మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు..
ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతూ ఉంది.. ఇక, కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీలో రచ్చ నడుస్తోంది.. సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వర్సెస్ తాజాగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌గా పరిస్థితి మారింది. టీడీపీలోకి వసంత ఎంట్రీతో మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఇప్పుడు వసంత రాకతో కలిసిపోయారు.. ఇంతకుముందు ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు టికెట్ ఆశించారు.. ఒకప్పుడు ఉప్పు, నిప్పుగా ఉండేవారు. అయితే, వసంత రాకతో ఇద్దరూ కలిసిపోయారు.. మరోవైపు.. వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో ముగ్గురు మధ్య పోటీనెలకొన్నట్టు అయ్యింది. ఇంతకు ముందు.. దేవినేనికి టికెట్ ఇవ్వొద్దంటూ కార్యక్రమాలు నిర్వహించారు బొమ్మసాని.. ఇక, వసంత రాకతో.. వ్యతిరేక వర్గం ఒక్కటైంది.. ఇద్దరం కలిసి పనిచేస్తామని.. దేవినేని, బొమ్మసాని ప్రకటించారు.. ఇవాళ ఒకే వేదికపై దేవినేని ఉమా, బొమ్మసాని కనిపించబోతున్నారు.. మరోవైపు టీడీపీ అధికారంలోకి వచ్చేవరకు విశ్రమించేది లేదంటున్నారు. అయితే, తొలి లిస్ట్‌లో మైలవరం అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది టీడీపీ అధిష్టానం.. రెండో లిస్ట్‌లో మైలవరం అభ్యర్థిని ప్రకటించాలని లోకల్ లీడర్లు కోరుతున్నారు.
చింతమనేని సంచలన వ్యాఖ్యలు.. కంఠంలో ప్రాణం ఉండగా..!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యేల చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గత అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్న ఆయన.. నా కంఠంలో ప్రాణం ఉండగా నా భార్య గాని, కూతురు గాని రాజకీయాల్లోకి రారు అని ప్రకటించారు.. ఇక, టీడీపీ అంటే ప్రభాకర్.. ప్రభాకర్ అంటే టీడీపీ అని స్పష్టం చేశారు. చింతమనేని ప్రభాకర్ లేని దెందులూరు ఉండదు.. దెందులూరు లేని ప్రభాకర్ ఉండడు అంటూ సంచలన కామెంట్లు చేశారు. మరోవైపు.. కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తులు తనకి సీటు ఇవ్వొద్దంటున్నట్టుగా కొందరు కాకమ్మ కథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు చింతమనేని.. నన్ను కాదనేవాళ్లు కమ్మ సామాజిక వర్గంలోనే కాదు ఏ కులంలోనూ లేరని స్పష్టం చేశారు.. అంతేకాదు.. తనను వ్యతిరేకించేవాళ్లు ఉన్నారని నిరూపిస్తే నా అంతట నేనే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు. పార్టీ కోసం కొట్లాడడంలో భాగంగా 38 పోలీస్ కేసులు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పార్టీలో అంతర్గత పోరు లేకపోయినా, వెంట్రుక వాసి డిస్టబెన్స్ లేకపోయినా.. కావాలని నన్ను ఇబ్బందులకు గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చింతమనేని ప్రభాకర్.
