రెండో రోజు ఏపీ బీజేపీ నేతలతో అధిష్టానం కీలక భేటీ.. పొత్తులపై నేడు క్లారిటీ..!
ఏపీలో పొత్తులపై బీజేపీ ఎటూ తేల్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్ట్‌ను రిలీజ్ చేశారు ఆ పార్టీ అధినేతలు. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినే పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా? లేకుంటే టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలా అనే దానిపై హై కమాండ్ ఎటూ తేల్చడం లేదు. పొత్తుపై ఏ విషయమో క్లారిటీ వస్తే సెకండ్ లిస్ట్ ప్రకటించేందుకు చూస్తుంది టీడీపీ – జనసేన కూటమి. కానీ బీజేపీ మాత్రం కాలయాపన చేస్తూ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో ఇటు ఏపీ బీజేపీతో పాటు టీడీపీ – జనసేన రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల ఎలాగైనా మెజార్టీ సాధించాలని చూస్తుంది బీజేపీ. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటనలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ హైకమాండ్ సమావేశాలు నిర్వహిస్తుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశం జరిగింది. మీటింగ్‌లో కోర్ గ్రూప్ ఏపీ బీజేపీతో కూడా సమావేశమైంది. అయితే పొత్తులపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు..కోర్ కమిటీతో భేటీ అయ్యి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ రెడీ చేసిన 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల ఆశావహుల లిస్టులను అధిష్టానం ముందు పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించారు. ఈ సమావేశంలో పొత్తులపై క్లారిటీ వస్తుందనుకున్నారు నేతలు. అయితే పొత్తుల అంశంపై చర్చకు రాలేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారి అధిష్ఠానంతో సమావేశం కానున్నారు ఏపీ బీజేపీ నేతలు. దీంతో ఇవాళైనా పొత్తులపై చర్చకు వస్తుందా? బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏపీ, తెలంగాణపై భానుడి ప్రతాపం.. అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మే నెల చివరిదాకా ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ మూడు నెలలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు కానున్నాయని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వేసవి తాపంపై హెచ్చరికలు జారీచేసింది. ఎల్‌నినో ప్రస్తుతం క్రమంగా వీక్ అయిపోతున్నా…దాని ప్రభావం మాత్రం ఇంకో మూడు నెలలపాటు కొనసాగనుంది. మధ్య పసిఫిక్ మహాసముద్రంతో పాటు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలాల జలాలు వేడెక్కడాన్నే ఎల్‌నినో పేరుతో పిలుస్తుంటారు. ఇది ఏర్పడిన సంవత్సరాల్లో టెంపరేచర్లు పెరుగుతాయి. ఎల్ నినో సగటున 2 నుంచి 7 ఏళ్లకు ఓసారి ఏర్పడుతుంటుంది. దాదాపు 9 నుంచి 12 నెలలపాటు కొనసాగుతుంది. ఈసారి ఎల్ నినో కారణంగా సముద్ర జలాలు సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా వేడెక్కాయి. ఇప్పటివరకు ఏర్పడిన అతి బలమైన ఎల్ నినోల్లో ఇది ఐదోది.
కన్నతండ్రి కన్నుమూసిన బాధలోనూ ఇంటర్ పరీక్ష.. తిరిగొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె..
