చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. బాబు, పవన్‌పై సంచలన వ్యాఖ్యలు
అంతా ఊహించినట్టుగా జరిగింది.. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిడవోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను చంద్రబాబు లాగా మోసాలు చేయలేదన్నారు.. అవినీతి కేసులో అరెస్టయిన మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెప్తా.. ఆలోచించండి అంటూ సూచించిన ఆయన.. ఇన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించు కునేందుకు దొంగలా ముఠా ఉంది అని ఆరోపించారు.. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే.. మాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో.. అదే శిక్ష రాజకీయ నాయకులకు వర్తిస్తుంది అని చెప్పేవాళ్లు చంద్రబాబుకు లేరు అని సెటైర్లు వేశారు. ఇక, ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు దొంగగా అడ్డంగా దొరికినా కూడా దోపిడీ సొమ్ము అని ప్రజలకు అర్థం అయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించే వాళ్లు సిద్ధం అయ్యారని మండిపడ్డారు సీఎం జగన్.. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏ ఒక్కరూ రెడీగా లేరన్న ఆయన.. చంద్రబాబు దోచిన దాంట్లో వాటదారులు కాబట్టి.. ఇంత అన్యాయం జరుగుతున్న ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడు. ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం అనేది ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి నిబంధనలు పక్కన పెట్టి దోపిడీ చేశారు ఆరోపించారు వైఎస్ జగన్.. సీమెన్స్ తమకు డబ్బు ముట్ట లేదు అని చెప్పింది.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో నిర్ధారించిందని పేర్కొన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య మృతి..
రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.. దీనికి ప్రధాన కారణం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అక్కడే రిమాండ్‌లో ఉన్నారు.. అయితే.. చంద్రబాబు జైలుకు వచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడంపై చర్చ సాగింది.. దీనిపై వ్యక్తిగత కారణాలు వివరణ ఇచ్చినా.. విమర్శలు ఆగలేదు.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి కన్నుమూశారు.. ఆమె వయస్సు 46 ఏళ్లు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిరణ్మయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచారు.. కిరణ్మయి మృతికి జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీష్ సహా పలువురు అధికారులు సంతాపం తెలిపారు. ఇక, రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై విమర్శలపై మండిపడుతున్నారు అధికారులు.. దీనిపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య చనిపోయిన విషయంపై మీడియా వక్రీకరించి వార్తలను ప్రచురించవద్దని జిల్లా ఎస్పీ, కోస్తా జిల్లాల జైళ్ళ శాఖ డీఐజీ పేర్కొన్నారు. రాజమండ్రి లోని నవీన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రాహుల్ భార్య కిరణ్మయి చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్లు డీఐజీ శుక్రవారం రాత్రి తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని రెండు రోజుల క్రితం సెలవు తీసుకొని వెళ్లినట్లు జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ రాహుల్ భార్య చనిపోయినట్లు తెలిపారు. ఇలాంటి బాధాకర సమయంలో.. జైలు ఉన్నతాధికారుల వద్ద క్లారిఫికేషన్ తీసుకుని మీడియా ప్రతినిధులు వాస్తవాలు రాయాలని డీఐజీ సూచించారు.
మాట మార్చిన ఏయూ ప్రొఫెసర్.. నేను అలా అనలేదు..!
ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) హిందీ విభాగం ప్రొఫెసర్ ఎన్. సత్యనారాయణ ఉన్నట్టుండి మాటమార్చారు.. గతంలో 1400 పీహెచ్‌డీ పట్టాలను వర్సీటీ అధికారులు అమ్ముకున్నారంటూ సంచలన కామెంట్స్ చేసిన ప్రొఫెసర్ సత్యనారాయణ.. ఇప్పుడు ఏయూ నాకు తల్లిలాంటిది అంటున్నారు.. హిందీ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న నల్లా సత్యనారాయణ.. ఏయూలో పీహెచ్‌డీ సీట్లు అమ్ముకున్నారని నేను స్వయంగా అనలేదన్నారు.. నాకు విద్యతో పాటు ఏయూ అన్ని ఇచ్చిందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నాకు మాతృమూర్తితో సమానం.. ఏయూలో పీహెచ్‌డీ అమ్ముకున్నారని పలువురు కరపత్రాలు వేసి ప్రచారం చేస్తున్నారని మాత్రమే చెప్పాను అని క్లారిటీ ఇచ్చారు.. దీనిని వక్రీకరిస్తూ ఏయూలో పీహెచ్‌డీ అమ్ముకుంటున్నారని నేను అన్నట్లు ప్రచారం జరిగిందన్నారు సత్యనారాయణ. మరోవైపు.. గతంలో నాపై వచ్చిన లైంగిక ఆరోపణలు అవాస్తవం.. పీహెచ్‌డీ థీసీస్ కు సంబంధించిన చిన్న వివాదాన్ని కొందరు పక్కవారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ సత్యనారాయణ. ఏయూ ప్రతిష్టకు భంగం వాటిల్లడం నాకు ఇష్టం లేదు.. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు నాకు తీవ్ర మనోవేదన కలిగించాయన్నారు ఏయూ హిందీ విభాగం ప్రొఫెసర్ నల్లా సత్యనారాయణ.
