మహిళా అభ్యర్థులు.. తాళిబొట్టు, మెట్టెలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ క్లారిటీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-4 ఎక్సామ్ రేపు (శనివారం) జరుగనుంది. ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోంది. 8,180 గ్రూప్-4 పోస్టులకు గాను 9.51 లక్షల మంది నిరుద్యోగాలు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో చోటు చేసుకున్న ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ పకడ్భందీగా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. అయితే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని రూల్స్ ఉంటాయని వెల్లడించింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై మహిళా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని రూల్స్ లేదని ఆయన చెప్పారు. హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యువతీయువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఉంటాయన్నారు. అందుకు సరిపడా మహిళా సిబ్బందిని కూడా నియమించామని కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డి చెప్పారు.
వైఎస్ వివేకా హత్య కేసు.. ముగియనున్న డెడ్‌లైన్.. తర్వాతేంటి..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేటితో విచారణ ముగియనుంది.. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది.. మరి కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? లేదా సుప్రీంకోర్టును మరింత గడువు కోరనున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది.. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్ కుమార్‌రెడ్డిని, వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ.. అయితే, అరెస్ట్ చేసిన 90 రోజుల్లో నిందితులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేయాల్సి ఉంటుంది.. వీరిపై జులై 12వ తేదీ లోగా ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్‌పై వచ్చే నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఈ నేపథ్యంలో సీబీఐ మరింత సమయం కోరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో అనుబంధ చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేసింది సీబీఐ.. ఎంపీ అవినాష్ రెడ్డిపై చార్జిషీట్ దాఖలు చేయగా.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై చార్జిషీట్‌లో అభియోగాలు నమోదు చేసింది.
డొంక తిరుగుడు వద్దు.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించు..
డొంక తిరుగుడు వద్దే వద్దు.. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలంటూ నారా లోకేష్‌కు మరోసారి ఛాలెంజ్ విసిరారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. యువ గళంకు వస్తున్న స్పందనను చూసి సీఎం జగన్ జడుసుకుంటున్నాడని లోకేష్ మాట్లాడడం విచిత్రంగా ఉందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా ఆపే దమ్ముంటే వచ్చి పోటీ చేయాలి.. ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవాలని లోకేష్ కు సవాల్ విసిరాను.. లేక నీ తరపున ఎవరినైనా పెట్టి గెలవాలని కూడా చెప్పా.. రాకపోయినా ఓడిపోయినట్లే నని భావిస్తా అన్నారు.. టికెట్ రాదంటున్నారు కదా అయితే ఎందుకు సవాల్ స్వీకరించడం లేదు.. దమ్ముంటే సవాల్ స్వీకరించాలి.. అంతేగానీ డొంక తిరుగుడు వద్దన్నారు.
టీడీపీతో పవన్ సహజీవనం.. చిరంజీవి మీలా ఎవరినీ మోసం చేయలేదు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. ఈ రోజు సాయంత్రం భీమవరంలో వారాహి విజయయాత్రలో ప్రసంగించనున్న విషయం విదితమే కాదు.. ముందుగానే పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు లోకల్ ఎమ్మెల్యే గ్రంధి… పవన్ కల్యాణ్, చంద్రబాబుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమే.. పేదల కష్టాలు వారికి అవసరం లేదని విమర్శించారు.. వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఎల్‌కేజీ లో చేర్పించేందుకు వయసు నిబంధన సడలిస్తు జీవో ఇవ్వమని ముఖ్యమంత్రికి విన్నవిస్తాను అంటూ సెటైర్లు వేశారు. పార్టీలు పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిది.. కానీ, పార్టీని ప్యాకేజీ కోసం అమ్మేయడం సరికాదని వ్యాఖ్యానించారు గ్రంధి శ్రీనివాస్.. ఎప్పుడు ఏం మాట్లాడతారో పవన్ కే అర్థం కాదన్న ఆయన.. గుడ్డలు ఊడదీసి కోడతాను అనేది వైసీపీకి ఓటు వేసిన వారినా..? లేక మిమ్మల్ని, చంద్రబాబుని ఓడించిన ప్రజలనా..? అని నిలదీశారు. పవన్ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపెస్తే.. మీరు టీడీపీతో సహజీవనం చేస్తున్నారని విమర్శించారు. అయితే, చిరంజీవి ఎవరినీ మోసం చేయలేదు… కానీ, పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.. అభిమానిగా పవన్ కల్యాణ్‌ని కోరేది ఒక్కటే.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని సూచించారు.
అమూల్ చేతికి విజయ డైరీ.. లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం.. రైతులకు మేలు..!