ఓ వైపు జీవితాన్ని ఇచ్చిన తండ్రి కన్నుమూసిన బాధ.. మరోవైపు భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు నిర్వహించే పరీక్ష.. అలాంటి పరిస్థితుల్లో రెండూ కార్యక్రమాలను పూర్తి చేసింది ఓ ఇంటర్ విద్యార్థిని.. కన్నతండ్రి మృతిచెందన బాధను గుండెను తొలచివేస్తుండగా.. మొదట పరీక్ష రాసిన ఆ విద్యార్థిని.. ఆ తర్వాత కన్నతండ్రి మృతదేహం వద్ద గుండెలు బాధకుంటూ విలపించింది.. చివరకు తానే అంత్యక్రియలు నిర్వహించింది.. క్లిష్టసమయంలోనూ తాను రెండు కర్తవ్యాలను నిర్వహించింది.. విశాఖలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ పారిశ్రామిక ప్రాంతం హనుమాన్‌నగర్‌కు చెందిన 39 ఏళ్ల లాలం సోమేశ్వరరావు అనే వ్యక్తి క్యాన్సర్ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశాడు.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అయితే పెద్ద కుమార్తె మానసిక స్థితి బాగలేదు.. చిన్న కుమార్తె అయిన దిల్లీశ్వరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తండ్రి అంత్యక్రియలు నిర్వహించాల్సిందే తానేనని.. మొదట పరీక్షలు రాసేందుకు నిరాకరించింది దిల్లీశ్వరి.. కానీ, స్థానికులు, బంధువులు నచ్చజెప్పడంతో.. గుండెల నిండా బాధతోనే పరీక్షకు హాజరైంది.. బుధవారం ఉదయమే సోమేష్ మృతదేహానికి అంత్యక్రియల కోసం గుల్లలపాలెం శ్మశానవాటికకు తరలించినా.. దిల్లీశ్వరి పరీక్ష రాసివచ్చేవరకు అక్కడే మృతదేహాన్ని ఉంచారు.. డిల్లీశ్వరి పరీక్ష రాసి తిరిగివచ్చిన తర్వాత తన నాన్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలచివేసింది.
ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా.. కారణం అదేనా..?
ఎన్నికల తరుణం కావడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పరిణామం జరిగినా.. అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.. అసలే రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి.. సీటు ఆశించి.. అది దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తు్న్నారు. అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చివరకు మంత్రులు కూడా ఉన్నారు.. అయితే, ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ.. ఆ పదవికి రాజీనామా చేశారు. అసలు.. ఎన్నికల ముందు ఆ పదవికి వాసిరెడ్డి పద్మ ఎందుకు రాజీనామా చేశారు అనే చర్చ మొదలైంది.. ఇక, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. తన రాజీనామా లేఖను వైఎస్‌ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సమర్పించారు. అయితే, ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్‌ను చెప్పినట్టుగా తెలుస్తోంది.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పని చేయడానికి సిద్దమన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు వాసిరెడ్డి పద్మ.. కాగా, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు పద్మ.. వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి దక్కించుకున్నారు.. ఆ పదవిని కూడా సమర్థవంతంగా నిర్వహించారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన ఆమె.. ఈ సారి అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, ఈ సారి కూడా టికెట్ దక్కే అవకాశం లేదనే సంకేతాలు వెళ్లాయట.. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమె రాజీనామా చేయడం చర్చగా మారగా.. రాజీనామాకు.. సీటుకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని.. ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకం కాలేకపోతున్నానని.. ఇదే సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నానని.. అందుకే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు.. మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంను చేసేందుకు తన రాజీనామా అంటున్నారు వాసిరెడ్డి పద్మ.
ఎన్నికల పొత్తులు.. అచ్చెన్న, నాదెండ్ల కీలక వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడుస్తున్నా.. వారితో బీజేపీ నడుస్తుందా? లేదా? అనేది తేలేది క్లైమాక్స్ చేరుకున్నట్టు తెలుస్తోంది.. ఈ తరుణంలో.. పొత్తులపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఇద్దరు నేతలు.. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. ఇక, చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి వెళ్తున్నారు.. ఢిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందన్నారు అచ్చెన్నాయుడు.. మరోవైపు.. పవన్ కల్యాణ్ కూడా ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నాం.. మా పొత్తుల్ని విచ్ఛిన్నం చేయటానికి కొందరు చేసిన తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయంటూ హాట్ కామెంట్లుచేశారు నాదెండ్ల మనోహర్. ఇక, చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వామ్యం కావాలి.. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు నాదెండ్ల మనోహర్.. సూపర్ 6 నినాదంతో అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బంది, జనసేన టీంలను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే విఫలం అవుతుందని హెచ్చరించారు నాదెండ్ల మనోహర్.
రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన వాసిరెడ్డి పద్మ.. అందుకే చేశా..
ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం చర్చగా మారింది.. ఎన్నికల తరుణంలో ఆమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? దీని వెనుక రాయకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి.. అయితే, రాజీనామా వెనుక రాజకీయం లేదంటున్నారు వాసిరెడ్డి పద్మ.. రాష్ట్ర మహిళలందరికీ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గా రాజీనామా చేశానని వెల్లడించారు.. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే రాజీనామాకి కారణం కాదు అని స్పష్టం చేశారు. పోటీ చేయడమే గీటు రాయి కాదు.. అలా అని కొందరు అనుకుంటూ ఉండచ్చు అన్నారు. బలా బలాల కారణంగా ఏమైనా అవకాశం ఉండకపోవచ్చు.. నాకు సీటొచ్చిందా లేదా అనేది ప్రాధాన్యత కాదు.. పార్టీ ఆదేశించినా ఆదేశించకపోయినా అన్నిటికీ సిద్ధమే అన్నారు వాసిరెడ్డి పద్మ.. ఇక, ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించడానికే ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు వాసిరెడ్డి పద్మ.. మహిళా సాధికారత ప్రతి ఇంటి దాకా చేరిందన్నారు. మహిళే అన్నిటికీ కేంద్రం అని చెపుతున్న ఈ ప్రభుత్వం ఉండాలి అన్నారు. మరోవైపు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారుగా..? పలానా నియోజకవర్గం గురించి అడిగారని ప్రశ్నించగా.. జగ్గయ్యపేట నా స్వస్థలం.. కనుక అక్కడ పోటీచేస్తా అనుకోవడం సహజం అన్నారు వాసిరెడ్డి పద్మ.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు తెలిపింది. కేబినెట్‌కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించొద్దని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని కొట్టివేసింది.
బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కోసం బీజేపీ వివిధ కమిటీలు వేసింది. ఆ కమిటీలు చేసిన, చేయాల్సిన పనులపై కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు కిషన్ రెడ్డి సూచనలు చేశారు. తెలంగాణలో బీజేపీకు మంచి వాతావరణం ఉందని.. ఈ అనుకూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవాలని కిషన్ రెడ్డి బీజేపీ నేతలకు సూచించారు. ప్రధాని మోడీ ఆదిలాబాద్, సంగారెడ్డి సభలను ప్రజలు విజయవంతం చేశారన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా విజయ సంకల్ప యాత్ర విజయవంతమైందన్నారు. పార్టీ జెండా మీదనే యాత్ర నిర్వహించామన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలన్నారు. బీజేపీను దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. 17కు 17స్థానాల్లో విజయం సాధించాలంటే ఎన్నికల నిర్వహణ ఉండాలని కిషన్ రెడ్డి వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తిట్టాలి అంటే చంద్రబాబుని తిట్టాలి.. నిందించాలి అంటే కాంగ్రెస్ పార్టీని నిందించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్‌కి శాపాలు అంటూ ఆయన విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి పాలమూరు జిల్లాని పచ్చగా చేసింది కేసీఆర్ అని హరీష్ తెలిపారు. కేసీఆర్‌ని తిట్టడం రేవంత్ రెడ్డి అవివేకమన్నారు. కేసీఆర్ సీఎం కాక ముందు ఆయన సీఎం అయిన తర్వాత పాలమూరు జిల్లా పరిస్థితి ఏందో తెలుసుకోవాలన్నారు. వలసల జిల్లాగా పాలమూరుని మార్చింది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు అంటూ ఆయన ఆరోపించారు. 1994- 2004 మధ్య మీ పాత గురువు చంద్రబాబు ఈ జిల్లాని దత్తత తీసుకుని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వలసల జిల్లాగా చంద్రబాబు మారిస్తే.. వ్యవసాయ జిల్లాగా మార్చింది కేసీఆర్ అంటూ ఆయన పేర్కొన్నారు.
