ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్.. హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో అటెండెన్స్ సరిగా లేదంటూ సీరియస్ అవుతుంది ప్రభుత్వం.. దీనికి 100 శాతం అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ.. అన్ని శాఖల సెక్రటరీలు.. హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేసింది జీఏడీ.. ఫేస్ రికగ్నిషన్ విధానం (FRS) ద్వారా పూర్తి స్థాయిలో ఉద్యోగుల అటెండెన్స్ వేయడం లేదంటూ సీరియస్ అయిన ప్రభుత్వం.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ను 100 శాతం ఎన్రోల్ చేసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇప్పటికీ కేవలం 45-50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే FRS ద్వారా అటెండెన్స్ వేస్తున్నారని జీఏడీ గుర్తించింది.. చాలా మంది ఉద్యోగులు ఉదయం FRS ద్వారా చెక్ ఇన్ అవుతున్నారు.. కానీ, చెక్ అవుట్ కాకపోవడంపై జీఏడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఇక, ఉద్యోగుల సెలవులను FRS విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉన్నా.. దానిని చాలా మంది ఫాలో కావడం లేదంటున్నారు జీఏడీ అధికారులు.. ఇంఛార్జ్‌ల పర్యవేక్షణలో లోపం వల్లే FRS అమలు సరిగా లేదనే అభిప్రాయానికి వచ్చింది.. FRS సరిగా అమలయ్యేలా ఇంఛార్జ్‌లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేసింది జీఏడీ.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు.. జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.. క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.. అయితే, వాదనల సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇంకా ఎంత సేపు వాదనలు వినిపిస్తావని చంద్రబాబు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ని ప్రశ్నించారు జస్టిస్ బోస్… నీ సహచరులు వాదనలు వినిపించడానికి ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జస్టిస్ బోస్. అయితే ఒక గంట పాటు వాదనలు వినిపిస్తానని సాల్వే బదులిచ్చారు.. ఇక, అలా అయితే, తర్వాత వస్తాను.. మూడు రోజులుగా ఎదురు చూస్తున్నామన్న ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు ఇనిపిస్తున్న ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు.. ఇలాంటి కేసుల్లో నోటీస్ జారీ చేయాలా వద్దా అనే విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.. పూర్తిగా ఇది అభ్యంతరకపమైన కేసు అన్నారు రోహత్గీ.. అయితే, చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని వాదనలు వినిపించారు హరీష్ సాల్వే.. ఇక, లంచ్ వరకు ఈ కేసు లో వాదనలు వింటామన్నారు జస్టిస్ బోస్.. ఆ తర్వాత మిగిలిన కేసులు విచారణ చేస్తామన్నారు.. అయితే, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హరీష్ సాల్వే వాదనలు పూర్తి కాగా.. ముకుల్ రోహత్గీ తన వాదనలు ప్రారంభించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. నారా లోకేష్‌పై సీఐడీ ప్రశ్నల వర్షం..!
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏపీలో కాకరేపుతోంది.. ఈ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.. ఈ కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొంది సీఐడీ.. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలున్నాయి.. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని లోకేష్‌ను ఆదేశించింది హైకోర్టు.. ఇక, కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరయ్యారు నారా లోకేష్..
హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరాశ ఎదురైంది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడంతో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. అయితే, దీనిపై విచారణకు హైకోర్టు నిరాకరించింది. కాగా, ఏపీ స్కిల్ స్కాం కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు సోమవారం డిస్మస్ చేసింది.. దాంతో.. హైకోర్టుకు వెళ్లారు చంద్రబాబు.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు.. కానీ, లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు న్యాయమూర్తి నిరాకరించారు.. ఇంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో.. మళ్లీ రెగ్యులర్ పిటిషన్‌ను చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేస్తే.. రేపు విచారణకు లిస్ట్ అవుతుందా? మరికొంత సమయం పడుతుందా? అనేది వేచిచూడాల్సి ఉంది. కాగా, ఏపీ స్కిల్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు.
తెలంగాణ టీఆర్టీ పరీక్షలపై ఎన్నికల ప్రభావం..ఆందోళనలో అభ్యర్థులు..