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు.. తెలుగుదేశం పార్టీ మహిళా నేత విజితారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.. ఇక, నెల్లూరు సిటీలోని మాజీ మంత్రి నారాయణ ఇంటితో పాటు.. పలువురు టీడీపీ నేతల ఇళ్లలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ ఇంటితో పాటు దాదాపు 15 మంది టీడీపీ నేతల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.. అయితే, ఈ సోదాల్లో పోలీసులకు స్వల్ప మొత్తంలోనే నగదు దొరికినట్టుగా చెబుతున్నారు.. నెల్లూరులోని పలువురు టీడీపీ నేతలు.. మాజీ మంత్రి నారాయణ మిత్రుల ఇళ్లల్లో జరిగిన పోలీసుల సోదాల్లో.. నగదుతో పాటు అమరావతి భూములకు సంబంధించిన పత్రాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.. కొందరి ఇళ్లల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.. అమరావతి భూములకు సంబంధించిన డాకుమెంట్స్ ఉన్నాయా? అని పరిశీలించారట.. ఈ సోదాలు సంబంధించిన వివరాలను మధ్యాహ్నం ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడిస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.. మరోవైపు.. విజితారెడ్డి ఇంట్లో సోదాల విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆమె నివాసానికి చేరుకున్నారు.. ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. వారితో వాగ్వాదానికి దిగారు.
నేడు వైసీపీకి రాజీనామా..! రేపు టీడీపీకి గూటికి మంత్రి జయరాం..
ఎన్నికల వేళ.. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. కొందరు టీడీపీ గూటికి చేరితే.. మరికొందరు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక, ఎప్పటి నుంచి వైసీపీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం సాగుతూ వచ్చింది.. ఆయన సిట్టింగ్ స్థానం మార్చిన తర్వాత.. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.. ఇక, ఆ తర్వాత అనూహ్యంగా కేబినెట్ భేటీకి హాజరైన ఆయన.. కొంత సమయం తర్వాత టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.. మొత్తంగా మంగళవారం రోజు మంత్రి గుమ్మనూరు జయరాం.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. ఇవాళ లేదా రేపు ఉదయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి జయరాం రాజీనామా చేస్తారని సమాచారం. ఇవాళ రాత్రికే విజయవాడ చేరుకోనున్నారట గుమ్మనూరు.. ఇక, అల్లూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలను కూడా తనతోపాటు విజయవాడకు ఆహ్వానించారట.. గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఖరారైందని ఆయన ప్రచారం చేసుకుంటున్నా.. ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం దీనిపై స్పష్టత ఇవ్వలేదు.. అయితే, రేపు ప్రకటించే టీడీపీ జాబితాలో గుమ్మనూరు జయరాం పేరు ఉంటుందా..? ఉండదా? అనేది ఉత్కంఠగా మారింది.
అవసరం అయితే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై అనర్హత వేటు..
వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌ను కలవడం.. ఆ తర్వాత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.. హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆరణి శ్రీనివాసులు.. వైసీపీలో సీఎం వైఎస్ జగన్ తనకు అన్యాయం చేశారని.. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తనను అవమానించారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. అయితే, ఎమ్మెల్యే శ్రీనివాసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు ఇరవరం వద్ద కార్పెంటర్స్ ఎస్టేట్స్ కు భూమి పూజ చేసిన మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్పెంటర్స్ ఎస్టేట్స్ కు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. చిత్తూరులో విజయనంద రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ నిలబెట్టారు.. విజయనందా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇక, ఎమ్మెల్యే ఆరిణి పార్టీకి ద్రోహం చేశారంటూ ఫైర్ అయిన ఆయన.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు ఆరణి శ్రీనివాసులు అంటూ దుయ్యబట్టారు. జనసేన పార్టీలోకి వెళ్లారని తెలియడంతో పార్టీ అధిష్టానం.. వైసీపీ నుంచి శ్రీనివాసులును సస్పెండ్ చేసిందని వెల్లడించిన ఆయన.. అవసరమైతే అనర్హత వేటు వేస్తాం అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం విజయనందా రెడ్డి విజయానికి మనమంతా కృషి చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్..
సచివాలయం కూడా తాకట్టు పెట్టేసారన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయి..? అని ప్రశ్నించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు.. నేడు రాష్ట్రం అప్పులు 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటే.. అందులో 2.50 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు చేసినవే అని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే.. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా? అని నిలదీశారు. ప్రజలకు అవసరమైనప్పుడు.. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే అన్నారు. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే.. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అనే విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా..? అంటూ ప్రశ్నించారు. ప్రజల అవసరాల కోసం.. ప్రభుత్వ వేసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందన్నారు. చిల్లర రాజకీయ నాయకుడు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు చేస్తేనే సంసారం.. మిగతా వాళ్లు చేస్తే కాదన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుందంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.
