బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులు
ఇటీవల కాలంలో వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్నారు యూత్. పబ్, రీసార్ట్స్ లో పార్టీలు చేసుకుంటూ ఫుల్ కొట్టి చిల్ అవుతున్నారు. కొంతమంది సీక్రెట్ ప్లేసుల్లో రెయిన్ పార్టీలు, రేవ్ పార్టీ చేసుకుంటూ పీకల్లోతు మత్తులో మునిగితేలుతున్నారు. రేవ్ పార్టీలు జరుగుతున్న సమాచారం తెలుసుకుని పోలీసులు దాడులు చేయడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలాంటి పార్టీల్లో సామాన్యులే కాదు.. కొన్నిసార్లు సెలబ్రెటీలు కూడా దొరికిపోతున్నారు. రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్, మద్యం తీసుకుంటూ రెచ్చిపోతున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు మార్మోగిపోతుంది. దీనిపై వెంటనే సినీ నటి హేమ స్పందించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదని వెల్లడించారు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరించారు.
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాది..
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాదని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా గ్రామంలో గత ప్రభుత్వంలో అధికారులని బెదిరించారని తెలిపారు. రేషన్ కార్డు పొంది ఉంటే వారంతట వారే రద్దు చేసుకుంటే మంచిదన్నారు. బెదిరింపులకు పాల్పడి రేషన్ కార్డు లు పొందిన వారు రద్దు చేసుకోవాలని లేదంటే సీరియస్ గా వుంటుందన్నారు. ఒక సంవత్సరంలోపే పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామములో సీసీ రోడ్లు పూర్తిచేసే బాధ్యత నాదన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలల్లో అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయిందన్నారు. ప్రతి నిరుపేదకు సహాయం చేయాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ ప్రభుత్వ ఆలోచన అన్నారు. విద్య, వైద్య విషయంలో ఎవరైనా బహు పేద వాళ్ళ ఉంటే వారి కి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో ఐదుగురితో ఒక కమిటీ వేయడం జరుగుతుందన్నారు. ఆ కమిటీ వారి సూచనలు ఆలోచన మేరకే అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. విద్య వైద్య విషయంలో నిరుపేదలకి ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే నా వ్యక్తిగతంగా వారికి ఎలా సహాయం చేయాలో అలా చేస్తానని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. ఈకేసును బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చారు. ఈ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే. అయితే ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సమాచారం. కొందరు పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ లాకర్ రూమ్ ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ వచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసింది. జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉండగా.. ఓ వైపు రెడ్ కార్నర్ నోటీసులు, మరోవైపు కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ నెల చివరి వారంలో ప్రభాకర్ రావు ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతున్న విశ్వనీయ సమాచారం. అయితే ఈ వార్తలో ఇంకా క్లారిటీ రాలేదు. అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే పలువురు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ సమయంలో దాడులు జరిగే ఛాన్స్: ఇంటెలిజెన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల కమిషన్ కు నిఘా వర్గాలు నివేదికను ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా పెట్టాలని పోలీసులకు వెల్లడించింది. కాగా, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ఈసీ చెప్పుకొచ్చింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరికి నేరచరిత్ర ఉంది?..అనే దానిపై ముందుగానే గుర్తించి వారిపై నజర్ పెట్టనుంది. హింసాత్మక ఘటనల హెచ్చరికలతో ఈ రెండు నియోజకవర్గాల పోలీసులు భద్రతను పెంచారు. కౌంటర్ సమయంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండేలా భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. డౌట్ వచ్చిన వారిని ముందుస్థుగానే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అయితే, కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున ఈసీ మోహరించింది. పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల పొలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల కమిషన్ సీరియస్ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్.. కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నట్లు సిట్ ప్రకటించింది. కాగా, డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. అల్లర్లపై సిట్ విచారణలో కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది. ఏపీలో పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ రెడీ అయింది. ఇప్పటికే స్థానిక పోలీసులకు కేసులు నమోదుపై పలు సూచనలు చేసింది. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్ట్ పై కూడా సిట్ విచారణ చేస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని, విచారణ ఎక్కడి వరకు వచ్చిందనే విషయాలను ప్రత్యేక దర్యాప్తు టీమ్ తెలుసుకుంటుంది. కేసుల్లో నిందితులుగా ఉన్న రాజకీయ నేతల అరెస్ట్ లపై కూడా స్థానిక పోలీసులకి సిట్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
తొలి దశ ఓటింగ్ తర్వాత ఆందోళన.. విదేశీ ఏజెన్సీల సర్వేపై అమిత్ షా ఏమన్నారంటే
తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆందోళన చెందానని, అయితే మూడో దశ తర్వాత విపక్షాల ఓటర్లు తక్కువగా ఓట్లు వేసినట్లు తేలిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీకి అనుకూలంగా ఫలితం రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవడం మంచిదని వారు భావిస్తున్నారు. అయితే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. వారు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి. కానీ ఇండియా కూటమి ఓటర్లలో చాలా గందరగోళం కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలలో గతంలో ఎక్కువ ఓటింగ్ జరిగేదని, ఈసారి అక్కడ కూడా తక్కువ ఓటింగ్ నమోదైందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ మద్దతు ఎక్కువగా ఉన్న చోట ఓటింగ్ తగ్గింది. కొందరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బీజేపీ చెప్పుకున్నన్ని సీట్లు గెలవలేదని భావిస్తున్నారని అమిత్ షాను మీడియా ప్రశ్నించగా .. విదేశీ ఏజెన్సీలు దేశంలో సర్వేలు సరిగా నిర్వహించలేకపోతున్నాయని అన్నారు.