సంగం మిల్క్ పిటిషన్ తిరస్కరణ.. హైకోర్టు నిర్ణయాన్ని ఆమోదించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో ఓ ఆసక్తికర కేసు విచారణకు వచ్చింది. దానిపై ఇప్పుడు కోర్టు నిర్ణయం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం ‘నెయ్యి’ని పశువుల ఉత్పత్తిగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు సమర్థించింది. ఇందులో మార్కెట్ కమిటీలకు దాని అమ్మకం, కొనుగోలుపై సుంకం విధించే హక్కు ఇవ్వబడింది. నెయ్యి అమ్మకం, కొనుగోలుపై మార్కెటింగ్ ఛార్జీల విధింపుకు సంబంధించిన ప్రశ్నతో పాటు ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయ ఉత్పత్తి, పశువుల) మార్కెట్ల చట్టం 1966 నిబంధనల ప్రకారం ఇది పశువుల ఉత్పత్తి కాదా అని సుప్రీం కోర్టు నిర్ణయించాల్సి వచ్చింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ‘నెయ్యి పశువుల ఉత్పత్తి కాదనే వాదన నిరాధారమైనది. దీనికి విరుద్ధంగా, నెయ్యి నిజానికి పశువుల ఉత్పత్తి అనే వాదన తార్కికంగా సరైనది. చట్టంలోని సెక్షన్ 2(v) ప్రకారం పశువులను నిర్వచించారు. ఇక్కడ ఆవు, గేదెలు నిస్సందేహంగా పశువులు. నెయ్యి ఒక పాల ఉత్పత్తి, ఇది పశువుల నుండి తయారవుతుంది.
భారత్ అడుగుజాడల్లో అమెరికా.. టిక్‌టాక్ బ్యాన్
2020లో చైనాతో సంబంధాలు క్షీణించిన తర్వాత, చైనా యాప్ టిక్-టాక్‌ను భారత్ నిషేధించింది. ఇప్పుడు అమెరికాలో కూడా ఈ యాప్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మంగళవారం అమెరికా పార్లమెంట్‌లో ఎంపీలు సమర్పించిన బిల్లులో చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ‘ది ప్రొటెక్టింగ్ అమెరికన్స్ ఫ్రమ్ ఫారిన్ అడ్వర్సరీ కంట్రోల్డ్ అప్లికేషన్స్ యాక్ట్’లో, కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉందని ఆరోపించింది. ఈ యాప్ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించబడింది. హౌస్ సెలెక్ట్ కమిటీ ఛైర్మన్, చట్టం రచయితలలో ఒకరైన మైక్ గల్లాఘర్ ఒక పత్రికా ప్రకటనలో కంపెనీని హెచ్చరిస్తూ, “టిక్‌టాక్‌కి ఇది నా సందేశం. CCP (చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ)తో సంబంధాలను తెంచుకోండి లేదా మీ అమెరికా వ్యాపారాన్ని మూసివేయండి. అమెరికాలోని ప్రధాన మీడియా ప్లాట్‌ఫారమ్‌ను నియంత్రించే హక్కును అమెరికా శత్రువుకి మేము ఇవ్వలేమని కూడా ఆయన అన్నారు. సమర్పించిన బిల్లులో టిక్-టాక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ ఈ బిల్లు అమెరికా శత్రు దేశాలచే నియంత్రించబడే ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించడానికి ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తుంది. వాషింగ్టన్ చేత శత్రు దేశాలుగా లేబుల్ చేయబడిన దేశాలలో చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, వెనిజులా ఉన్నాయి.
లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్ 100/2!
ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో మొదటి సెషన్ పూర్తయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 25.3 ఓవర్లలో 2 వికెట్స్ కోల్పోయి 100 రన్స్ చేసింది. లంచ్ బ్రేక్ ముందు ఓవర్లో ఓలీ పోప్ (11) ఔట్ అయ్యాడు. క్రీజులో జాక్ క్రాలే (61) ఉన్నాడు. అంతకుముందు 27 పరుగులు చేసిన బెన్ డకెట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్స్ పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డక్కెట్ నిలకడగా ఆడారు. క్రాలే వేగంగా ఆడగా.. డక్కెట్ నెమ్మదిగా ఆడాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు హాఫ్ సెంచరీ మార్కు దాటింది. 64 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గిల్ పరుగెత్తికెళ్లి అద్భుత క్యాచ్ పట్టాడు. కాసేపటికి 100 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్.. కుల్దీప్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. దాంతో లంచ్ విరామానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న స్టార్ సింగర్..
