నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్ లో మాట్లాడుతున్న రేవంత్ నేడు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ హాజరుపై ఏఐసీసీ నుంచి ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియాగాంధీతో సీఎం రేవంత్ భేటీ కానున్న కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా పిసిసి ఆహ్వానించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి సోనియాగాంధీని ఆహ్వానించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన సందేశం వెళ్లడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరుకావడం పీసీసీకి గౌరవంగా మారింది. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకుంటారా? లేక ఆమెకు బదులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పంపిస్తారా అన్న ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.
ఉత్తమ్ కుమార్ పై ఫైర్ అయిన మహేశ్వర్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ పై బీజెఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. నేను సంధించిన 19 ప్రశ్నల్లో ఒక్కదానికే మంత్రి ఉత్తమ్ సమాధానం ఇచ్చారన్నారు. సన్నబియ్యం కొనుగోలు విషయంలో మా సూచన తీసుకున్నందుకు ధన్యవాదాలన్నారు. మంత్రి ఉత్తమ్ ఫ్రస్ట్రేషన్ లో దిగజారుడు మాటలు మాట్లాడారని తెలిపారు. నాయకుడిని తయారు చేసే, సామర్ధ్యం ఉన్న నేతలకు పదవులు ఇచ్చే పార్టీ బీజేపీ అన్నారు. మీరు పిసిసి పదవి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టింటి వ్యవహారం మేనమామకు ఎరుక అన్నట్లు ఉత్తమ్ చరిత్ర నాకు తెలుసన్నారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే సీఎం రేవంత్ ను కలిసి ధాన్యం కొనుగోలుపై వినతి పత్రం ఇచ్చామన్నారు. రైస్ మిల్లర్లు 22 వేల కోట్లు బకాయిలు ఉన్నారని మీరే చెప్తున్నారని గుర్తు చేశారు. డిఫాల్టర్ల లిస్ట్ ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. వేల కోట్ల ప్రజాధనం ఉన్న అంశంలో బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తరుగుపై ఎప్పుడైనా మంత్రి కల్లాలకు వెళ్లి పరిశీలించారా ? అని ప్రశ్నించారు. జీఓ నెంబర్ 1, కమిటీ ఏర్పాటు, భేటీ, గైడ్ లైన్స్ ఒకేరోజు ఎలా సాధ్యం అయ్యాయి? అని ప్రశ్నించారు. మిల్లర్లతో వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఆ బాండ్ పేపర్ బయట పెడుతున్న. మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలన్నారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లిఫ్ట్ చేసేందుకు కాంట్రాక్టర్ల కు టెండర్ ఇచ్చారన్నారు. 90 రోజులైన వాళ్లు లిఫ్ట్ చేయడం లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా? అని ప్రశ్నించారు. పర్సనల్ గా మాట్లాడితే బాగోదన్నారు. నిన్న వేలు చూపుడేతు మంత్రి మాట్లాడారు. ఇక్కడ భయపడే వారు ఎవరు లేరన్నారు. సివిల్ సప్లై అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
జమ్మలమడుగులో ఉద్రిక్తత.. కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్
కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్ మెన్ సౌకర్యం కూడా పెంచారు. దాదాపు 20 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి గ్రామంలో లేకపోయినా వారి ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. కాగా, జమ్మలమడుగులో పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన 46 మందిపై కేసులు నమోదు చేశారు. జమ్మలమడుగులో పోలింగ్ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి ఘటన కేసులో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు అయింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కారుపై దాడి చేసిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, ఎన్నికల సందర్భంగా బైండోవర్ కేసులలో పూచీకత్తు ఇచ్చి.. ఘర్షణకు పాల్పడిన వారి కూచీకత్తులను రికవరీ చేయడానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జమ్మలమడుగులోని వైసీపీ, టీడీపీ, బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసుల పికెటింగ్ సైతం కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి జమ్మలమడుగులో అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు.. ఎన్నికలలో ఘర్షణకు పాల్పడిన కేసులలో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాడిపత్రిలో హైటెన్షన్.. 159 మందిపై రౌడీషీట్ ఓపెన్..
అనంతపురం జిల్లాలో హైటెన్సన్ వాతావరణం కొనసాగుతుంది. పోలింగ్ రోజు, తరువాత తలెత్తిన హింసాత్మక ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దాడుల్లో పాల్గొన్న 159 మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన చేశారు. పోలీసు బలగాలను మోహరించే విషయంలో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడంతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదన్న కారణాలతో ఇప్పటికే తాడిపత్రిలోని పలువురు పోలీసులపై ఎస్పీ సీరియస్ అయ్యారు. కాగా, తాడిపత్రిలో ఒకేరోజు మొత్తం 159 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ ఘర్షణల్లో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు తెరవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో.. మొత్తం 159 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేయించారు. తాడిపత్రిలో 106, యాడికిలో 37, పెద్దవడగూరులో ఏడుగురిపై రౌడీషీట్ తెరిచారు. అలాగే, పెద్దవడుగూరు మండలం దిమ్మగుడిలో ఓ దివ్యాంగుడిపై దాడి చేసిన ఏడుగురిపై, జిల్లాలోని ఇతర పోలీసు స్టేషన్ల పరిధిలో 9 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేసేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో భారీగా మంటలు.. తొక్కిసలాట
గుజరాత్‌లోని గేమ్ జోన్, ఢిల్లీలోని బేబీ కేర్ హాస్పిటల్ తర్వాత, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున 4.45 గంటలకు ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో సందడి నెలకొంది. ఆస్పత్రిలో చేరిన 12 మంది రోగులను హడావుడిగా వేరే చోటికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే అంశం. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు చెలరేగిన ఆసుపత్రి భవనం చెత్తతో నిండిపోయింది. ఈ వ్యవహారంలో ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బరౌత్ నగరంలోని ఢిల్లీ-సహారన్‌పూర్ రోడ్డులో ఉన్న ప్రైవేట్ క్లినిక్ ఆస్తా హాస్పిటల్‌లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున చాలా మంది ప్రజలు నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఆస్పత్రిలోని మూడో అంతస్తు నుంచి పొగలు, మంటలు రావడంతో అందరికీ నిద్ర కరువైంది. కొద్దిసేపటికే ఆస్పత్రిలో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, 12 మంది రోగులు ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులు వారిని సురక్షితంగా ఆస్పత్రి భవనం నుంచి బయటకు తీసి మరోచోటికి తరలించారు.
పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా.. బెంగళూరు సీసీబీ సీరియస్!
బెంగళూరు డ్రగ్స్ కేసు (బెంగళూరు రేవ్‌పార్టీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బెంగళూరు పోలీసుల విచారణకు టాలీవుడ్ సీనియర్ నటి హేమ డుమ్మా కొట్టారు. ఈరోజు (మే 27) తాను విచారణకు హాజరుకాలేనని బెంగళూరు పోలీసులకు ఆమె లేఖ రాశారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని బెంగళూరు సీసీబీకి రాసిన లేఖలో హేమ పేరొన్నారు. అయితే హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసులు సిద్దమయ్యారు. మే 19న ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది. 27న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే వైరల్ ఫీవర్ కారణంగా తాను నేడు విచారణకు హాజరు కాలేనని హేమ లేఖ రాశారు. దాంతో హేమపై బెంగళూరు సీసీబీ సీరియస్ అయింది.
భారతీయుడు రీ-రిలీజ్.. నేడు ట్రైలర్ విడుదల!
1996లో విడుదలైన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లోనే పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అటు కమల్, ఇటు శంకర్ కెరియర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా.. కమల్ ద్విపాత్రాభినయం చేశారు. దేశాన్ని కేన్సర్‌లా పట్టి పీడిస్తున్న అవినీతిపై స్వాతంత్య్ర సమరయోధుడు ‘సేనాపతి’ చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. భారతీయుడు సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూన్ 7న తెలుగు, తమిళంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ కూడా విడుదల కానుంది. ‘బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని మళ్లీ చూడ్డానికి సిద్ధంగా ఉండండి. భారతీయుడు – 1 రీ-రిలీజ్ ట్రైలర్ వస్తోంది. వేచి ఉండండి. జూన్ 7న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది’ అని నిర్మాత ఏఎం రత్నం ట్వీట్ చేశారు. జులై 12న ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తొలి భాగంను రీ-రిలీజ్ చేస్తుండడంతో కమల్ అభిమానులను ఉత్సాహంగా ఉన్నారు. భారతీయుడుకు కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండో భాగాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదటి భాగంలో మనీషా కొయిరాలా, సుకన్య, కౌందమణి, సెంథిల్ తదితరులు నటించారు.
అతడే మమ్మల్ని దెబ్బ కొట్టాడు: పాట్ కమిన్స్
ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమను దెబ్బకొట్టాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ తెలిపాడు. కోల్‌కతానైట్ రైడర్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారని ప్రశంసించాడు. చెన్నై పిచ్ 200 ప్లస్ వికెట్ కాదని, 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్లమన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దాంతో కోల్‌కతా ఖాతాలో మూడో ఐపీఎల్ ట్రోఫీ చేరింది. మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దురదృష్టవశాత్తు నా సహచరుడు మిచెల్ స్టార్క్ మరోసారి విజృంభించాడు. ఈరోజు మేం అనుకున్న విధంగా ఆడలేకపోయాం. కొన్ని బౌండరీలను కొట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. అహ్మదాబాద్‌లో గత వారం మాదిరిగానే.. వారు బాగా బౌలింగ్ చేశారు. ఈ విజయం పూర్తి క్రెడిట్ బౌలర్లదే. ఇది మంచి బౌలింగ్ వికెట్. 200 ప్లస్ వికెట్ కాదు. మేం 160 పరుగులు చేసి ఉంటే రేసులో ఉండేవాళ్లం’ అని అన్నాడు.