రాజీనామా చేసిన తుమ్మల.. టీఆర్ఎస్‌లో సహకరించినందుకు ధన్యవాదాలు..
సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్‌లో కొనసాగుతారా? రాజీనామా చేస్తారా? ఏ పార్టీలో చేరతారు అనే చర్చ గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ఆయనతో వరుసగా కాంగ్రెస్ నేతలు సమావేశం కావడంతో.. ఆయన కాంగ్రెస్ గూటికే చేరుతారనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక, వచ్చే ఎన్నికలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీకి దూరమైన తుమ్మల నాగేశ్వరరావు.. ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ మేరకు ఈ రోజు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు.. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు.. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. అయితే, ఇక్కడే మరో చర్చ సాగుతోంది.. ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాజకీయ పార్టీగా మారింది.. ఇక, ఈ మధ్య జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్.. టీఆర్ఎస్‌ను కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ తీర్మానం చేయించడం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ తీర్మానం అందజేయడం అన్ని జరిగిపోయాయి.. ఇప్పుడు తమ రాజీనామా లేఖలో తుమ్మల.. తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు.. అని రాసుకొచ్చారు.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్నారు.. ఆ తర్వాత మళ్లీ టీఆర్ఎస్‌లో యాక్టివ్ రోల్ పోషించారు. కానీ, బీఆర్ఎస్‌గా మారిన తర్వాత క్రమంగా ఆయన్ని దూరం పెట్టారని తుమ్మల అనుచరులు చెబుతున్నమాట.. అదే కోణంలో.. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు.. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అని పేర్కొంటూనే.. బీఆర్ఎస్‌లో తనకు సరైన సహకారం అందలేదు అనే విషయాన్ని తన లేఖ ద్వారా తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ సాగుతోంది.
దేశం ముఖ్యం… ‘ఇండియా కూటమి లక్ష్యం అదే..
ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సీట్ల త్యాగాలు పెద్ద లెక్కేముంది.. దేశం ముఖ్యం..”ఇండియా” కూటమి లక్ష్యం అదే అన్నారు సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి.. నాలుగేళ్ల సెలవు తర్వాత, నేను ఏమీ అడగకుండానే పార్టీ అధినాయకత్వం గురుతర బాధ్యతలు ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి రాష్ట్ర ప్రజలు.. కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు.. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తోందన్న ఆయన.. కర్నాటక లో ఘన విజయంతో కాంగ్రెస్ పూర్వ వైభవం పునఃప్రారంభంమైంది. తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడం, తదనంతరం ఏపీలో బలపడడం ఖాయం.. దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే విశ్వాసం నాకుందన్నారు రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీతో సహా “ఇండియా” భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా లోకసభ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవడం ఖాయం అన్నారు రఘువీరా.. “ఇండియా” కూటమి ఐక్యతను చూసి, పోటీగా ఎన్డీఏ కూటమి సమావేశాన్ని బీజేపీ నిర్వహించిందని దుయ్యబట్టారు.. గతంలో ఏనాడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంప్రదించని బీజేపీ.. “ఇండియా”ను చూసి భయంతోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఆరోపించారు రఘువీరారెడ్డి.. కాగా, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నత స్థాయి విధాన నిర్ణయాక సంఘం సీడబ్ల్యూసీ సభ్యుడుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నియామకమైన ఏకైక నాయకుడు రఘువీరారెడ్డి కావడం విశేషంగా చెప్పుకోవాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎమ్మెస్సార్ సీడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్న విషయం విదితమే.
