రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. ఇండిపెండెంట్‌గా బరిలోకి చెంగల్రాయుడు..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతున్నాయి.. అయితే, కొన్ని స్థానాల్లో పొత్తులు చిచ్చు పెడుతుంటే.. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు, చేర్పులు కూడా అసంతృప్తులకు దారి తీస్తున్నాయి.. ఇక, తాజాగా టీడీపీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. రాజంపేట అసెంబ్లీ స్థానానికి సుగవాసి సుబ్రహ్మణ్యంను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. ఇదే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అసమ్మతి సెగను రాజేసింది.. బత్యాల చెంగల్రాయుడుకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంపై భగ్గుమంటున్నారు ఆయన అనుచరులు.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు దిగనున్న బత్యాల చెంగల్రాయుడు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి సమావేశమైన చెంగల్రాయుడు అనుచరులు.. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి పెంచారు.. అయితే, మీ నిర్ణయమే నా నిర్ణయమని తన అనుచరుల సమావేశంలో చెంగల్రాయుడు వెల్లడించారట.. నాలుగేళ్లుగా పార్టీ క్యాడర్ కాపాడుకుంటూ వచ్చిన వారికి ఇచ్చే బహుమానం ఇదేనా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుచరులు ఒత్తిడి.. తెస్తున్నారని.. ఆ దిశగా నా నిర్ణయం ఉంటుందనే సంకేతాలను బత్యాల చెంగల్రాయుడు ఇవ్వడంతో.. ఇప్పుడు రాజంపేట టీడీపీలో అసమ్మతి బయటపడినట్టు అయ్యింది. ఇక, టీడీపీకి రాజీనామా చేశాయలనే నిర్ణయానికి బత్యాల చెంగల్రాయుడు వచ్చినట్టుగా తెలుస్తోంది.
నిజమైన వైసీపీ కార్యకర్తలను డబ్బులతో కొనలేరు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. అన్ని పార్టీలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.. కొందరు టికెట్లు దక్కకపోవడంతో.. తమ అనుచరులతో కలిసి.. మరో పార్టీ కండువా కప్పుకుంటుంటే.. మరికొందరు.. ప్రలోభాలకు లొంగి పార్టీలు మాతరుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. అయితే, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను డబ్బులతో ఎవరూ కొనలేరు అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నుండి వెళ్లేవారు కేవలం వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీలోకి పోతున్నారని మండిపడ్డారు.. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు తెరలపాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సంతలో పశువులు కొన్నట్టు మా పార్టీ నాయకులను బెదిరించి ఐదు, పది లక్షలకు కొంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నుంచి వెళ్లిపోయేవారు వారంతా.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే అని పేర్కొన్నారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద నుంచి వచ్చిన స్క్రాపే మళ్లీ తిరిగి వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు.. అయితే, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చేసి ప్రభాకర్ రెడ్డి డబ్బులతో కొనలేడని హెచ్చరించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
జనసేనాని పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాను పోటీ చేసేందుకు సిద్ధమైన పిఠాపురంలో.. జనసేన అభ్యర్థిగా తొలి పర్యటనకు సిద్ధమయ్యారు.. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. ఇక, ఈ రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. అయితే, పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్‌లో గొల్లప్రోలు హెలిప్యాడ్ దగ్గరకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లనున్నారు.. వర్మ ఇంటి దగ్గర లంచ్, విరామం తర్వాత… చేబ్రోలు బహిరంగ సభ దగ్గరికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వెళ్తారని.. జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. అయితే, ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం.. ఈ రోజు శక్తిపీఠం పురుహుతిక దేవి అమ్మవారిని దర్శనం, వారాహికి ప్రత్యేక పూజలు కార్యక్రమం, దత్త పీఠం దర్శనం రద్దు చేసుకున్నట్టుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.. ఇక, అభ్యర్థిగా తొలిసారి పిఠాపురంలో అడుగుపెట్టబోతున్న జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. ఎలాగైనా ఈ సారి విజయం అందుకుని అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు పవన్ కల్యాణ్. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం
ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని.. తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తనను కలిసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కర్నూలు జిల్లా పత్తికొండ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా వైసీపీ నేతలు.. సుమారు గంటన్నరకు పైగా నేతలు, కార్యకర్తలతో గడిపారు సీఎం జగన్.. పలువురు పార్టీ నేతలను, సీనియర్ కార్యకర్తలను పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేయాలన్నదానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.. మరోవైపు.. స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పలువురు నేతలు చేరారు.. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో.. వైసీపీలో చేరారు పలువురు నేతలు.. ఇక, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గుత్తి వద్ద ప్రజల సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ఉమామహేశ్వర నాయుడు.. కాగా, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. నాల్గో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న విషయం విదితమే.
రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లు కేంద్రం నుంచి వచ్చినవే.. కాదని చెప్పే ధైర్యం ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాల కోసం రూ.2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినవే అన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మోడీ మార్క్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యం అని అభివర్ణించారు. ఇక, వివిధ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయి.. కానీ, కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి స్టిక్జర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. గడచిన ఐదేళ్లు నరేంద్ర మోడీ సర్కార్ పంపే నిధులకు బటన్ నొక్కడం తప్ప.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని విమర్శలు గుప్పించారు. అసలు ‘నాడు – నేడు’ నిధులు ఎక్కడ నుండి వచ్చాయో చెప్పే ధైర్యం ఉందా? రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డులెన్నో చెప్పే దమ్ము ఉందా? అంటూ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు లంకా దినకర్.. ఇక, అగ్రవర్ణ పేదలకు 10 శాతం EWS రిజర్వేషన్ ప్రధాని మోడీ ఇస్తే, రాష్ట్రంలో అమలు పరచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. ఒంగోలు వద్ద కొత్తపట్టణం ఫిషింగ్ హార్బర్ ఎందుకు అడుగు ముందుకు పడలేదు? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు అనుమతులిచ్చినా.. నిర్మాణ దశలో ఉన్న కాలేజీలు ఎందుకు పూర్తికాలేదు? అని ప్రశ్నించారు. రూ.9 వేల కోట్లు పంచాయితీల నిధులు దారి మళ్లింపుతో గ్రామాలు అభివృద్ధిలో తిరోగమనం పట్టాయని ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్.
ఉత్కంఠకు తెర.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఆ మూడు పెండింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుల్లో భాగంగా.. 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది జనసేన పార్టీ.. అయితే, జనసేన ఇప్పటికే ప్రకటించిన లిస్ట్‌లో మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.. ఎన్నికల తరుణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. జనసేనలో చేరారు సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి.. కానీ, ఇప్పటి వరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేయకపోవడంతో.. బాలశౌరి పొలిటికల్ ప్యూచర్ ఏంటి? అనే చర్చ సాగింది.. మొత్తంగా.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థినిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ తరుపున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేసినట్టు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 శాసన సభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుందని.. కానీ, అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని.. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. సర్వేకు సంబంధించిన ఫలితాలు వచ్చాక అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది జనసేన. అయితే, మొత్తంగా చూస్తే ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగులో పెట్టింగ్‌లో పెట్టింది జనసే.. అందులో ఒకటి విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. కానీ, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లల్లో కసరత్తు కొనసాగుతోంది.. త్వరలోనే ఆ మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్ కల్యాణ్.
సీమలో ట్రెండ్ మారింది.. ఇక వైసీపీ బెండు తీస్తారు..!
సీమలో ట్రెండ్ మారింది.. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెండు తీస్తారు అంటూ హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రజాగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన.. ఈ రోజు కడపలో పర్యటించారు.. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. కడప ఎవరి ఇలాకా కాదు అన్నారు. వైఎస్ జగన్ మీటింగ్ లో బిర్యానీ, క్వాటర్ బాటిల్స్ ఇచ్చారని ఆరోపించారు. మీది వెన్నెల్లో మీటింగ్, మాది ఎండల్లో మీటింగ్.. రాయలసీమ గడ్డ నుంచి ముఖ్యమంత్రికి సవాల్ విసిరుతున్నా.. మీ ఐదు సంవత్సరాల పదవీకాలంలో కడపకు ఏమి చేశారో చెప్పగలరా ? అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు, పులివెందులకు చేసింది శూన్యం.. రెండుసార్లు స్టీల్ ప్లాంట్ కు సీఎం శంకుస్థాపన చేశారు.. నేను సీఎంగా ఉండుంటే ఇప్పటికి ఎప్పుడో స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేవాడిని అని తెలిపారు. రాయలసీమలో సాగునీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేది.. సొంత జిల్లాలో ఏమి అభివృద్ధి చేశావో చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు చంద్రబాబు.. హత్య రాజకీయాలు జగన్ కు తెలుసు అని ఆరోపించిన ఆయన.. సీమలో ట్రెండ్ మారింది.. ఇక వైసీపీకి బెండు తీస్తారు అని హెచ్చరించారు. నందం సుబ్బయ్యను చంపిన భయపడకుండా టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని.. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని టీడీపీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఇక, వైఎస్ జగన్ గెలవకుండా ఉండడానికి, వ్యతిరేక ఓటుచీలకుండా ఉండడానికి, పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నాం.. కడప స్టీల్ ప్లాంట్ తెస్తాం.. వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించారు.
కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్న మేయర్.. పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన సీఎం
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విజయలక్ష్మి తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశరావు కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న రేవంత్ రెడ్డిని కలిశారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే ప్రారంభమైందని, నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ లోనే ఉన్నానని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.
భారతరత్న అవార్డు అందుకున్న పీవీ తనయుడు ప్రభాకర్ రావు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్గజాలకు నేడు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. మరణానంతరం పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని అందజేశారు. వారితో పాటు మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి కూడా భారతరత్న ఇవ్వబోతున్నారు. ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి ఈ గౌరవాన్ని అందజేయనున్నారు. ఈ ఏడాది ఐదుగురు వ్యక్తులకు భారతరత్న ఇవ్వాలని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహామన మాలవ్య, పండిట్ అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఇప్పటి వరకు మొత్తం 53 మందికి భారతరత్న లభించింది.
రూ.14లక్షల కోట్ల లోన్ తీసుకుని ఏం చేస్తారు.. ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ ప్రశ్న
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం రూ. 14 లక్షల కోట్లకు పైగా రుణం తీసుకోబోతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ రుణంతో ఏం చేయబోతున్నారని అడిగారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు రూ.55 లక్షల కోట్లు ఉందన్నారు. గత 10 ఏళ్లలో మోడీ క్కడే దానిని రూ.205 లక్షల కోట్లకు పెంచారు. ఆ డబ్బు ఎవరి కోసం ఖర్చు చేశారని ప్రశ్నించారు. పెద్ద కోటీశ్వరుల రుణమాఫీకి ఎంత డబ్బులు వెచ్చించారని ఆరోపించారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దాదాపు రూ.150 లక్షల కోట్ల రుణం తీసుకుందన్నారు. దీని ప్రకారం నేడు దేశంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ.1.5 లక్షల అప్పు ఉందని ఆయన అన్నారు.
ఆమెకు వంట చేయడం మాత్రమే తెలుసు.. ఇంకేం తెలియదు..!
బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివ శంకరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దావణగెరె స్థానం నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం శివ శంకరప్ప ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. ఇక, దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బీజేపీ పోటీలో నిలిపింది. గాయత్రి సిద్దేశరను ఉద్దేశించి ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ఆమె ఎన్నికల్లో విజయం సాధించి మోడీకి కమలం అందించాలనుకుంటోందన్నారు. ముందు దావణగెరె సమస్యలను తెలుసుకోవాలి.. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం.. కనీసం మీకు మాట్లాడటం కూడా తెలియదు.. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసు.. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదంటూ శివశంకరప్ప విమర్శలు గుప్పించారు.
విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవపై ఢిల్లీ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్..
IPL 2024లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన నెలకొంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ ఒకరినొకరు కలుసుకున్నారు. వీరు తమ మధ్య ఉన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఆర్సీబీ ఇన్సింగ్ టైమ్ అవుట్ సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గంభీర్ విరాట్ తో కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే, ఢిల్లీ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ, గంభీర్‌ల ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఏ సమస్య వచ్చినా సహాయం చేయడానికి 112 సిద్ధంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ఈ ఫోటో గురించి చెబుతూ.. ఏదైనా ‘ఒక గొడవ జరిగిందా? 112కు డయల్ చేయండి.. దాన్ని మేము పరిష్కరిస్తాం.. ఏ గొడవ పెద్దది కాదు అంటు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టంట తెగ వైరల్ అవుతుంది. ఇక, ఐపీఎల్ చివరి సీజన్‌లో, గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీతో మైదానంలో గొడవకు దిగాడు.. అలాగే, ఐపీఎల్ 2013 లో గంభీర్ KKR కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా కోహ్లీతో కూడా గొడవపడ్డాడు.. ఈ గొడవకు సంబంధించి కూడా గతంలో ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేశారు.. ఈలాంటి గొడవలు జరిగిన సరే 112కు డయల్ చేయండి అని తెలిపారు.
సూపర్ హిట్ డైరెక్టర్ తో ‘వైబ్’ కుదిరిదంటున్న సందీప్ కిషన్..!
సందీప్ కిషన్ 31వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ఈరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర బంధం. సెన్సేషనల్ హిట్ సాధించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలను తీస్తున్న సందీప్ కిషన్ మరోసారి కొత్త ప్రయత్నానికి నాంది పలికాడు. సెన్సషనల్ డైరెక్టర్ స్వరూప్ యాక్షన్ థ్రిల్లర్ ను తన స్టైల్ లో ఎలా తెరకెక్కిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను కూడా తనదైన శైలిలో కమర్షియల్ హంగులతో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు రాహుల్ యాదవ్ నిర్మాతగా వహించబోతున్నారు. ఈ చిత్రానికి ‘వైబ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ చిత్ర బృందం ఎంచుకుంది. ఇకపోతే ఈ సినిమా పోస్టర్ చూస్తే.. పరిస్థితులు అద్భుతప్పినప్పుడు హింస మార్గాన్ని అనుసరించే విధంగా హీరో తన స్నేహితులతో కలిసి పోరాడే విధంగా సినిమా కథ అని తెలుస్తోంది. పోస్టర్ లో హీరో సందీప్ కిషన్ తో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఏదో యుద్ధానికి రెడీ అవుతున్నట్లుగా కనబడుతోంది. ఇక భారీ యాక్షన్ తో పాటు కాలేజ్ బ్యాక్ డ్రాప్ వైపు సినిమా తెరకెక్కబోతోంది. ఇక సందీప్ కిషన్ తాజాగా నటించిన ఊరి పేరు భైరవకోన సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో అదే ఫామ్ ను కొనసాగించాలని ఎదురు చూస్తున్నాడు.
‘గేమ్ చేంజర్’ సినిమాకు గ్యాప్.. వేకేషన్ కు ఎవరితో వెళ్తున్నారో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా మొదలై మూడేళ్లు అయ్యింది.. ఇప్పటికి విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా జరగండి సాంగ్ ను విడుదల చేశారు.. ఆ సాంగ్ విమర్శలను అందుకోవడం జరిగింది.. ఇప్పటికి ట్రోల్స్ ఆగడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు కదా.. ఇక తాజాగా రామ్ చరణ్ షూటింగ్ కు గ్యాప్ తీసుకున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం వైజాగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.. అయితే ఇప్పుడు ఆ షూటింగ్ కు గ్యాప్ తీసుకున్నారని తెలుస్తుంది.. తాజాగా చరణ్ వెకేషన్ కి వెళ్తున్నారని సమాచారం. తన పెంపుడు కుక్కపిల్ల రైమ్ తో కలిసి రామ్ చరణ్ వెకేషన్ కి వెళ్తున్నారని సమాచారం. ఫ్లైట్ లో చరణ్, రైమ్ కూర్చొని దిగిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఎక్కడికి వెళ్లినా రామ్ చరణ్ తో తన భార్య ఉపాసన వెళ్ళేది.. కానీ ఇప్పుడు రైమ్ తో వెళ్తున్నారేంటో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి..
సరికొత్త లుక్ లో నితిన్.. ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే..!
హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా తను నటించబోయే సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. రాబిన్ ఫుడ్ గా హీరో నితిన్ ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదివరకు హీరో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్లో ‘భీష్మ’ సినిమా రాగ అఖండ విజయాన్ని అందుకుంది. దానితో మరోసారి వీరిద్దరూ మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఓ హాస్య యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా.. రాబిన్ హుడ్ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్ పరంగా చూస్తే.. రాబిన్ హోటల్ మేకర్స్ నితిన్ తో భారీగా ప్లాన్ చేసినట్టు కనబడుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ట్రెండి లుక్కుల్లో కనిపించాడు నితిన్. తాజాగా విడుదలైన రాబిన్ ఫుడ్ పోస్టర్ లో స్టైలిష్ గా నడుస్తూ.., బ్లూటూత్ లో మాట్లాడుతున్నట్టుగా హీరో నితిన్ కనిపిస్తున్నాడు. పోస్టర్ బట్టి చూస్తే.. హీరో నితిన్ ఏజెంట్ లాగా కనిపిస్తున్నాడు. దీనికి కారణం హీరో వేసుకున్న టీ షర్టుపై ఏజెంట్ RH గా రాసి ఉండడమే.