నేడు మంగళగిరికి పవన్ కల్యాణ్.. రేపటి నుంచే వారాహి యాత్ర..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడ చేరుకోనున్నారు.. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు పవన్.. అక్కడ నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు పవన్.. కాగా, రేపటి నుంచి కృష్ణా జిల్లాలో నాల్గో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభంకానున్న విషయం విదితమే.. అవనిగడ్డ బహిరంగ సభతో కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. అవనిగడ్డలోని వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో మధ్యహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఇక, కృష్ణా జిల్లాల్లో ఐదు రోజుల పాటు వారాహి యాత్ర సాగనుంది.. మచిలీపట్నంలో అక్టోబర్ 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు పవన్.. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నేతలతో సమావేశం కానున్నారు.. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. 4వ తేదీన పెడన, 5వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు జనసేన పార్టీ శ్రేణులు. వారాహి విజయయాత్ర కోసం సమన్వయకర్తలను నియమించింది జనసేన.. అవనిగడ్డ నియోజకవర్గానికి పోతిన వెంకట మహేష్, తాతంశెట్టి నాగేంద్ర, మండలి రాజేష్.. పెడన నియోజకవర్గానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అమ్మిశెట్టి వాసు, చిల్లపల్లి శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గానికి ముత్తా శశిధర్, చనమల్ల చంద్రశేఖర్‌ను సమయన్వయకర్తలుగా నియమించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇక.. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఈ యాత్ర తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయన్న ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం అన్నారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుందని వెల్లడించారు. కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే మూడు విడతలుగా వారాహి విజయయాత్రను పూర్తి చేశారు.. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో వారాహి యాత్ర నిర్వహించిన ఆయన ఇప్పుడు కృష్ణా జిల్లాలో వారాహి విజయయాత్రకు సిద్ధమయ్యారు.
గుంటూరు మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్..! అధికారుల సీరియస్
గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది.. సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.. అయితే, మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణపై అధికారుల సీరియస్‌గా స్పందిచించారు.. మెడికల్ కాలేజీ వార్డెన్ లను, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను తన ముందు హాజరుపరచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ జీవన్ ప్రదీప్.. మెడికల్ కళాశాలలో జరుగుతున్న వ్యవహారాలు, ర్యాగింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టారు కాలేజీ అధికారులు.. ర్యాగింగ్ కళాశాల ఆవరణలో జరిగిందా..? లేక మరి ఎక్కడైనా జరిగిందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.. అయితే, ర్యాగింగ్ ఎక్కడ జరిగినా దాని తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు మెడికల్ కాలేజీ అధికారులు.
చంద్రబాబుకు మరో షాక్.. మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ వేటు..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రటరీ (పీఎస్) పెండ్యాల శ్రీనివాస్‌పై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు శ్రీనివాన్‌ను సస్పెండ్ చేసింది.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు శ్రీనివాస్.. ఏ పీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో కీలకంగా శ్రీనివాస్ ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరినట్టు సీఐడీ అభియోగాలు మోపింది.. దీంతో.. శ్రీనివాస్‌పై చర్యలకు పూనుకుంది.. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రస్తుతం శ్రీనివాస్ అమెరికా పారిపోయినట్టు తెలుస్తోంది.
విశాఖ తీరంలో మిస్టరీ బాక్స్‌పై ఉత్కంఠకు తెర.. అసలు అది పెట్టే కాదు..!
విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చెక్క పెట్టెపై పెద్ద రచ్చే జరిగింది.. ఆ మిస్టరీ బాక్స్‌లో ఏముంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? సంఘ విద్రోహుల చర్య..? ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయా? అనే ఆసక్తితో పెద్ద సంఖ్యలో స్థానికులకు, పర్యాటకులు తరలివచ్చారు.. వైజాగ్ వైఎంసీఏ బీచ్ తీరానికి అర్థరాత్రి కొట్టుకొని వచ్చిన చెక్క పెట్టెను ఎప్పుడు తెరుస్తారంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.. చివరకు సముద్ర అలలతో కొట్టుకొని వచ్చిన చెక్క పెట్టెలో ఏమీ లేదని తేలిపోయింది. అది వట్టి చెక్కపెట్టె మాత్రమే.. అంటే అది పెట్టె కూడా కాదనే చెప్పాలి.. ఎందుకంటే వరుగా చెక్కలు మాత్రమే ఉన్నాయి.. వాటి మధ్యలో ఎలాంటి గ్యాప్ కూడా లేదన్నమాట.. అయితే.. ఆ చెక్కపెట్టెపై సమాచారం అందుకున్న పోలీసులు.. దానిని తెరిచేందుకు 2 ప్రొక్లెయిన్‌ని ఉపయోగించారు. లోపల కూడా చెక్కలే తప్ప ఇంకేమీ లేదని గుర్తించారు. ఆ చెక్కలను వేరే చేసే సమయంలో.. ఎలాంటి పేలుడు పదార్థాలైనా ఉన్నాయేమోనన్న అనుమానంతో జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.. 5 వరుసల చెక్కలతో ఉన్న ఈ పెట్టెను తెరిచేందుకు 2 ప్రొక్లెయిన్‌ని ఉపయోగించారు. చివరకు లోపల కూడా చెక్కలే తప్ప ఇంకేమీ లేదని తెలిసి షాక్ తిన్నారు.. అయితే, ఆ చెక్కలను వేరే చేసేందుకు ముందు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి.. ఈ తనిఖీల్లో ఆ బృందాలకు ఏమీ లభించలేదు. దాంతో ఈ పెట్టెను పగలగొట్టించేందుకు రెండు ప్రొక్లెయినర్లను రంగంలోకి దించారు. అయితే, ఓడలు తీరంలో ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ఉండేందుకు అడ్డుగా దీనని వాడుతుంటారని అధికారులు చెబుతున్నారు.. మొత్తంగా ఆ పెట్టె ఏకంగా 100 టన్నుల బరువు ఉండటంతో.. అందులో ఏముంది అనేదానిపై ఆసక్తి నెలకొనగా.. అది చివరకు వట్టి చెక్కలు మాత్రమేనని తేలిపోయింది.
క్లారిటీతో ఉన్నాం.. మేం టీడీపీతో కలిసి పోటీ చేస్తాం..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ మాత్రమే క్లారిటీతో ఉన్నాయి.. మేం తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో పోటీ చేస్తాం అని ప్రకటించారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. వైసీపీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తోంది.. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆరోపించిన ఆయన.. అందుకే తాము వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రకటించారు.. ఇక, గౌతం అదానీకి గ్రీన్ ఛానెల్ వెల్కం చెప్పడం దురదృష్టకరం అన్నారు రామకృష్ణ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 1400 ఎకరాల భూమిని అమ్మడానికి అమిత్ గుప్తాకు అప్పజెప్పారని విమర్శలు గుప్పించారు. 1400 ఎకరాలు దక్కించుకోడానికే సీఎం వైఎస్ జగన్‌తో అదానీ భేటీ జరిగిందని ఆరోపించారు.. మరోవైపు.. కమ్యూనిష్టులు అమ్ముడు పోయారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనడం దురదృష్టం అన్నారు రామకృష్ణ.. సజ్జల మాటలు ఆయన మాస్టర్ చెప్పించిన మాటలుగా భావిస్తున్నాం అన్నారు.. ఇక, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఏనాడూ విశాఖ స్టీల్ ప్లాంట్ ధర్నాల వద్దకు పోలేదని వ్యాఖ్యానించారు.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడుతున్న జీవీఎల్.. ఎన్నాళ్లూ గాడిదలు కాస్తున్నాడా..? అని నిలదీశారు. మరోవైపు.. స్మార్టు మీటర్లు ఏర్పాటు చేయడానికి కూడా అదానీకి అప్పజెప్పారని విమర్శించారు.. చండీగఢ్ లో 9,000 ఉన్న స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రంలో 30 వేలు ఎలా అయ్యాయి? అని ప్రశ్నించారు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, అదానీ, సీఎం వైఎస్ జగన్ కలిసే ఇదంతా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, ఏపీలో ఎన్నికల పొత్తులపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది.. తమతో పొత్తుపై బీజేపీయే నిర్ణయం తీసుకోవాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయని స్పష్టం చేసిన విషయం విదితమే.. ఇప్పుడు టీడీపీ, జనసేనకు సీపీఐ కూడా తోడైనట్టు అయ్యింది.