అమూల్ సంస్థకు విజయ డైరీని అప్పగించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. జులై 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయ డైరీని ప్రారంభిస్తారని తెలిపారు.. చిత్తూరు విజయ డైరీకి రూ.12 కోట్లు బకాయిలు ఉన్నాయి.. వాటిని త్వరలో చెల్లిస్తాం అని ప్రకటించారు. ఇప్పటికే పాడి రైతులకు ఐదు నుంచి పది రూపాయలు పెరిగాయి.. అమూల్ రాకతో చిత్తూరు జిల్లాతో పాటు పక్క జిల్లా పాడిరైతులకు లీటర్ కు పది రూపాయలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వెల్లడించారు.. ఇక, విద్యుత్ భద్రత వారోత్సవాలను ఏటా నిర్వహిస్తున్నాం.. నాయణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్నాం.. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం.. విద్యుత్ అంతరాయాలు లేకుండా అందిస్తున్నాం.. జూన్ నెలలో కూడా విద్యుత్ వినియోగం పెరిగిందని.. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా సిఎం జగన్ ఆదేశాలకు విద్యుత్ అందించామని వెల్లడించారు.
అచ్చుతాపురం సెజ్‌లో మరోసారి భారీ పేలుడు..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.. ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలినట్టు స్థానికులు చెబుతున్నారు.. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది… ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్టుగా తెలుస్తుండగా.. మరికొంతమంది గాయాలతో బయటపడినట్టు చెబుతున్నారు.. ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతుండగా.. భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.. ఓవైపు మంటలు, మరోవైపు పొగలు పరిసర ప్రాంతాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ప్రస్తుతం రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.. మరికొన్ని ఫైరింజన్లను రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అదే చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అబద్ధానికి షర్టు, ప్యాంటు వేస్తే చంద్రబాబులా ఉంటుందని విమర్శించారు.. చంద్రబాబు జీవితం అబద్ధాలమయం.. జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు.. ప్రపంచంలో ఏ మంచి జరిగినా అన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటు.. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్య నాదేళ్ల సీఈవోగా ఎదిగారని చంద్రబాబు చెప్పారు.. ఇంతకన్నా పచ్చి అబద్ధం వేరేది ఉందా? 1992లోనే మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెళ్ల చేరారు.. అప్పటికి ఇంకా చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు.. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు రాలేదు.. ఇది అందరికీ తెలిసినా.. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మాత్రం ఆగడంటూ మండిపడ్డారు. ఏమి జరిగినా అంతా తనవల్లే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు అని సెటైర్లు వేశారు మంత్రి.. దేశంలో జాతీయ రహదారులు వేసే విషయం కూడా తానే వాజ్‌పేయ్‌కు చెప్పానని కూడా చంద్రబాబు చెప్పుకుంటున్నారు.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన విషయం చూస్తే ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలుస్తుందని.. చంద్రబాబు లాగా ఇంగ్లీష్ మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా..? మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఇంగ్లీష్ మీడియంను జగన్ తీసుకొస్తే దానిపై విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ మీద చార్జిషీట్ వేయడానికి టీడీపీ నేతలకు ఏం అర్హత ఉంది అని నిలదీశారు కాకాణి..
అవినీతి కారణంగా ముంబై మునిగిపోయింది.. ప్రభుత్వంపై విరుచుకుపడిన ఉద్ధవ్ సేన
శివసేన (యూబీటీ)కి చెందిన సామ్నా తన తాజా సంపాదకీయంలో రుతుపవనాల సన్నద్ధత, ముంబయిలో వరదల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది. అవినీతి కారణంగా నగరం మునిగిపోయిందని పేర్కొంది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నేతృత్వంలోని మరాఠీ వార్తాపత్రిక సామ్నా బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హయాంలో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బిల్డర్లు, కాంట్రాక్టర్ల నియంత్రణలోకి వచ్చిందని పేర్కొంది. బీజేపీ వ్యాపారులు, కాంట్రాక్టర్ల పార్టీ అని, ముంబై నగరం, నగర మునిసిపల్ కార్పొరేషన్‌తో భావోద్వేగ సంబంధం లేదని, అందుకే వారు నగరంలో పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని సంపాదకీయం పేర్కొంది. నగరంలో తీవ్రమైన వరదల గురించి సామ్నా సంపాదకీయం మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలో నిర్మించిన నగరం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొంది. దీని కారణంగా, ముంబై జోషిమత్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని వెల్లడించింది. పౌరసంఘంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ముంబైలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారని, తొలి వర్షంకే ముంబై మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారని సంపాదకీయం పేర్కొంది.
