ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’.. వైసీపీ విస్తృత ఏర్పాట్లు..
ఆంధ్రప్రదేశ్ గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈసారి మరింత జోష్‌తో ముందుకు సాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. అన్ని పార్టీలు జట్టు కట్టినా.. సింగిల్‌గా విజయమే లక్ష్యం అంటుంది.. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అవుతోంది.. ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధం అయ్యారు.. ఇడుపులపాయ నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార భేరీకి శ్రీకారం చుట్టనున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్.. బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ఉండనున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. అయితే, ఎన్నికల షెడ్యూల్‌కు ముందే.. సిద్ధం పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించి ఔరా! అనిపించింది వైసీపీ.. ఈ సభలతో ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు మరింత జోష్‌తో పనిచేసేలా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.. ఇప్పుడు విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగేలా ప్లాన్ చేశారు.. ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.. ఇక, ఆ తర్వాత కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు సీఎం జగన్.. ఆ తర్వాత సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఇక నేటి నుండి ప్రతిరోజు వైసీపీలో చేరికలు..
ఇక, నేటి నుండి ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు మొదలవుతాయని తెలిపారు కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి.. కడప జిల్లా వేంపల్లిలో ఈ రోజు టీడీపీ నుండి వైఎస్సార్సీపీలోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేశారు.. వైసీపీ నాయకులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 కుటుంబాలు.. టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.. ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి టీడీపీని వీడి వైసీపీలో భారీగా చేరికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. ఇక, ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి నుండి ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం స్వాగతం పలుకుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే విధంగా ప్రతి ఒక కార్యకర్తకు అండగా ఉంటామని వెల్లడించారు. సతీష్ రెడ్డి అన్న ఆలోచనలు.. నా ఆలోచనలు ఒకటేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమయ్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను విజయవంతం చేయలని కోరారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.
సీటు కోసం పోతిన మహేష్ నిరాహార దీక్ష.. పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కొన్ని స్థానాల్లో చిచ్చు పెడుతుంది.. కొన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు పార్టీలకు చెందిన బలమైన నేతలు ఉండడం కూడా దీనికి కారణం అవుతుంది.. దీంతో.. అంతా నాకంటే.. నాకే అంటూ సీటు కోసం పట్టుపడాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయించాలంటూ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిస.. ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్.. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడమే న్యాయం అన్నారు పోతిన మహేష్.. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం.. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారన్న ఆయన.. పశ్చిమ నియోజకవర్గంలో కొండా ప్రాంతల అభివృద్ధికి జనసేన పార్టీ పాటుపడిందన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు అన్నారు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడలేరన్నారు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గానికి పంపించిది మా పోరాటవళ్లే కదా? అని ప్రశ్నించారు. ఇక, నాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద నమ్మకం ఉందన్నారు.. పవన్ కల్యాణ్ 2వ లిస్ట్ లో నా పేరు ఉంటుంది అని చెప్పారు.. ఆయన చెప్పడం వల్లే నా దూకుడు పెంచాను.. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అందరూ కోరుకుంటున్నారు.. నాకు సీటు ఇవ్వడమే నాయ్యం అన్నారు పోతిన మహేష్..
ఖరారు చేయాల్సిన ఎంపీ సీట్లపై టీడీపీ కసరత్తు.. వారికే ఛాన్స్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఇంకా ఖరారు చేయాల్సిన ఎంపీ సీట్లపై కసరత్తు చేస్తోంది.. జనసేన-టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని కీలక స్థానాలు కోల్పోయిన ఆ పార్టీ.. ఓ వైపు నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు.. పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఎక్సైజ్ చేస్తోంది.. విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేయనుంది టీడీపీ. ఈ నేపథ్యంలో.. విజయనగరం లోక్ సభ స్థానం తూర్పు కాపులకు కేటాయించే అవకాశం ఉంది.. శ్రీకాకుళం, అనకాపల్లి స్ఖానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయించిన టీడీపీ, బీజేపీ. విశాఖ టీడీపీ తరపున బరిలో నిలవనున్నారు కమ్మ సామాజిక వర్గ అభ్యర్థి భరత్… విజయనగరం పరిధిలో రెండు లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు ఉండగా.. విజయనగరం సీటు తూర్పు కాపులకి తప్పదని భావిస్తున్నారు చంద్రబాబు. తెర మీదకు కళా, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు వస్తున్నాయట.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరును కూడా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, ఒంగోలు, కడప పార్లమెంట్లలో రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ ఉండనుండగా.. అనంతపురం పార్లమెంట్ నుంచి బీసీకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.. మొత్తంగా ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయా స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రచారంపై ఫోకస్ పెట్టిన పురంధేశ్వరి.. రాజమండ్రి నుంచి ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి తెలుగుదేశం-జనసేన పార్టీలతో జట్టు కట్టి పోటీ చేస్తోంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. అయితే.. ఇప్పటికే తాము పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.. ఇక, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది.. మరోవైపు.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతోంది బీజేపీ.. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి.. ఎన్నికల ప్రచారంపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు.. నిన్ననే ఆరు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. నేడో, రేపో మిగతా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది.. ఇక, వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఏపీలో ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించనున్న సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరుఅయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.. కేంద్రమంత్రులు, జాతీయ నేతలు ఇచ్చే సమయానికి అనుగుణంగా.. వారు ఎక్కడ పాల్గొంటే బాగుంటుంది అనేదానిపై సమాలోచనలు చేస్తోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. టీడీపీ-జనసేనతో కలిసి ఉమ్మడిగా నిర్వహించే సభలపైనే చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సభలకు బీజేపీ కీలక నేతలను రంగంలోకి దించే అవకాశం ఉంది.
హొలీ వేడుకల్లో బండి సంజయ్.. చిన్నారులతో ఆడుతూ సంబరాలు
దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రంగులు వేసి పండుగ చేసుకుంటున్నారు. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. యువకులు, వృద్ధులు, పేదలు, ధనవంతులు అందరూ కలిసి పండుగ చేసుకుంటున్నారు. కాగా.. హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఈరోజు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం సతీమణితో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్న బండి సంజయ్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతూ కన్పించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కన్పించిన పారిశుధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారిలో కన్పించిన ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబురాలు జరుపుకున్నారు.
బీజేపీ గూటికి గాలి జనార్థన్ రెడ్డి.. కమలం పార్టీలో కేఆర్‌పీపీ విలీనం..
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇవాళ కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో జనార్థన్ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సమక్షంలో గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ)ని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. ఇక, గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కేఆర్‌పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశానన్నారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఎలాంటి షరతులు, ఎలాంటి పదవులు అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం, మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య బీజేపీలో జాయిన్ అయ్యారని తెలిపారు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.. జనార్దన్ రెడ్డి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుంది.. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని మాజీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మూడవ ప్రపంచ యుద్ధం.. అణు పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న బ్రిటన్
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బ్రిటన్ అణు పరిశ్రమకు సంబంధించి పెద్ద అడుగు వేసింది. అణు పరిశ్రమలో ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టబోతోందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ప్రకటించారు. దీని వల్ల పౌరులకు ఉపాధి కల్పన జరుగుతుంది. యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం దేశంలో అణు పరిశ్రమలో 252 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించనున్నారు. ఇది బ్రిటన్ అణుశక్తిని పెంచడమే కాకుండా పౌరులకు ఉపాధిని కూడా సృష్టిస్తుంది. ఈ పెట్టుబడి గురించి సమాచారం ఇస్తూ, దీని ద్వారా దేశంలో 40 వేల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. దేశంలో గ్రౌండ్ రియాలిటీపై ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అనేక మంది బడా పారిశ్రామికవేత్తలతో చేతులు కలుపుతుంది. బీఏఈ సిస్టమ్స్, రోల్స్ రాయిస్, ఈడీఎఫ్, బాబ్‌కాక్ వంటి సంస్థలతో కలిసి పనిచేసే నైపుణ్యాలు, ఉద్యోగాలు, విద్యలో 2030 నాటికి కనీసం 763 మిలియన్ యూరోలను ప్రభుత్వం పెట్టుబడి పెట్టనున్నట్లు పీఎం సునక్ డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం తన ప్రకటనకు ముందే తెలిపింది. ప్రధానమంత్రి ఈ పథకాన్ని ఆంగ్ల నగరమైన బారో-ఇన్-ఫర్నెస్‌లో ప్రకటిస్తారు. తన పర్యటనకు ముందు అణు ఇంధన పరిశ్రమను రక్షించడం దేశానికి ముఖ్యమని ప్రధాని అన్నారు.
మళ్ళీ దొరికేశాడు.. ఫ్యామిలీ స్టార్ రెండో పాట అక్కడి నుంచి తస్కరించిందా?
జులాయి సినిమాలో బ్రహ్మానందం పాత్రకి ఒక దొంగతనం వీక్ నెస్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా దొంగతనం చేస్తే నిమిషంలోనే పట్టుబడడం అతని స్పెషాలిటీ. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్లు కూడా దాదాపు అలాగే తస్కరించి అదేనండీ ఇన్స్పైర్ అయి ఈజీగా దొరికేస్తున్నారు. గతంలో ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ విషయంలో ట్రోల్ అయ్యేవాడు. ఇప్పుడు ఆ వ్యవహారం కాస్త తగ్గింది. తాజాగా మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో గీత గోవిందం వంటి మంచి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన గోపి సుందర్ సైతం ఈ అంశంలో టార్గెట్ అవుతున్నారు. మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాతో టాలీవుడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన ఆయన తర్వాత తెలుగులో చాలా మంచి చార్ట్ బస్టర్స్ ఇచ్చారు. వాటిలో పరశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం సినిమా సాంగ్స్ ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్. ఇలాంటి కాంబినేషన్ రిపీట్ అయిన క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమాకు కూడా గోపి సుందర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఆయన సినిమాకి మంచి మ్యూజిక్ ఇస్తాడని అనుకుంటే మొదటి పాట నంద నందనా సాంగ్ ఏమో తమిళ డబ్బింగ్ అనంతపురం ట్యూన్ ని పోలినట్టు ఉంది. కళ్యాణి వచ్చా వచ్చా అనే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఆ ట్యూన్ ఎక్కడో విన్నట్టు అనిపించిందని కాస్త బుర్రకు పదును పెట్టి ఆలోచిస్తే అరుంధతి సినిమాలో డోలారే డోలారే డం ట్యూన్ ని పోలినట్టే ఉంది.
ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ఆ బోల్డ్ మూవీ..
ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను అందిస్తుంటాయి.కాన్సెప్ట్ బాగుండి, సరికొత్తగా ఉంటే ఎలాంటి జోనర్ సినిమాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. కొన్నిసార్లు థియేటర్లలో యావరరేజ్ గా నిలిచిన చిత్రాలు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇక నేరుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల్లో కొన్ని మూవీస్ టాప్ ట్రెండింగ్లో నిలుస్తుంటాయి.అలాంటి వాటిలో ఇటీవల వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీ మిక్స్అప్ ఓటీటీలో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది. న్యూ ఏజ్ బోల్డ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో కమల్ కామరాజు, పూజా జావేరి, ఆదర్శ్ బాలకృష్ణ మరియు అక్షర గౌడ మెయిన్ పాత్రలు పోషించారు. వీరితోపాటు పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష సినిమాలతో పాపులర్ అయిన కామాక్షి భాస్కర్ల మరియు బిందు చంద్రమౌళి మరో రెండు పాత్రల్లో ఆకట్టుకున్నారు. బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సినిమాగా వచ్చిన మిక్స్ అప్ చిత్రానికి ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించారు. స్ప్రింట్ ఫిల్మ్స్ పతాకంపై తిరుమల్ రెడ్డి అమిరెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ సినిమాకు కౌశిక్ సంగీతం అందించారు. భార్యాభర్తల మధ్య సెక్సువల్ లైఫ్, ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా మార్చి 15న ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైంది. స్ట్రీమింగ్ తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.గత కొన్ని రోజులుగా ఆహా ఓటీటీలో నెంబర్ వన్ ప్లేసులో ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌లో చూపించిన బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్‌తో తెగ ట్రెండ్ అయింది. ఇప్పుడు ఏకంగా సినిమానే ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా చివరిగా మాత్రం మంచి సందేశం ఇచ్చారు.