స్కామ్‌ల వారసత్వంతో కాంగ్రెస్ స్కాంగ్రెస్‌గా మారిపోయింది
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ పై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికలకు నిధులు సమీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు బిల్డర్లపై పన్నులు వేస్తోందని విమర్శించారు. రాజకీయ ఎన్నికల పన్ను చదరపు అడుగుకు రూ.500 చొప్పున ప్రారంభమైందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ట్విట్టర్ ఆరోపించింది. అంతేకాకుండా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కామ్‌ల వారసత్వంతో స్కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కర్నాటక నిధులు తీసుకొచ్చి ఎన్ని ఖర్చు చేసినా ఇక్కడి ప్రజలను మోసం చేయలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలపై ట్విట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం..వంచన.. ద్రోహం.. దోఖాలమయం అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ..! అన్నారు. కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..! అన్నారు. కాలకేయుల కాలం వస్తే.. కరెంట్ కోతలు..కటిక చీకట్లు గ్యారెంటీ..! అని నిప్పులు చెరిగారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి అంటూ మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ..! అన్నారు. దగాకోరుల పాలనొస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ..! తెలిపారు. బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా..ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ..! అంటూ ట్వీట్ వైరల్ అయ్యింది.
ముంచెత్తుతున్న వరదలు న్యూయార్క్ లో ఎమర్జెన్సీ
ఇటీవల ప్రపంచ దేశాలన్నీ వరదలు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటీవల లిబియాలో సంభవించిన వరతల కారణంగా వేల మంది చనిపోయారు. మొరాకోలో వచ్చిన భూకంపం కారణంగా కూడా కొన్ని వందల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాది చివరిలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులన్నీ జలమయం కాగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. ఆఖరికి న్యూయార్క్ విమానాశ్రయంలోకి కూడా నీరు చేరింది. దీంతో ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను కూడా మళ్లించారు. ఇక శనివారం కూడా వరద ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. అందుకే అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తు్న్నారు. వరద కారణంగా వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆగిపోయాయి. ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక రైళ్ల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. సబ్ వేలలోకి వరద నీరు చేరడంతో రైళ్లను అధికారులు రద్దు చేశారు. రెండేళ్ల కిందట కూడా సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో వరదలు బీభత్సం సృష్టించాయి. బ్రూక్లిన్, క్వీన్స్ రాష్ట్రాల్లో వరదల కారణంగా గతేడాది 13 మంది చనిపోయారు. ఇక ఈ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
ఆరోగ్యంగా ఉడడం చాల అవసరం. ఎందుకంటే ఏది కోల్పోయిన సంపాదించుకోగలం. కానీ.. ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించుకోలేం.. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు కొందరు. మరికొందరు ఆరోగ్యంగా ఉండేదుకు సమయం కేటాయించిన ఆరోగ్యాన్ని మాత్రం సంరక్షించుకోలే పోతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండడానికి ఎం చెయ్యాలో ఎప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అన్ని ఆనారోగ్య సమస్యలకి మూల కారణం అధిక బరువు. అందుకే మొదట బరువుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. బరువు తగ్గాలి అనుకుని చాలా మంది ఆహరం తినడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం అటుంచి శరీరంలో నీరు చేరి బరువు పెరుగుతారు. దీని వల్ల ఇంకా లావుగా కనిపించడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే తినడం మానేయకూడదు. తినే ఆ ఆహరం ఆరోగ్యవంతమైనదిగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహరం అంటే మొలకెత్తిన గింజలు, ఎగ్ వైట్, చిరుధాన్యాలు, ఉడకబెట్టిన పప్పులు, వంటి ఆహారం తీసుకోవాలి. అలానే కొవ్వు, చక్కెర స్థాయిలు అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. నీళ్లు ఎక్కువగా తాగాలి, వ్యాయామం చెయ్యాలి. 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఆరోగ్యవంతమైన నిద్ర అధిక బరువుని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలానే ధూమపానం మరియు మద్యపానం బరువుని పెంచుతుంది. అందుకే అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.