17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు..ఇరాన్ అధ్యక్షుడి మృతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. ఘటన జరిగి చాలా గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. సహాయక బృందం ప్రమాద స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. పలు ఇరాన్ మీడియా ఛానెల్‌లు రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీమ్‌లు కనుగొన్నాయని చెప్పాయి. అయితే, అధ్యక్షుడు, అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దానిపై రెడ్ క్రెసెంట్ సమాచారం అందించలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్, సెక్యూరిటీ చీఫ్ , ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది. ప్రమాదం గురించి తదుపరి సమాచారం అందుబాటులో లేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ కూడా కాన్వాయ్ హెలికాప్టర్‌లో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు వారి గమ్యస్థానంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడ్డాయి.
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విధ్వంసం.. వైమానిక దాడిలో 27 మంది మృతి
ఎనిమిది నెలలుగా హమాస్‌తో కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం ఆదివారం మరో రూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 27 మంది మరణించారు. అయితే, యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలిస్తారనే ప్రశ్నపై ఇజ్రాయెల్ నాయకులు అనేక వర్గాలుగా విడిపోయారు. యుద్ధ మంత్రివర్గంలోని ఇద్దరు సభ్యులు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును విమర్శించారు. అతని ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బెన్నీ గాంట్జ్ రాజీనామా చేస్తానని బెదిరించాడు. జూన్ 8 లోగా అంతర్జాతీయ పరిపాలనతో కూడిన గాజా కోసం యుద్ధానంతర ప్రణాళికను రూపొందించకపోతే, అతను ప్రభుత్వం నుండి తప్పుకుంటానని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి సౌదీ అరేబియాతో ప్రతిష్టాత్మకమైన అమెరికా ప్రణాళికను చర్చించడానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ నాయకులతో సమావేశమవుతారని భావిస్తున్నారు. ఈ సమావేశం ఉద్దేశ్యం గాజాను పాలించడంలో పాలస్తీనా అథారిటీకి సహాయం చేయడం కూడా.. సెంట్రల్ గాజాలోని పాలస్తీనా శరణార్థి శిబిరం అయిన నుసిరత్‌లో వైమానిక దాడిలో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు సహా 27 మంది మరణించారు. ఇంతలో పాలస్తీనా రెడ్ క్రెసెంట్ అత్యవసర సేవ ప్రకారం.. నుసిరత్‌లోని ఒక వీధిలో వేర్వేరు దాడిలో ఐదుగురు మరణించారు. హమాస్ ఆధ్వర్యంలోని పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి కూడా దీర్ అల్-బలాలో మరణించారు.
ఎన్టీఆర్ కి బావా బామ్మర్దుల స్పెషల్ బర్త్ డే విషెస్..మరి మహేష్ ఏమన్నాడంటే..?
నేడు మే 20 ఎన్టీఆర్ అభిమానులకి ఈ రోజు ఓ పెద్ద పండుగ అని చెప్పొచ్చు.దేనికంటే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.ఎన్టీఆర్ ను అమితంగా అభిమానించే అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజును పండుగలా జరుపుకుంటారు.తమ హీరో బర్త్ డే సందర్భంగా అభిమానులు కేకులు కట్ చేసి పాలాభిషేకాలు చేయడం .అలాగే అన్నదానం, రక్తదానం వంటివి చేయడం.పేద వారికీ సహాయం చేయడం వంటి పనులు చేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక ఇండస్ట్రీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన ఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఇలాంటి వేడుకలు నువ్వు మరెన్నో జరుపుకోవాలి అని విష్ చేసాడు..అలాగే FEAR is FIRE..అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు.రాంచరణ్ తన ఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ తారక్ అంటూ ట్వీట్ చేసాడు.ఇలా బావ బావమరిది ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్ తెలిపారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు మరో స్టార్ హీరో బర్త్ డే విషెస్ తెలిపారు .ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.మహేష్ తనఎక్స్ ఖాతాలో హ్యాపీ బర్త్ డే తారక్ ఈ సంవత్సరం నువ్వు మరింతగా సక్సెస్ సాధిస్తూ ఆనందంగా ఉండాలి అని ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఈ స్టార్ హీరోల ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.