సెప్టెంబర్ 27 న రానున్న ఫలితాలు.. త్వరలోనే ఆన్సర్ కీ విడుదల…
తెలంగాణ రాష్ట్రం లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సెప్టెంబరు 15 న సజావుగా జరిగింది.. రాష్ట్రవ్యాప్తం గా నిర్వహించిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్ష కు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.గతం లో కఠినం గా వచ్చిన పేపర్-1 ప్రశ్నపత్రం ఈసారి సులభం గా రావడం జరిగింది.. పేపర్-2 ప్రశ్న పత్రం మాత్రం కాస్త కఠినంగా ఇవ్వడం జరిగింది.. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినం గా ఉన్నాయి. అయితే టెట్ పేపర్-1 పరీక్ష కు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు. ఇక పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు. టెట్ ప్రాథమిక కీ ని మరో మూడు, నాలుగు రోజుల్లో అధికారిక వెబ్ సైట్ లో అందుబాటు లో ఉంచనున్నారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాత నే కీ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. తాత్కాలిక కీ విడుదల అయిన తరువాత అభ్యంతరాల ను స్వీకరించి ఆ తరువాత ఫైనల్ కీ విడుదల చేస్తారు.. అయితే ఈ పరీక్ష లో అక్కడక్కడ ఓఎమ్మార్ షీట్ల పంపిణీ లో తప్పిదాలు జరిగాయని సమాచారం..కొన్నిచోట్ల ఒక పేపర్ కు బదులు మరో పేపర్.. ఒక అభ్యర్థి ఓఎంఆర్ బదులు మరో అభ్యర్థి ఓఎంఆర్ ను పంపిణీ చేయడం జరిగింది. ఆ తరువాత ఓఎంఆర్ లో జరిగిన తప్పులను వైట్నర్ తో సరి చేసారు.. వైట్నర్ వాడిన ఓఎంఆర్ షీట్లు కూడా చెల్లుబాటు అవుతాయని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.అయితే ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల 27 న విడుదల కానున్నట్లు అధికారులు తెలియజేసారు..
మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్‌తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి
వేధింపులు సాధారణ మహిళలకే కాదు ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా సర్వసాధారణం. కొద్ది నెలల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్ హైదరాబాద్‌లోని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో మహిళా ఐఏఎస్ కూడా వేధింపులకు గురికావడం షాకింగ్‌గా మారింది. ఈ ఘటనపై మహిళ ఐఏఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు షాక్ కు గురయ్యారు. ఇలా మహిళా ఐఏఎస్ పోలీసులపై వేధించడ సర్వసాధారణంగా మారుతుందని. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. బాధిత ఐఏఎస్ సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ శాఖలో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే ఆమెను కలవాలని శివప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. తాను మహిళా ఐఏఎస్‌కి వీరాభిమానిని అని పేర్కొంటూ, సోషల్ మీడియాలో కూడా ఆమెను ఫాలో అవుతున్నట్లు పేర్కొంది. గత నెల 22న కూడా మహిళా ఐఏఎస్‌లను కలిసేందుకు ఆమె విధులు నిర్వహిస్తున్న కార్యాలయానికి వెళ్లాడు. అయితే శివప్రసాద్ తరచూ తనను కలవడానికి వస్తున్నాడని తెలుసుకున్న మహిళా ఐఏఎస్.. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ 13) నేరుగా మహిళా ఐఏఎస్ ఉంటున్న ఇంటి చిరునామాను తెలుసుకుని శివప్రసాద్ అక్కడికి వెళ్లారు.
తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీల రాజకీయం.. కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎన్నికల యుద్ధం నడుస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. అలాగే రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు హాజరవుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆరు హామీల పేరుతో ఎన్నికల హామీలను కూడా ప్రకటిస్తామన్నారు. మరోవైపు సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రేపు పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ సభ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ సందర్భంగా నగరంలో కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నిస్తూ ప్రత్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ప్రశ్నిస్తూ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై ఫ్లెక్సీలు పెట్టారు. 100 మంది వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్నారు. వారిని ఆహ్వానిస్తూ బ్యానర్లు కనిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాదు.
ఆర్థికాభివృద్ధిలో భారత్ ముందుకు.. అగ్రరాజ్యాలు వెనక్కు
రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన డబ్ల్యూఈఎఫ్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిలకడ లేని రాజకీయ, ఆర్థిక విషయాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన ప్రభావం చూపనున్నాయి. రాజకీయ, ఆర్థికపరమైన ఒడిదుడుకుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేక పోవచ్చని 10 మందిలో 6 మంది నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది. అలానే ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలలో చోటు చేసుకున్న ఉద్రిక్తలు కూడా అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని 75 % మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతర్జాతీయ పరంగా చోటు చేసుకుంటున్న ఒడిదుడుకుల ప్రభావం అభివృద్ధి చెందిన దేశాలపైనే అధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉండొచ్చని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అన్ని ఆటోల్లో జీపీఎస్ ట్రాకింగ్.. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది. అలా చేయని డ్రైవర్లకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం నిర్ణయించిన మీటర్ బాక్స్ ప్రకారం ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆటో రిక్షా డ్రైవర్లు అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు విషయం తెలిసిన అధికారి ఒకరు తెలిపారు. మీటర్ బాక్స్ ప్రయాణించిన దూరం ఆధారంగా మొత్తం ఛార్జీని చూపుతుంది. ప్రతి ఆటో-రిక్షాలో మీటర్ బాక్స్ లోపల ఉన్న సిమ్ కార్డ్‌తో జీపీఎస్ పని చేస్తుంది. ప్రస్తుతం నగరంలో 90,000 మందికి పైగా ఆటోల్లో జీపీఎస్ సిస్టమ్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేయాలని.. లేని పక్షంలో దానిని మార్చాలని ఆటో డ్రైవర్లను అధికారులు కోరారు. వాహనాల్లో జీపీఎస్ టెస్టింగ్.. రీప్లేస్‌మెంట్ పని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (DIMTS) లిమిటెడ్‌కు అప్పగించబడింది. ఇది ఢిల్లీ క్లస్టర్ బస్ సర్వీస్‌ను కూడా నిర్వహిస్తోంది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో ఇది క్రమం తప్పకుండా సిస్టమ్‌ను తనిఖీ చేస్తుంది. ఐదు సంవత్సరాల కంటే పాత ఆటో-రిక్షాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది.
ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..
ఇండియా, కెనడాల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రెడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి విరామం ఇచ్చింది. అీయితే ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాద అంశమే చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జీ20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చి వెళ్లిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ సమయంలో భారత ప్రధాని మోడీతో ట్రూడో ద్వైపాక్షి సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా ప్రధాని మోడీ ఖలిస్తాన్, కెనడా కేంద్రంగా భారత వ్యతిరేకతకు పాల్పడుతున్న చర్యలను ముఖ్యంగా ప్రస్తావించారు. భారత రాయబార కార్యాలయాలు, భారత్ దౌత్యవేత్తలపై దాడులు, భారతీయులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని ముందే మోడీ తన బలమైన సందేశాన్ని వ్యక్తపరిచారు.
‘ప్రభాస్-మారుతి’ సాలిడ్ అప్డేట్!
ప్రభాస్ ఏంటి? మారుతితో సినిమా చేయడం ఏంటి? అని మొదట్లో చాలా ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ మాత్రం మారుతికి మాటిచ్చేశాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు నలభై శాతం కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో అప్పుడే అంత షూటింగ్ చేశారా? అని షాక్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మారుతి సైలెంట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా సెట్ నుంచి మాళవిక మోహనన్ షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని చెప్పొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
దసరా డబుల్ ధమాకా.. రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోల సినిమాలు..
టాలివుడ్ లో సినిమాల జాతర మొదలుకానుంది.. ఎప్పుడూ సంక్రాంతికి సినిమా జాతర ఉంటే ఇప్పుడు దసరాకు బాక్సాఫీస్ షేక్ అవ్వబోతుంది.. అక్టోబర్ మూడో వారంలో ఒకటి కాదు రెండు కాదు.. మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దళపతి విజయ్, నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ దసరాకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. మరీ ఎవరెవరి చిత్రాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఓపారి చూసేద్దామా.. రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970ల నాటి నేపథ్యంలో సాగే స్టూవర్టుపురం దొంగ, బందిపోటు టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని గా తీసుకువస్తున్నారు. ఇందులో టైటిల్ పాత్రలో రవితేజ పోషిస్తున్నారు. ఇందులో నూపూర్ సనన్, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా ఈ సినమాను సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.. అలాగే నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం భగవంత్ కేసరి. కాజల్, శ్రీలీల కీలకపాత్రలు పోషిస్తున్న ఈ ను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. యాక్షన కామెడీ చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. కొలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. మొత్తానికి దసరాకు సినీ అభిమానులకు డబుల్ ధమాకానే..