తెలంగాణలో 56వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోడీ!
తెలంగాణలో 56 వేలకోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం రామగుండం ఎన్‌టీపీసీ రెండో యూనిట్‌ను ఆరంబించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు 85 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రధాని ఆరంభించిన ప్రాజెక్టులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో తెలంగాణను కలిపే రెండు హైవే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ‘భారత్ దర్శన్’లో భాగంగా మార్చి 4 నుంచి 12 వరకు తొమ్మిది రోజుల పాటు 10 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్‌లను ప్రధాని మార్చి 4 నుంచి 12 మధ్య పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మార్చి 7న గాల్వాన్ లోయలో ప్రధాని మోడీ తొలిసారిగా పర్యటించడం విశేషం. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మార్చి 6 సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కోసం ఢిల్లీకి వెళతారు. అక్కడ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను నిర్ణయిస్తారు. ప్రధాని మోడీ తెలంగాణ నుంచి తన పర్యటనను ఆరంభించారు. ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో 56,000 కోట్ల విలువైన విద్యుత్, రైలు మరియు రహదారి రంగానికి సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు.
అధిక ప్రాధాన్యత విద్యకే.. కార్పొరేట్ స్కూల్‌కి మించి పోటీ పడాలి!
తెలంగాణాలో అన్ని రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యత విద్యకే ఇస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేట్ స్కూల్‌కి మించి మనం పోటీపడాలని విద్యార్థులతో ఆయన అన్నారు. ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం ద్వారా అమీర్‌పెట్ డీకే రోడ్డులోని గర్ల్ ప్రైమరీ స్కూల్ & హై స్కూల్‌లలో రెనోవేశన్ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, డీఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, సాంకేతికతతో మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. అన్ని రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యత విద్యకి ఇస్తాం. నేను విద్యార్థి నాయకుని నుండి ఈ స్థాయికి వచ్చా. ఇక్కడ 900 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరగాలి. కార్పొరేట్ స్కూల్‌కి మించి పోటీ పడాలి. గ్రామీణ ప్రాంత వాతావరణంకి అనుగుణంగా ఇక్కడ చెట్లు ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈసారి మంచి రిజల్ట్ రావాలి’ అని అన్నారు.
6వ తేదీలోగా ప్రభుత్వం దిగిరాక పోతే.. న్యాయ పోరాటం చేస్తాం: కేటీఆర్
మార్చి 6వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వం దిగిరాక పోతే తాము న్యాయ పోరాటం చేస్తాం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. మార్చ్ 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్ కట్టమని ఎందుకు అంటున్నారు?, 20 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధం అయ్యారు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ పైన కాంగ్రెస్ వైఖరి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం మా ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. కేవలం రూ.1000తో రిజిస్టర్ చేశాము. ఆ రోజు మమ్మల్ని తప్పుపడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆనాడు సీఎల్పీ నాయకుడిగా బట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించవద్దు అన్నారు. నో ఎల్‌ఆర్‌ఎస్-నో టీఆర్‌ఎస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై ఎందుకు కట్టుబడి లేరు’ అని ప్రశ్నించారు.
మనోళ్లు పాన్ గుట్కాలకు డబ్బులు తెగ తగలేస్తున్నారు.. అందుకు ఆధారాలివే !
