పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి చేయడం వల్ల ప్రపంచ దృష్టి పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్ వైపు మళ్లిందని, పాకిస్తాన్ అబద్ధాలను మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసిందని రూబిన్ అన్నారు.
లిక్కర్ స్కాం కేసులో సిట్ కస్టడీలోకి సజ్జల శ్రీధర్ రెడ్డి..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డినీ విచారించనున్నారు సిట్ అధికారులు. జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డిని తీసుకు వచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో ఏ6గా శ్రీధర్ రెడ్డి ఉన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణ కొనసాగనున్నది. నిన్న ఇద్దరిని ఆరున్నర గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. లిక్కర్ కేసులో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు చెప్పారు.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరుతారు. కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతీ పుష్కర ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు కాళేశ్వరంలోని పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
పీవోకే ఉగ్ర శిబిరాలు నేలమట్టం కావాలి.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ఎంపీ..!
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే కావడం విషాదకరం. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించింది. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”ను బ్లాక్‌మన్ కొనియాడారు.
పాత బస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 10 మంది
హైదరాబాద్ పాత బస్తీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బేగంబజార్ లోని మహారాజ్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైల్లో ఉన్న వంశీ అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలకు భారీ ఊరట లభించింది. జూన్ 3 వరకు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్వయంగా తెలిపింది. దాంతో కగిసో రబాడా, ఐడెన్ మార్‌క్రమ్, ఫాఫ్ డుప్లెసిస్, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్.. తదితరు ప్లేయర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. త్వరలోనే ప్రొటీస్ ప్లేయర్స్ భారత్ రానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఒక వారం పాటు నిలిపివేయబడిన ఐపీఎల్ 2025.. మే 17న తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ నడిబొడ్డున దారుణం.. టీ తాగడానికి వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై హత్య
నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలు ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్‌లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని ఐదుగురు దుండగులు కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌కు టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతడిని రక్తపు మడుగులో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్
ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు.
సోషల్ మీడియా పిచ్చికి హద్దులుండాలి.. ఆర్టీసీ సిబ్బందిని ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ, “ఇదేం వెర్రి కామెడీ!? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?” అని తీవ్రంగా ప్రశ్నించారు.