పన్ను శాఖ టార్గెట్‌లో వేల కంపెనీలు.. 30 రోజుల్లో సమాధానం చెప్పాలని అల్టిమేటం
జీఎస్టీ విభాగం ప్రస్తుతం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జీఎస్టీ చెల్లించని కంపెనీలకు నిరంతరం నోటీసులు పంపబడుతున్నాయి. ఇటీవల జీఎస్టీ శాఖ పలు బీమా కంపెనీలకు నోటీసులు పంపింది. ఇప్పుడు 2018 ఆర్థిక సంవత్సరం విషయానికి సంబంధించి జీఎస్టీ విభాగం నుండి వేలాది కంపెనీలకు నోటీసులు పంపబడ్డాయి. అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకీకి కూడా జీఎస్టీ విభాగం నుండి షోకాజ్ నోటీసు వచ్చింది. దేశవ్యాప్తంగా వేలాది కంపెనీలకు నోటీసులు పంపబడ్డాయి. ఈ నోటీసులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి. వారు పన్ను చెల్లింపులో లోటును క్లెయిమ్ చేస్తారు. కంపెనీలకు నోటీసు పంపడానికి గడువు సెప్టెంబర్ 30. నోటీసుపై స్పందించేందుకు అన్ని కంపెనీలకు జీఎస్టీ విభాగం 30 రోజుల గడువు ఇచ్చింది. కంపెనీల జీఎస్టీ అవుట్‌పుట్‌లు, బాధ్యతలు సరిపోలడం లేదని జీఎస్టీ విభాగం గుర్తించింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను తప్పుగా క్లెయిమ్ చేయడం, మినహాయించబడిన సరఫరాల విషయంలో క్రెడిట్ రివర్సల్ వంటి కారణాలతో కూడా నోటీసులు పంపబడ్డాయి. గత 15 రోజులుగా కంపెనీలకు ఈ నోటీసులు పంపారు. గతంలో 6 బీమా కంపెనీలకు జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందినట్లు వార్తలు వచ్చాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అనే బీమా కంపెనీ కూడా నోటీసులు అందుకోవడం గురించి స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. బీమా కంపెనీల విషయానికొస్తే తాము రీ-ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు తీసుకున్నామని, అయితే తదుపరి జీఎస్‌టీ చెల్లించలేదని జీఎస్టీ విభాగం తెలిపింది.