ఢిల్లీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. అతిషికి ఫైనాన్స్, ప్లానింగ్, రెవెన్యూ శాఖలు!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు అతిషికి ఢిల్లీ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, ఆదాయానికి సంబంధించిన అదనపు బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు విభాగాలు గతంలో కైలాష్ గెహ్లాట్ వద్ద ఉండేవి. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాల తర్వాత అతిషి, సౌరభ్ భరద్వాజ్‌తో పాటు మార్చిలో మంత్రివర్గంలోకి ప్రవేశించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియా అరెస్ట్ కాగా, మనీలాండరింగ్ కేసులో జైన్ గతేడాది అరెస్టయ్యాడు. ఆమె శక్తి, విద్య, కళ, సంస్కృతి మరియు భాష, పర్యాటకం, ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక విద్య, ప్రజా సంబంధాల పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉన్నారు. తాజా చేరికతో ఆమె వద్ద ఉన్న పోర్ట్‌ఫోలియోల సంఖ్య 10కి చేరనుంది. గురువారం నాడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమస్యపై ఒక వివాదం చెలరేగింది. దీనికి సంబంధించిన ఫైల్ నాలుగు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద ఉందని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. దీనిని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తిరస్కరించింది.
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి?
మోటారు వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అది లేకుండా మోటారు వాహనాన్ని నడపడానికి ఎవరూ అనుమతించబడరు. కానీ, మీరు విదేశాలకు వెళ్లాలి.. మీకు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అనుకుందాం, అది మిమ్మల్ని విదేశాల్లో కూడా వాహనాలను నడిపేందుకు అనుమతి ఉండదు. మీరు విదేశాలకు వెళుతున్నట్లయితే, అక్కడ డ్రైవింగ్ చేయడానికి మీకు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ అవసరం, దానిని మీరు సంబంధిత RTO (ప్రాంతీయ రవాణా కార్యాలయం) నుండి పొందవచ్చు. దీన్ని చేయడానికి రెండు ప్రధాన షరతులు ఉన్నాయి. మొదటగా, ఇప్పటికే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఇవ్వబడుతుంది. రెండవది, సదరు వ్యక్తి భారతదేశ నివాసి అయి ఉండాలి. ఈ రెండు షరతులు కంపల్సరీ. అప్పుడు మాత్రమే మీరు అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి కోసం ప్రాసెస్ చేయగలరు. ఇందుకోసం సంబంధిత ఆర్టీఓలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫారమ్ 4A నింపి సమర్పించాలి. దీనితో పాటు, ఒక దేశానికి వెళ్తున్నారని.. మీరు అక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నారో కూడా మీరు RTOకి తెలియజేయాలి.
‘డబుల్ ఇస్మార్ట్’ రెడీ… పూరి టైం స్టార్ట్!
సినిమాలు అన్నాక హిట్లు, ఫట్లు కామన్. కానీ లైగర్ ఫ్లాప్ మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్ చేసేసింది. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ఎఫెక్ట్ పూరిపై గట్టిగానే పడింది. అసలు పూరితో సినిమాలు చేసే హీరోలే లేరంటూ.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అది కూడా తన ఫార్మాట్‌లోనే రాబోతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేసి ఆడియెన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. ఇటీవలె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా రిలీజ్ డేట్‌తో సహా ప్రకటించాడు. వచ్చే మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు.. అనౌన్స్మెంట్ రోజే చెప్పేశాడు. ప్రస్తుతం పూరీ ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే ఫుల్లుగా ఫోకస్ చేశాడు. అయితే ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా షూటింగ్ జులై నెలలో స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. జులైలో లాంఛనంగా మొదలుపెట్టి, ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట పూరి. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని.. ఎట్టి పరిస్థితుల్లోను సమ్మర్ రేసులో సినిమాను నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీనుతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి జూలైలో రామ్, పూరి ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవనున్నాడని చెప్పొచ్చు. మరి డబుల్ ఇస్మార్ట్‌తో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
టీజర్ వార్ పీక్స్.. షారుఖ్ vs ప్రభాస్
బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల గ్యాప్‌తో రాబోతున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు, టీజర్ విషయంలో మాత్రం పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది సలార్. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఇన్ని రోజులు ఆదిపురుష్ కారణంగా సలార్ అప్డేట్స్‌ను హోల్డ్‌లో పెట్టారు. కానీ ఇప్పుడు సలార్ టైం స్టార్ట్ అయిపోయింది. జూలై ఫస్ట్ వీక్‌లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. జూలై 7న సలార్ టీజర్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదే రోజు.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలె పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. జవాన్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 7న జవాన్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో జవాన్ టీజర్‌ను జులై 7న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్. అయితే ఒకే రోజు రెండు బిగ్ పాన్ ఇండియా సినిమాల టీజర్స్ బయటికి వస్తే.. టీజర్ వార్ పీక్స్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్. నిజంగానే ఒకే రోజు ఈ ఇద్దరు స్టార్ హీరోల టీజర్లు రిలీజ్ అయితే.. ఆరోజు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం పక్కా. ఏ టీజర్ బాగుంది? ఏది ఎక్కువ వ్యూస్ రాబట్టింది? అనే కంపారీజన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ జవాన్ కంటే సలార్ పైనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి.. సలార్ టీజర్‌దే సోషల్ మీడియాలో అప్పర్ హ్యాండ్ అయ్యేలా ఉంది.