తెలంగాణ రాష్ట్రం లో ఎప్పటి నుంచో ఖాళీ గా టీచర్ల పోస్టుల భర్తీ కి ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం లోని 33 జిల్లాల్లో 5,089 టీచర్ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీకి విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేశారు.డీఎస్సీ ద్వారా పరీక్షలను నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానం లో జరపనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించింది.ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. అక్టోబర్ 21 వ తేదీ నాటికీ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగియనుంది.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది…నవంబర్ 30వ తేదీన పోలింగ్ అంటూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించాల్సిన టీ ఆర్టీ పరీక్షలు వాయిదా పడే అవకాశముందనే వాదన లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది..అయితే రీసెంట్ గా విద్యా శాఖ తెలంగాణ రాష్ట్రం లో టెట్ పరీక్ష ను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది.టెట్ లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఇచ్చారు. రెండింటినీ కలిపి తుది ర్యాంకు నిర్ణయిస్తారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నారు. అయితే విద్యా శాఖ ఈ సారి టీఆర్టీ సిలబస్ లో కూడా స్వల్ప మార్పులు చేసింది. దీనితో అభ్యర్థులు ఎంత కష్టమైన కూడా పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు. కానీ సడన్ గా ఎన్నికల నోటిఫికేషన్ రావడం తో పరీక్షలు జరుగుతాయా లేదా అని అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఆరోపణలు ఇవే..
విమర్శలు ఎన్ని వచ్చినా.. విమపక్షాలు మండిపడుతున్నా.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నెల 4వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ జైలుకు వెళ్లిన తర్వాత.. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో దాడులు నిర్వహించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అమానతుల్లా ఖాన్‌కు చెందిన ఇల్లు, కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. వక్ఫ్ బోర్డు భూమికి సంబంధించిన వ్యవహారం. హవాలా లావాదేవీలపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు.. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.. కాగా, ఓఖ్లా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహిస్తోన్న అమానతుల్లా ఖాన్.. గతంలో ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా పనిచేశారు. అయితే, ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం (అక్టోబర్ 10) ఓ అధికారి ఈ సమాచారాన్ని అందించారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, చాబాద్ హౌస్ చుట్టూ భద్రతను పెంచినట్లు అధికారి తెలిపారు. న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మరియు సెంట్రల్ ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని చాబాద్ హౌస్ చుట్టూ మోహరించిన స్థానిక పోలీసులను కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మరియు భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలోన్ అధికారిక నివాసం వెలుపల అదనపు పోలీసులను మోహరించారు. ఇది కాకుండా న్యూఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని యూదుల మత స్థలం చాబాద్ హౌస్ దగ్గర కూడా భద్రతను పెంచారు. ఇజ్రాయెల్‌పై హమాస్ యోధుల దాడి తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి తర్వాత మరణించిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తోంది. దీనితో పాటు అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఉక్రెయిన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా సహా పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో ఇజ్రాయెల్‌తో పాటు నిలబడాలని మాట్లాడాయి. పాలస్తీనా తీవ్రవాద గ్రూపు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిలో వందలాది మంది ఇజ్రాయిలీలు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఇజ్రాయెల్ భీకరమైన ప్రతీకార చర్యలో, గాజా స్ట్రిప్ ప్రాంతంలో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. వందల మంది ఇతరులు గాయపడ్డారు.
ప్రపంచంలో రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికాలో ప్రారంభం
భారత దేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కనుక హిందూ దేవాలయాలు ఉండడం సర్వ సాధారణం. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో హిందూ దేవాలయం ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది కూడా ప్రపంచం లోనే రెండవ అతి పెద్ద హిందూ దేవాలయం ఉంది అంటే నమ్ముతారా..? అవును అమెరికాలోని న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ప్రంపచం లోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. వివరాలలోకి వెళ్తే.. స్వామినారాయణ్ అక్షర్ ధామ్ మహా మందిర నిర్మాణం 2011లో మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ప్రారంభమైనది. కాగా ఈ మందిర నిర్మాణం 2023 లో పూర్తి అయింది. అంటే మందిర నిర్మాణానికి దాదాపుగా 12 సంవత్సరాలు పట్టింది. ఈ మందిర నిర్మాణం 120 ఎకరాలలో జరిగింది. ఈ నిర్మాణంలో అమెరికా వ్యాప్తంగా 12 వేల మంది పాల్గొన్నారు. ఈ మందిర నిర్మాణానికి ఇటలీ బల్గేరియా నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు విభిన్న రకాల పాలరాయి, సున్నపురాయిని ఉపయోగించారు. ఆలయ నిర్మాణం పురాతన హిందూ గ్రంధాల ప్రకారం జరిగింది. మొత్తం ఆలయ నిర్మాణంలో పది వేల విగ్రహాలను ఉపయోగించారు. దీనితోపాటుగా పురాతన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ ఆలయంపై శిల్పాలను చెక్కించారు. ఈ ఆలయంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, 9 శిఖరాలు, 9 పిరమిడ్ లు ఉన్నాయి. ఈ ఆలయం 1000 సంవత్సరాలు ఉండేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు ఈ మహా మందిరాన్ని దర్శించుకునేందుకు అక్టోబర్ 18 నుంచి అనుమతి ఇవ్వనున్నారు.
బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. 300 అడుగుల లోతైన లోయలోకి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?
బీహార్‌లోని నలందలో 300 అడుగుల ఎత్తైన కొండ ప్రాంతం నుంచి ఓ మైనర్ బాలిక లోయలోకి దూకింది. ఆ యువతి తన ప్రియుడితో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు కొండపై నుంచి దూకింది. దూకడంతో ఆమె పొదలో కూరుకుపోయింది. పొదల్లో కూరుకుపోయిన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులు ఆ యువతిని పొదల్లో నుంచి బయటకు తీసి బీహార్ షరీఫ్‌లోని సదర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. క్రిటికల్ గా ఆమెను పావపురి మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఆ అమ్మాయి నలంద జిల్లాలోని రాహుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. ఆమె ఓ యువకుడితో కలిసి హిరణ్య పర్వతానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ అబ్బాయి ఆమె ప్రేమికుడిగా చెబుతున్నారు. ఇద్దరూ గుడి వెనుక కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దీని తరువాత ఏదో విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై అమ్మాయి హిరణ్య పర్వతం నుండి దూకింది. యువతి ఒక్క సారిగా దూకడంతో భయంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.
గ్యాపే దొరకలే.. చాలా అలసిపోయా: కేఎల్ రాహుల్
ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీపింగ్ చేసి అలసిపోయిన తనకు భారత్ బ్యాటింగ్ సమయంలో స్నానం చేసే టైమ్ కూడా దొరకలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత్‌కు ప్రపంచకప్ అందించడమే తన కల అని పేర్కొన్నాడు. తన ప్రదర్శన పేలవంగా ఏమీ లేకపోయినా జనం తనను విమర్శించినప్పుడు బాధపడ్డానని రాహుల్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. భారత్ బౌలింగ్ దాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టీమిండియా విజయం అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రాహుల్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అనంతరం కీపింగ్ చేసి అలసిపోయిన తాను స్నానం చేసి ఓ గంట పాటు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడట. అయితే భారత్ త్వరగా మూడు వికెట్స్ కోల్పోవడంతో.. మూడో ఓవర్లోనే రాహుల్ మైదానంలోకి వచ్చాడు.
హౌస్‌లోకి గౌతమ్ రీ ఎంట్రీ…వస్తూనే శివాజీకి షాక్..
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో రోజుకో విధమైన క్రేజ్ ను అందుకుంటుంది.. ఆదివారం బిగ్ బాస్ తెలుగు 7 రీ లాంచ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే హోస్ట్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. శివాజీ, అమర్ దీప్, యావర్, గౌతమ్, శుభశ్రీ.. అందులోనుంచి శుభశ్రీ బాటమ్ త్రీలో ఉందని ఎలిమినేట్ చేశారు. ఇక మిగతా ఆరుగురిలో శివాజీ, ప్రియాంక, యావర్, అమర్ దీప్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి తేజా-గౌతమ్ మిగిలారు. వీరిలో ఒకరిని ఇంటికి పంపాలని ఇంటి సభ్యుల నిర్ణయాన్ని బిగ్ బాస్ ఒప్పుకున్నారు.. తేజాకు వ్యతిరేకంగా ఒక్క సందీప్ మాత్రమే ఓటు వేశాడు. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. కాగా నాగార్జున గౌతమ్ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. తనను సీక్రెట్ రూమ్ కి పంపుతున్నట్లు వెల్లడించాడు. దాదాపు 34 గంటలు ఒక్కడే సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ ఆట గమనించాడు.. నిన్న జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ రెచ్చిపోయాడు. నామినేషన్స్ డే బయటకు వచ్చాడు. వస్తూ వస్తూనే భారీ డైలాగ్స్ కొట్టాడు. రాననుకున్నారా రాలేననుకున్నారా?. నేను అశ్వద్ధామ. ఈ అశ్వద్ధామకు చావు లేదంటూ తనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన హౌస్ మేట్స్ ని హెచ్చరించాడు. అనంతరం శివాజీతో గొడవకు దిగాడు. గౌతమ్ ఎంటర్టైన్ చేయలేడు అని చెప్పావు. ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాంటు విప్పుకుని తిరగడమా… అని గౌతమ్ ప్రశ్నించాడు. బట్టలు లేకుండా తిరగడం ఎంటర్టైన్మెంటా అని ఇంత మంది ముందు అడుగుతున్నావు. నేను బట్టలు లేకుండా 90 సినిమాలు చేశాను అని శివాజీ కౌంటర్ వేశాడు. నేను యాక్టర్ ని ఏదైనా చేస్తా అన్నాడు..