యాక్షన్ హీరోలా మస్క్.. రైఫిల్ తో కాల్పులు.. వైరల్ వీడియో
ప్రముఖ టెక్ దిగ్గజం, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియోలో అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ జోడించి మస్క్ ఈ వీడియోను స్వయంగా పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లక్షల సంఖ్యలో లైక్ చేస్తున్నారు. వేల మంది కామెంట్లు చేస్తున్నారు. నిజంగా సినిమాలో హీరోలా ఉన్నారంటూ చాలా మంది మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక కొంతమంది అయితే హాలివుడ్ హీరోలను మించిపోయి ఉన్నారని సినిమాలు తీయ్యండి అంటూ సలహా ఇచ్చేస్తున్నారు. ఇక మస్క్ ఇప్పుడే కాదు గతంలో కూడా తుపాకులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. నిత్యం తన బెడ్ పక్కన తుపాకులు ఉంటాయి అంటూ గత నవంబర్ లో ఆయన రెండు పిస్టళ్లు ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక అసాల్ట్ రైఫిల్ వినియోగంపై కూడా గతంలో టెక్సాస్ లో ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిగినప్పుడు మస్క్ స్పందించారు. వాటి వినియోగం పై ఆంక్షలు విధించాలని కొనుగోలుదారుకు గురించి అన్ని తెలుసుకొని నేరచరిత్ర లేదని నిర్ధారించుకున్నాకే వారికి పర్మిషన్ ఇవ్వాలని మస్క్ గతంలో కోరాడు. ఇక ఈ రోజు ఉదయమే మస్క్ వీడియో షేర్ చేయగా అది కొద్ది సేపట్లోనే వైరల్ గా మారిపోయింది. దీన్ని బట్టే ఎలాన్ మస్క్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని కోట్ల మంది వీక్షించగా, లక్షల మంది లైక్ చేశారు.
అదరహో అనిపించిన 3D లైట్ డ్రెస్.. ఎంత బాగుందో..
ప్యారిస్ ఫ్యాషన్ వీక్ సార్టోరియల్ లైట్లతో మెరిసిపోయింది.. ఫ్యాషన్ ప్రముఖులను మరియు ఔత్సాహికులను ఆకట్టుకుంది. టెక్నాలజీతో అద్భుతాన్ని సృష్టించారు.. 3D లైట్ లను ఉపయోగించి ఒక వెరైటీ డ్రెస్సును రూపొందించారు.. ఆ డ్రెస్సు కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ‘డీప్ మిస్ట్,'” అనే శీర్షికతో ఫ్యాషన్ ప్రపంచంలో షాక్ వేవ్‌లను పంపింది..అభిమానులు మరియు అనుచరుల నుండి విస్తృతమైన ప్రతిచర్యలను ప్రేరేపించింది.. అండర్‌కవర్ ద్వారా “డీప్ మిస్ట్” సేకరణ 3D సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడంతో ఫ్యాషన్‌ను నిర్దేశించని ప్రాంతంలోకి తీసుకువెళ్లింది. అద్భుతమైన భాగాలు 3D దుస్తులు, దాని ఆకృతి, లైటింగ్ మంత్రముగ్దులను చేసే పరస్పర చర్యను సృష్టిస్తుంది. ముఖ్యంగా, ఈ దుస్తులు పారదర్శకంగా ఉండే ప్యానెల్‌ను కలిగి ఉంటాయి, ఇవి సున్నితమైన పూలు, ఆకులతో రూపోందించారు..
ఈవారం బాక్స్ ఆఫీస్ బరిలో అరడజను తెలుగు సినిమాలు
ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం నాడు కూడా చాలా చిన్న సినిమాలు రిలీజ్ కి కర్చీఫులు వేసుకున్నాయి. సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్పు అనేక సినిమాల రిలీజ్ డేట్ల మార్పుకు కారణం అయింది. ఇక ఈ క్రమంలో వచ్చే వారం అంటే అక్టోబర్ 6న ఏకంగా అర డజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కి రెడీ అయిన సినిమాల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఒక వారం వాయిదా పడి అక్టోబర్ 6న రిలీజ్ అవుతోంది. సుధీర్ బాబు భిన్న పాత్రలలో కనిపిస్తున్న మామా మశ్చీంద్ర సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి రచయితా, నటుడు హర్ష వర్ధన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక అదే రోజు జూ. ఎన్టీఆర్ బావమరిది హీరోగా నటిస్తున్న మాడ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అభయ్ నవీన్ హీరోగా నటిస్తున్న రాక్షస కావ్యం అనే చిన్న సినిమాతో పాటు నవీన్ చంద్ర హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన మంత్ ఆఫ్ మధు అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరకెక్కిన 800 సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది. మరి ఈ ఆరు సినిమాలో ఏయే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనుకున్నాయి అనేది చూడాలి మరి.