డి-అడిక్షన్ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది. దీని కోసం అనేక ప్రచారాలు కూడా నిర్వహిస్తోంది. కానీ, ఇప్పటికీ ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగం వీటికే వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని తీవ్ర హెచ్చరికలు చేసినా ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. గత 10 సంవత్సరాలలో ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయని దీన్ని బట్టి మీరు ఊహించవచ్చు. ప్రభుత్వ నివేదికల ప్రకారం.. గత 10 సంవత్సరాలలో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్థాలపై ఖర్చు పెరిగింది. ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇలాంటి ఉత్పత్తులకే వెచ్చిస్తున్నారు. గత వారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23 మొత్తం గృహ వ్యయంలో భాగంగా పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై ఖర్చు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పెరిగినట్లు చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వస్తువులపై వ్యయం 2011-12లో 3.21 శాతం నుండి 2022-23 నాటికి 3.79 శాతానికి పెరిగింది. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో ఖర్చు 2011-12లో 1.61 శాతం నుండి 2022-23 నాటికి 2.43 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో విద్యపై వ్యయం నిష్పత్తి 2011-12లో 6.90 శాతం నుంచి 2022-23 నాటికి 5.78 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 2011-12లో 3.49 శాతం నుంచి 2022-23 నాటికి 3.30 శాతానికి తగ్గింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) ఆగస్టు, 2022 నుండి జూలై, 2023 వరకు గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)ని నిర్వహించింది.
శ్రద్దా కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనేనా?.. వైరల్ అవుతున్న ఫోటో..
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మరోవైపు వరుస యాడ్స్ లలో కనిపిస్తుంది.. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.. అయితే గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరూ కలిసి బయట ఎప్పుడూ కనిపించలేదు.. తాజాగా వీరిద్దరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు కలిసి హాజరయ్యారు. గుజరాత్ జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకి శ్రద్ధా కపూర్, తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోడీతో కలిసి వచ్చింది.. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనే, ఇతనితోనే శ్రద్ధా డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల పై వీరిద్దరూ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. మొదటిసారి ఇలా ఇద్దరు కనిపించడంతో నిజమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇక శ్రద్దా కపూర్ ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.. అలాగే తెలుగులో మరో మూవీ కోసం కథలు వింటుందని సమాచారం..
సలార్ పార్ట్ 2 షూటింగ్ అప్డేట్.. అప్పటినుంచే రెగ్యులర్ షూట్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా షూట్ పై క్లారిటి వచ్చింది.. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజాసాబ్ సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఆ తర్వాత సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టనున్నాడట ప్రభాస్. సందీప్ వంగ స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించాడు. ఈలోపు సలార్ 2 పూర్తిచేద్దామని డార్లింగ్ ఫిక్స్ అయ్యారట.. అయితే ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను నటుడు ఇచ్చేశాడు..
భర్తతో నయన్ విడాకుల రూమర్స్.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్..
కోలివుడ్ స్టార్ హీరోయిన్ నయన తార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ విఘ్నేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. నయనతార స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటు వరుస సినిమాల్లో బిజీగా ఉంటుంది…ఎంత స్టార్డమ్ వచ్చినా.. నయనతార మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉండేది. కానీ కొన్నిరోజుల కిత్రం తాను కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. ఇక ఇటీవల నయనతార ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ లిస్ట్లో విఘ్నేష్ శివన్ పేరు కనిపించలేదు. దీంతో నయన్.. విఘ్నేష్ను అన్ఫాలో చేసిందని వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వింత కోట్ను కూడా షేర్ చేసింది.. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.. ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా విఘ్నేశ్ శివన్ ఒక పోస్ట్ చేశాడు.. నయనతార కొన్నిరోజుల క్రితం ఒక స్కిన్ కేర్ బ్రాండ్ను ప్రారంభించింది. తాజాగా ఆ బ్రాండ్కు ఒక అవార్డ్ దక్కిందని విఘ్నేష్ శివన్.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. నయనతార ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చిన్న టెక్నికల్ సమస్య వల్లే విఘ్నేష్ పేరు ఫాలోయింగ్ లిస్ట్లో కనిపించలేదని సన్నిహితులు చెప్తున్నారు.. దాంతో రూమర్స్ మొదలయ్యాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు..