చంద్రబాబు నివాసానికి పవన్.. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు..
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఆయనతో సమావేశం అయ్యారు. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల పైనా చర్చించే అవకాశం ఉంది.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై సమీక్ష చేస్తున్నారు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సహా వివిధ ప్రాంతాల్లో రేగుతోన్న అసంతృప్తిపై కూడా చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు.. అసంతృప్తులను చల్లార్చే అంశంపై మంతనాలు సాగిస్తు్న్నారు. మరోవైపు.. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు.. పొత్తులపై బీజేపీ హైకమాండ్‌తోచర్చించనున్నారు.. అదే సమయంలో చంద్రబాబు – పవన్ కల్యాణ్ భేటీ కావడం ఆసక్తిరేపుతోంది.. బీజేపీతో పొత్తుపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాయి టీడీపీ-జనసేన.
వైసీపీలోకి ముద్రగడ..! ఒకే చెప్పేశారు.. ఆ రోజే చేరిక..!
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. ఆ మధ్య జనసేనలోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన్ని.. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది.. కానీ, ఏం జరిగిందో తెలియదు.. ఈ వ్యవహారంలో ఎలాంటి ముందుడుగు పడలేదు.. ఆ తర్వాత ఈ పరిణామాలపై ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. అయితే, ఇప్పుడు పోటీ చేసే అవకాశం లేకపోయినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముద్రగడ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించారట మిథున్ రెడ్డి.. ఇక, మీరు అడుగుతున్నారా? లేక సీఎం జగన్ అడగమన్నారా? అని మిథున్ రెడ్డిని ప్రశ్నించారట ముద్రగడ.. దీంతో.. సీఎం అడగమన్నారని మిథున్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా చెబుతున్నారు. అయితే, పార్టీలో జాయినింగ్ కి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనావేసి నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారట ముద్రగడ.. సీఎంకు విషయం చెప్పి స్పష్టత ఇవ్వాలని మిథున్‌రెడ్డిని కోరారట.. అన్ని ఓకే అనుకుంటే సిద్ధం సభలో జాయినింగ్ పెట్టుకుందామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ముందు సీఎం జగన్ కి చెప్పండి.. ముహూర్తం బట్టి చూద్దాం అని ముద్రగడ చెప్పినట్టుగా వైసీపీ నేతలు తెలిపారు.. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే జాయినింగ్ ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ముద్రగడ కుమారుడు గిరి పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు బీసీలను నిలువునా ముంచాడు.. వంచించడానికే బీసీ డిక్లరేషన్..!
చంద్రబాబు నాయుడు బీసీలను నిలువునా ముంచాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. 2014 ఎన్నికలలో 142 హామీలను బీసీలకు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలను చంద్రబాబు తన హయాంలో బానిసలుగా చూసారని మంత్రి ధ్వజమెత్తారు. పవన్ ను కలుపుకుంటే గంపగుత్తుగా కాపుల ఓట్లు వచ్చేస్తాయని చంద్రబాబు కుట్ర చేశాడని, అయితే కాపులు విజ్ఞులు ఆలోచించి ఓటేస్తారని అన్నారు. ఇక, బీసీ డిక్లరేషన్ ప్రకటించే అర్హత టీడీపీ, జనసేనకు లేదన్నారు మంత్రి వేణు. ప్రతి హమీని అమలు చేసి సీఎం జగన్.. బీసీలకు న్యాయం చేశారని చెప్పారు. నిన్న బీసీ డిక్లరేషన్ చూసిన తర్వాత బీసీలే టీడీపీ, జనసేనను తిప్పికొడతారని అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలందరూ చంద్రబాబు పాలనలో దగాపడ్డారని, మోసపోయారని పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఎంపీ భరత్ చాలెంజ్.. ఆ దమ్ముందా..?
మంగళగిరిలో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించిన టీడీపీ-జనసేన.. బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశాయి.. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ మార్గాని భరత్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేం ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా..? అని సవాల్ చేశారు.. ఇదే చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు 14 సంవత్సరాలు రాష్ట్రాలు పాలించాడు.. అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు.. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.. చంద్రబాబుతో బీసీలకు సంబంధించిన చర్చలకు నేను రెడీగా ఉన్నాను అన్నారు. ఇక, బీసీలకు సీఎం వైఎస్ జగన్ 75 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు.. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడిందని వివరించారు ఎంపీ భరత్.. అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధం మాటలు మాట్లాడుతున్నారన్న ఆయన.. బీసీల డీఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పే చంద్రబాబు.. బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే అని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు.. కనీసం నువ్వు ఆ సాహసం చేశావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేం ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా..? మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది..? కదా అన్నారు. ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు అని చంద్రబాబును నిలదీశారు ఎంపీ భరత్.
నాకెవ్వరితోనూ గొడవల్లేవు.. నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా..
నాకెవ్వరితోనూ గొడవల్లేవు.. నాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తానని తెలిపారు మాజీ మంత్రి, తాజాగా టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు మరోసారి చంద్రబాబును కలిసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేను ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేశాక.. బర్తరఫ్ చేసినా.. ఏం చేసినా నాకు అనవసరం అన్నారు. చంద్రబాబు నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను. ఆలూరుకు సేవలందించాను.. ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. గుంతకల్లు సీటు మీద కొందరు ఆశలు పెట్టుకోవచ్చు.. కానీ, నేను అందర్నీ కలుపుకుని వెళ్తాను. నాకెవ్వరితోనూ గొడవల్లేవు అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి జరగాలని.. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు గుమ్మనూరు జయరాం.. చంద్రబాబు సమర్ధుడన్న ఆయన.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ కలయిక టీడీపీ-జనసేన కూటమికి ఘన విజయాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆలూరులోని వైసీపీ కేడర్ బయటకొచ్చేసిందని.. వాళ్లు అంతా నాతో ఉంటారని పేర్కొన్నారు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం..
ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం..
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీలో గృహ జ్యోతి కార్యక్రమం క్రింద లబ్ధిదారులకు జీరో బిల్లులను మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని అన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఎస్ఈ మల్చుర్, డీఈ నాగేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రేపు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. కాగా ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా.. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు, మార్చి 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. చార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతోంది. అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఇవాళ ధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో జీహెచ్ఎమ్సీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి , సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజల నుంచి 20 వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్‌పేట మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించి.. అందులో ప్రయాణించిన మోడీ
దేశం తన మొదటి నీటి అడుగున మెట్రోను ఈ రోజు అంటే బుధవారం పొందింది. కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. దీంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. మొత్తంమీద ప్రధాని మోడీ బెంగాల్‌కు 15400 కోట్ల రూపాయల బహుమతిని ఇచ్చారు. ఈ సమయంలో అతను పిల్లలతో కలిసి అందులో ప్రయాణించాడు. హుగ్లీ నది కింద నీటి అడుగున మెట్రో నిర్మించబడిందని మీకు తెలియజేద్దాం. ఈ నది నీటి అడుగున మెట్రో రైలు.. హౌరాను కోల్‌కతా నగరానికి కలుపుతుంది. నీటి అడుగున మెట్రోను ప్రారంభించడమే కాకుండా, కవి సుభాష్-హేమంత్ ముఖోపాధ్యాయ మెట్రో సెక్షన్, తరటాలా-మజెర్‌హట్ మెట్రో సెక్షన్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరు కొత్త మెట్రో రైళ్లను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు.
ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో.. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, కుల గణన, మహిళా రిజర్వేషన్
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ఆమోదించిన తర్వాత త్వరలో విడుదల కానుంది. కాంగ్రెస్ ప్రతిపాదిత మేనిఫెస్టో బ్లూ ప్రింట్‌లో ఉపాధి, ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం.. సామాజిక న్యాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చిదంబరం నేతృత్వంలోని కమిటీ ముసాయిదా మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి, ఆ తర్వాత పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. యువతను గెలిపించే వ్యూహంలో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రకటించబోతున్న కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వబోతోందని సమాచారం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు నెలకు రూ.6,000, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఓబీసీ ఓటు బ్యాంకును నొక్కేయడానికి, కులాల వారీగా జనాభా గణనను నిర్వహిస్తామని, వెనుకబడిన కులాల రిజర్వేషన్ల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల హామీని పునరుద్ఘాటిస్తూ, కనీస ఆదాయ పథకం కింద పేదలకు ఏటా రూ.72 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టో కోసం రూపొందించిన పత్రంలో, ముస్లింలను ప్రలోభపెట్టడానికి సచార్ కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయాలని పేర్కొంది. ఈ సిఫార్సులను ఎన్నికల్లో బీజేపీ పెద్ద చర్చనీయాంశం చేయగలదు.
ఐపీఎల్ తరహాలో టీ10 క్రికెట్ టోర్నమెంట్.. హైదరాబాద్ టీమ్‌ని సొంతం చేసుకున్న రామ్ చరణ్!
ఐపీఎల్ తరహాలో సరికొత్తగా మరో క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం అవుతోంది. అదే ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’. వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లతో టీ10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ముంబై వేదికగా జరగనుంది. ‘స్ట్రీట్ టు స్టేడియం’ కాన్సెప్ట్‌తో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయడమే ఈ లీగ్ లక్ష్యం. ఈ లీగ్ కోర్ కమిటీ మెంబర్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో ఆరు టీమ్స్ తలపడనున్నాయి. మాఘీ ముంబై, బెంగుళూరు స్ట్రైకర్స్, శ్రీనగర్ కి వీర్, చెన్నై సింఘమ్స్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా టీమ్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ టీమ్‌ని హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు), అమితాబ్ బచ్చన్ (ముంబై), సూర్య (చెన్నై), రామ్ చరణ్ (హైదరాబాద్), సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ (కోల్‌కతా) భాగం అయ్యారు. ఐపీఎల్ తరహాలో వేలం వేసి క్రీడాకారులను దక్కించుకున్నారు. మొత్తం 96 మంది ప్లేయర్లు ఆడనున్నారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా మ్యాచులు జరగనున్నాయి.
నందమూరి అభిమానులకు శుభవార్త.. మార్చి 8న బాలకృష్ణ 109 టీజర్!
ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లను అందుకున్నారు. భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ విజయాలతో బాలయ్య బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే జోష్‌లో ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీతో నటసింహ తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విభిన్నమైన యాక్షన్, ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను ఇవ్వనున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ, బాబీ సినిమా అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా టీజర్ మార్చి 8న రానుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి డైరెక్టర్ బాబీ సస్పెన్స్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. హీరోయిన్, రిలీజ్ విషయంలో మాత్రమే కాకుండా.. బాలయ్య పాత్ర విషయంలో బాబీ సీక్రెట్‌ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సీక్రెట్స్ అన్నీ రివీల్ అవుతాయా అం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ద్వారా అని తెలిసిపోయే అవకాశం ఉంది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ సూపర్ స్టార్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే?
మలయాళ సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు… ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. గతనెలలో విడుదలైన మలయాళ సినిమాలు అన్ని మంచి హిట్ ను అందుకున్నాయి.. అందులో మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ మూవీ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో సినిమాను తెరకేక్కించారు.. ఈ సినిమా కథ నచ్చడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఇప్పుడు మూడు వారాలు తిరగముందే ఓటీటీలో వచ్చేస్తుంది.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సోని లైవ్ టీవీ భారీ ధరకు సొంతం చేసుకుంది.. ఈ సినిమా సోని లివ్ ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు… ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు.. అద్భుతమైన కథతో ఈ సినిమాను చాలా చక్కగా చూపించారు.. ఈ సినిమాను అక్కడ చూసి ఎంజాయ్ చెయ్యండి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..