అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమగ్ర మార్పులతో 7-8 శాఖల్లో నూతన పాలసీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూడు నెలలుగా కొత్త పాలసీలపై అధికారులు సమగ్ర కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా వివిధ డ్రాఫ్ట్ పాలసీలను అధికారులు రూపొందించారు. ఎంప్లాయిమెంట్ ఫస్ట్ ( ఉద్యోగ కల్పన ప్రథమ లక్ష్యం) అనేదే ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడుదారులను ఆకర్షించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడులు పెట్టే విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా నిలవాలన్నారు. వచ్చే క్యాబినెట్ ముందుకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ నూతన పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలు తెచ్చేందుకు నిర్ణయించారు. పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేయాలన్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్‌గా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ఆలోచనలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆయా సంస్థలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెంటివ్స్ దక్కుతాయని…ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందన్నారు. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఇలాంటి కీలక నిర్ణయాలు దోహదం చేస్తాయన్నారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను, విధివిధానాలను సమగ్రంగా స్టడీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. స్కిల్స్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్‌కు అనుంబంధంగా సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్‌గా ఉండేలా ప్రతిపాదనలు చేయాలన్నారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఫలితాలు వచ్చే విధానాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ వచ్చేలా ప్రతిపాదనలు చేయాలన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీపైనా చర్చించారు. మరింత కసరత్తు తరువాత క్యాబినెట్ ముందుకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ రావాలన్నారు. ఈ సమీక్షకు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, అధికారులు హాజరయ్యారు.
ప్రభుత్వానికి షాక్.. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు
ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. తమ ఇళ్ళు కూల్చివేయొద్దు అంటూ హై కోర్టు నుంచి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఏ ఇంటి వద్ద చూసిన కోర్ట్ స్టే లే దర్శనమిస్తున్నాయి. దాదాపు 100 ఇళ్ల యజమానులు స్టే తెచ్చుకున్నట్లు సమాచారం. మూసి సుందరీకరణ కోసం తమ ఇండ్లు ఇవ్వమంటున్న ఇంటి యజమానులు స్పష్టం చేస్తున్నారు. న్యాయపోరాటం చేయడానికి ఏందాకైనా పోతామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్లోని ప్రవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ ఇటీవల తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసి పునరావసం కల్పిస్తామన్నారు. దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసిందని తెలిపారు. అలాగే, రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మూసీ రివర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి పునరావసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోంది అని దాన కిషోర్ ప్రకటించారు. బఫర్ జోన్కు సంబంధించి భూ సేకరణ, పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.. ప్రభుత్వ అనుమతి తర్వాత చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే భూసేకరణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మూసీ నది పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దని.. అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుంది అని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ వెల్లడించారు.
బస్సు ఛార్జీలు పెంపుపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ..
పండగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది. దాదాపు 50-70శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్ట్ ద్వారా ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ విపరీతంగా టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీలను సంస్థ సవరించిందని.. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారని.. ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుందని పేర్కొన్నారు. రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతుందని.. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయని తెలిపారు. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని స్పష్టం చేశారు. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు ఎండీ సజ్జనార్ మహాలక్ష్మి పథకం గురించి కూడా వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం మేర రద్దీ పెరిగిందని.. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, తదితర పండుగలకు బస్సుల్లో ప్రయాణాలు పెరిగాయని పేర్కొన్నారు. “ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పండుగుల్లో నడిచే స్పెషల్ బస్సులకు చార్జీలను జీవో ప్రకారం సవరించడం జరుగుతోంది. టీజీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 9 వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా రోజూ సగటున 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతుంది. ఆ 500 స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీల సవరణ ఉంటుంది. మిగతా 8500 రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.” అని స్పష్టం చేశారు. పండుగ సమయాల్లో రెగ్యులర్ , స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరల్లో తేడాలుండటం సాధారణమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు. “ఉదాహరణకు ఒక ప్రయాణికుడు వెళ్లేటప్పుడు రెగ్యులర్ సర్వీసుల్లో ప్రయాణిస్తే సాధారణ టికెట్ ధరనే ఉంటుంది. తిరుగుప్రయాణంలో స్పెషల్ బస్సును వినియోగించుకుంటే జీవో ప్రకారం సవరణ ఛార్జీలుంటాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియజేయడం జరుగుతుంది. పండగ సమయాల్లో మాత్రమే జీవో ప్రకారం స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరలను సవరించడం జరుగుతుందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తుంది. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే ఉంటాయి. స్పెషల్ సర్వీసులకు టికెట్ ధరలను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోంది.” అని పూర్తి వివరాలను ఎక్స్ ద్వారా ప్రజానికానికి తెలియజేశారు.
లక్కంటే ఆయనదే.. మద్యం షాపుల లాటరీలో ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు!
ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీకి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 26 జిల్లాల పరిధిలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు రాగా.. లాటరీ విధానాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను తలపించింది. ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. కాగా లాటరీ కొందరి పంట పండింది. వేసిన లాటరీల్లో చాలా మందికి షాపులు రాగా.. వారు ప్రస్తుతం నగదు సమీకరణ పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా.. ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4.. ధర్మవరం రూరల్‌లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నంబర్ దుకాణాలు ఆయనకు దక్కాయి. ఒక్కరికే ఐదు దుకాణాలు దక్కడం గమనార్హం.
తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ.. రూ. 1377.66 కోట్లు మంజూరు
తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన రోడ్ల నిర్మాణానికి రూ. 1377.66 కోట్లు మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. గ్రామీణ రోడ్లకు పట్టు బట్టి నిధులు సాధించామని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది. దివ్వాంగులు ఆఫీసర్లు చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా జాబ్ పోర్టల్ లో అప్లై చేసుకుంటే చాలని, వారి అర్హతను బట్టి ఉద్యోగం ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అన్నారు. ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాలని తెలిపారు. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని తెలిపారు.
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. జనవరి వరకు టపాసుల కాల్చివేత నిషేధం
దేశ రాజధాని ఢిల్లీలో అతిషి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో అత్యంత వేగంగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ముందు జాగ్రత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14(సోమవరం) నుంచి జనవరి 1 వరకు హస్తినలో టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యాటవరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి బాణాసంచా నిల్వ ఉంచడం, అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం 2025, జనవరి వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొ్న్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఢిల్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా హస్తిన వాసుల సహకారాన్ని కూడా కోరింది. ఇక నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ వివరణాత్మక సూచనలను జారీ చేసింది. ఆన్‌లైన్‌లో విక్రయించే వాటితో సహా అన్ని రకాల పటాకులకు నిషేధం వర్తిస్తుంది. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీకి రోజువారీ చర్య నివేదికలను సమర్పించాల్సిన అవసరం ఉన్నందున.. నిషేధాన్ని అమలు చేసే బాధ్యత ఢిల్లీ పోలీసులపై పడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.
నెక్ట్స్ టార్గెట్ బాబా సిద్దిఖీ కుమారుడే.. పోలీస్ వర్గాల వెల్లడి
ఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ముంబై ఉలిక్కిపడింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తు్న్నారు. ఇక తాజా విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాబా సిద్దిఖీ కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. తండ్రి, కుమారులను చంపేందుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు షూటర్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్దిఖీ, ఆయన కుమారుడు ఉంటారని షూటర్స్ భావించి వచ్చినట్లు తెలిసింది. ఒకేచోట తండ్రి, కొడుకును చంపడానికి వచ్చారు. వీలులేకపోతే ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడించారు. జీషన్ సిద్దిఖీ కాంగ్రెస్ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. బాబా సిద్దిఖీపై ముగ్గురు దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతున్న సమయంలో నవరాత్రి ఊరేగింపులో బాణసంచా కాలుస్తుండటంతో కాల్పుల శబ్దం బయటకు వినిపించలేదు. సిద్దిఖీని తామే చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు బాలీవుడ్ నటులతో కూడా సిద్దిఖీకి మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు కూడా భారీ భద్రత పెంచారు.
ఉద్ధవ్ థాకరేకు అస్వస్థత.. రిలయన్స్ ఆస్పత్రికి తరలింపు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. గుండె ధమనుల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వైద్యులు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరికపై మరిన్ని వార్తలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ వారమే మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు
వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన ఇంకా కొనసాగుతోంది. సోమవారం ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ముగ్గురికి బహుమతులను అందించనుంది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలకుగాను డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ. రాబిన్సన్‌లకు నోబెల్ బహుమతులను ప్రకటించింది. అర్థశాస్త్రంలో ముగ్గురు ఆర్థికవేత్తల పేర్లను సోమవారం వెల్లడించారు. డారెన్, సైమన్.. అమెరికాలో కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు కాగా.. రాబిన్సన్ షికాగో యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ నగదు అందుతుంది. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు. వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం మరియు శాంతికి సంబంధించి గత వారం నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. ఎకనామిక్స్ బహుమతి ప్రారంభమైనప్పటి నుంచి యుఎస్ విద్యావేత్తలచే ఆధిపత్యం చెలాయించబడింది. అయితే యుఎస్ ఆధారిత పరిశోధకులు కూడా గత వారం 2024 గ్రహీతలను ప్రకటించిన శాస్త్రీయ రంగాలలో విజేతలలో ఎక్కువ మందిని కలిగి ఉన్నారు.
700 మంది షూటర్లు.. 11 రాష్ట్రాల్లో నెట్‌వర్క్.. మరో దావూద్ ఇబ్రహీం!
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై బహిరంగంగా కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల పేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహాయం చేసినా అవే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. మొట్టమొదట సిద్ధూ మూసేవాలా ఇప్పుడు బాబా సిద్దిఖీ హత్యలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు క్రైమ్ ప్రపంచానికి మకుటం లేని రాజుగా మారే మార్గంలో ఉంది. రెండు దశాబ్దాల క్రితం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చేసినట్లే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భీభత్సం విస్తరిస్తోంది. దావూద్ పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. లారెన్స్ బిష్ణోయ్ పని విధానం కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ, అది అదే దిశలో సాగుతోంది. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో సహా 16 మంది గ్యాంగ్‌స్టర్లపై యూఏపీఏ చట్టం కింద ఛార్జ్ షీట్ దాఖలైంది. ఎన్‌ఐఏ తన ఛార్జిషీట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను దావూద్ ఇబ్రహీం యొక్క డీ-కంపెనీతో పోల్చింది. దావూద్ ఇబ్రహీం 90వ దశకంలో చిన్న చిన్న నేరాల నుంచి తన నెట్‌వర్క్‌ను ఏర్పరచుకున్న విధంగానే లారెన్స్ బిష్ణోయ్ ఉగ్రవాద సిండికేట్ పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ ఛార్జ్ షీట్ వెల్లడించింది. దావూద్ ఇబ్రహీం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, టార్గెట్ హత్యలు, దోపిడీ రాకెట్ల ద్వారా తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. తరువాత డి-కంపెనీని ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేశాడు. అదే విధంగా చిన్న చిన్న నేరాలతో మొదలైన బిష్ణోయ్ గ్యాంగ్ సొంతంగా ముఠాగా ఏర్పడి ఇప్పుడు ఉత్తర భారతాన్ని శాసిస్తున్నది. లారెన్స్ బిష్ణోయ్ ముఠాను కెనడా పోలీసులు, భారతీయ ఏజెన్సీల దృష్టిలో వాంటెడ్ క్రిమినల్ అయిన సత్వీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ నడుపుతున్నాడు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్‌తో సంబంధం ఉన్నారని ఎన్‌ఐఏ ఛార్జ్ షీట్ వెల్లడించింది. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ చిత్రాలు ఫెస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేయబడ్డాయి. కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు బిష్ణోయ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల యువతలో ముఠాలో చేరాలనే ఆకాంక్ష పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2020-21 నాటికి బిష్ణోయ్ గ్యాంగ్ దోపిడీ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బును హవాలా మార్గాల ద్వారా విదేశాలకు పంపించారు.ఎన్‌ఐఏ నివేదిక ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒకప్పుడు పంజాబ్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే లారెన్స్ బిష్ణోయ్ తన సన్నిహిత సహచరుడు గోల్డీ బ్రార్ సహాయంతో హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లోని ముఠాలతో కూటమిగా ఏర్పడి భారీ నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్‌లతో సహా ఉత్తర భారతదేశంలో విస్తరించింది. యువతను ముఠాల్లోకి చేర్చుకోవడానికి సోషల్ మీడియాతోపాటు అనేక ఇతర మార్గాలను ఉపయోగిస్తున్నారు. ముఠాలు యువతను కెనడాకు లేదా వారికి నచ్చిన దేశానికి తీసుకువెళతామని హామీ ఇస్తూ వారిని ఆకర్షిస్తాయి. ఎన్‌ఐఏ ప్రకారం.. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా పంజాబ్‌లో లక్ష్య హత్యలు, నేర కార్యకలాపాలు నిర్వహించడానికి బిష్ణోయ్ షూటర్‌లను ఉపయోగిస్తాడు.