టాలీవుడ్ బ్యూటిఫుల్ సింగర్ హారిక నారాయణ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది..తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఈ భామ సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తునే టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా తన పాటలతో మెప్పిస్తుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ పాటల గురించి మాత్రమే కాదు.. లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. తాజాగా ఈమె నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక హారిక నారాయణ్ గత ఏడేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. పృథ్వినాథ్ వెంపటి అనే వ్యక్తితో హారిక ప్రేమలో ఉంది. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మనది మర్చిపోలేని బంధం.. ఏడేళ్లు ప్రేమను ఆస్వాదించాము.. ఇప్పుడు మరో లెవల్ కు తీసుకెళ్తున్నాం.. అని స్పెషల్ పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న ఈమె ఎన్నో అద్భుతమైన పాటలను పాడింది.. ఇక హారికకు హీరో మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చనే ఓ సినిమాలో నటించినట్లు గతంలో హారిక తెలిపారు. తన అభిమాన హీరో సినిమా అయిన ‘సర్కారువారి పాట’లో టైటిల్ ట్రాక్ పాడి దుమ్మురేపారు.. ఆ పాట బాగా హిట్ అయ్యింది..
నా భార్య కావడం వలనే ఉపాసనకు గుర్తింపు రాలేదు: రామ్ చరణ్
కేవలం తన భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదని, ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయని హీరో రామ్ చరణ్ అన్నారు. ఉపాసన పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారని, కుటుంబ విలువలను గౌరవిస్తుందని మెగా పవర్ స్టార్ చెప్పారు. తనకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని, కానీ ఇప్పుడు చరణ్‌కి నీడలా ఉంటుంన్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన పేర్కొన్నారు. మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా జాతీయ మీడియా హిందుస్థాన్ టైమ్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రామ్ చరణ్ మాట్లాడుతూ… ఉపాసన ఓ స్టార్ భార్య మాత్రమే కాదు అని అన్నారు. ‘నా సతీమణి కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదు. ఉపాసన చేసే ఎన్నో మంచి పనులే ఆమెను ఈ స్థాయిలో ఉంచాయి. పలు రంగాల్లో ఆమె తనదైన ముద్ర వేసింది. కుటుంబ విలువలను గౌరవిస్తుంది. కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఆమె నా రాక్ స్టార్. ఆమె చేసే పనిని నేను ఎప్పుడూ చేయలేను. ఉపాసన తన స్వంత మార్గాన్ని సృష్టించుకుంది’ అని చరణ్ పొగడ్తల వర్షం కురిపించారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అయిన 12 సంవత్సరాల తర్వాత వారికి పాప జన్మించింది.
రానా నాయుడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
రియల్ లైఫ్ బాబాయ్, కొడుకులు వెంకటేష్, రానా రీల్ లైఫ్ తండ్రి కొడుకులు గా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ ఎక్స్ క్లూజివ్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిగతా అన్ని భాషల ప్రేక్షకుల వరకు ఒక్కసారిగా షాక్ కలిగించింది. మరీ ముఖ్యంగా వెంకటేష్, రానా ఇద్దరికీ తెలుగులో కాస్త క్లీన్ ఇమేజ్ ఉండడంతో రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఒకింత షాక్ కలిగించడమే కాదు ఏంట్రా ఇది అనిపించేలా కూడా చేసింది. బూతులు శృతిమించి ఉండడంతో తెలుగు వాళ్లయితే కొంత ఇబ్బంది పడ్డారు కూడా. ఇక ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంటుందని సీజన్ వన్ స్ట్రీమింగ్ సమయంలో వెల్లడించారు. ఇక తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వెంకటేష్ తో పాటు రానా మీద పలు కీలక సన్నివేశాలు మొదటి షెడ్యూల్ లో షూట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీకాంత్ సినిమాలో రానా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరొక పక్క వెంకటేష్ సైంధవ్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా ఫైనల్ చేయలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన వస్తే కానీ నిజమని చెప్పలేం. ‘రానా నాయుడు’లో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్ళై వంటివారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘రే డొనోవన్’ కి ఇండియన్ అడాప్షన్.