోల్’’ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు లా నినా పరిస్థితులు కూడా ఏర్పడితే ఈ రెండు వాతావరణ దృగ్విషయాలు రుతుపవనాల సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఓ మోస్తారు ఎల్ నినో పరిస్థితులు ఉన్నాయని, అయితే వర్షకాలం ప్రారంభమయ్యే నాటికి ఇది తటస్థంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్‌ని జైలులో టెర్రరిస్టుగా చూస్తున్నారు..
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఈ రోజు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ని కలుసుకున్నారు. కేజ్రీవాల్‌ని జైలులో ఉగ్రవాదిలా చూస్తున్నారని అన్నారు. హార్ట్ కోర్ క్రిమినల్‌గా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రిని చూసి భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. తనతో అరగంట సేపు మాట్లాడానని చెప్పారు. కఠిన నేరస్తులకు కూడా అందే సౌకర్యాలు కూడా ఆయనకు అందడం లేదని, ఆయన చేసిన తప్పేంటని మాన్ ప్రశ్నించారు. దేశంలో పెద్ద టెర్రరిస్టును పట్టుకున్నట్లుగా మీరు అతనితో వ్యవహరిస్తు్న్నారని మండిప్డడారు. పారదర్శకతతో కూడిన రాజకీయాలు చేసి, బీజేపీ రాజకీయాలను అంతమొందించే నిజాయితీపరుడు అరవింద్ కేజ్రీవాల్ అని అన్నారు. పంజాబ్ పరిస్థితులను గురించి కేజ్రీవాల్ తనను అడిగారని, అందుకు జూన్ 4 ఫలితాల తర్వాత ఆప్ అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుందని మాన్ చెప్పారు. ఆప్ మొత్తం కేజ్రీవాల్‌కి మద్దతుగా ఉందని చెప్పారు. మరోవైపు ఆప్ నేత సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించడానికి కేజ్రీవాల్ వచ్చే వారం నుంచి ఇద్దరు క్యాబినెట్ మంత్రులను పిలుస్తారని చెప్పారు. ‘‘ కేజ్రీవాల్ తన గురించి ఆలోచించడం మానునకోవాలని, ప్రజల బాగోగులు గురించి అడిగారు. ఉచిత కరెంట్ ఇస్తున్నారా..? అని అడిగారు. కరెంట్ కోతల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో ఉన్న ఉచిత మందుల ఇప్పుడు కొనసాగుతుందా..? అని ప్రశ్నించారు’’ అని పాఠక్ చెప్పారు.
భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలన్నదే బీజేపీ ఆలోచన..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన చేస్తుందని ఆరోపించారు. ఇది దేశ ప్రజలను అవమానించడమే అని మండిపడ్డారు. భారతదేశం ఒక పూలదండ లాంటిదని, దీంట్లో ప్రతీ పువ్వు గౌరవించబడాలని, అప్పుడే మొత్తం పూల గుత్తికి అందం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన ప్రతీ ఒక్క యువ భారతీయుడిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారతదేశంలో ఎక్కువ నాయకులు ఎందుకు ఉండలేకపోతున్నారనిర ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రశిస్తూ.. దీనికి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ఆలోచనా విధానమే ప్రధాన తేడా అని అన్నారు. దేశంలోని ప్రజల మాట వినాలని, వారి విశ్వాసాలను, భాష, మతం, సంస్కృతిని ప్రేమించాలని, గౌరవించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఏదో రకమైన ఆంక్షలు విధించాలని భావిస్తోందని ఆరోపించారు.
ఈరోజు గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు అవకాశం..!
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్లో గెలుస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ కు అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ నేటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్తో మ్యాచ్లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవకాశాల మరింత సంక్లిష్టం అవుతాయి. ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఆర్సీబీ స్కాడ్ లో బ్యాటింగ్ వైపు నుంచి మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. కేవలం విరాట్ కోహ్లీ తప్పితే మిగతా ప్లేయర్లు ఎవరూ రాణించడం లేదు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో గ్లేన్ మ్యాక్స్ వెల్ తన ఆటతీరుతో తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఆడిన అన్నీ మ్యాచ్ ల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమవుతున్నాడు. ఇక.. యువ ఆటగాళ్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన చూపించలేకపోతున్నారు. మొన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో 196 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఓడిపోయింది. అందుకు కారణం బౌలింగ్ అని చెప్పవచ్చు. బౌలింగ్ విభాగంలో.. బెంగళూరు జట్టుకు చెప్పుకోదగ్గ బౌలర్లు ఎవరూ లేరు.
ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ ఆరోజే.. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ”. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2024 మే 9 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ ఈ మూవీ మరో తేదీన విడుదల కాబోతుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..తాజాగా కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్‌పై కొత్త అప్‌డేట్ బాగా వైరల్ అవుతుంది.ఈ చిత్రాన్ని జులై 12న విడుదల చేయనున్నట్లు ఓ వార్త హల్ చల్ అవుతుంది.అయితే ఈ మూవీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక అప్‌డేట్ వస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు..”కల్కి 2898 AD “ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే మరియు దిశా పటానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ మరియి పశుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం నుండి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి..గతంలో విడుదల చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్‌డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్ మరియు అసెంబ్లింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసాయి.నాగ్ అశ్విన్ టీం కొన్ని రోజుల క్రితం ఇటలీలోని సర్దినియా ఐలాండ్‌లో ప్రభాస్ మరియు దిశాపటానీపై వచ్చే పాటను చిత్రీకరించిన విషయం తెలిసిందే…ఇప్పటికే సలార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ కల్కి మూవీతో తిరుగులేని విజయం అందుకోనున్నట్లు ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తేజ సజ్జ-కార్తీక్ సినిమా.. అర్ధం ఏంటో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో పండు సినిమాలు చేసి తర్వాత చదువు మీద దృష్టి పెట్టాడు తేజ సజ్జా. చదువు పూర్తి చేసుకుని మరోసారి సినీ రంగంలో మెరవాలని ప్రయత్నించి ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు. ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే జనవరిలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో హనుమంతు అనే ఒక పాత్రలో తేజ కనిపించాడు. చిన్న సినిమాగా అందరి ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఈ సినిమా తర్వాత తేజ చేసే సినిమా జై హనుమాన్ అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో తేజ సజ్జా సినిమా ఒకటి అనౌన్స్ చేశారు. ఈ రోజు తేజ సజ్జ కార్తీక్ ఘట్టమనేని సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీనికి సంబంధించిన గ్లింప్స్ మాత్రం 18వ తేదీన రిలీజ్ చేస్తామని వెల్లడించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి మిరాయి(Mirayi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది తెలుగు పదం కాదు జపనీస్ లో మిరాయి అంటే భవిష్యత్తు అని అర్థం. సినిమా లైన్ కి తగ్గట్టుగా ఈ పదాన్ని టైటిల్ గా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ సినిమా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని ప్రచారం ఉంది కానీ అది నిజం కాదని తెలుస్తోంది ఇక 18వ తేదీన రిలీజ్ అయ్యే గ్లింప్స్ తో సినిమా గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.