గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో లంక గ్రామాలు
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది.. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 12.5 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 80 వేల 223 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ వద్ద గోదావరి వరద మరింత పెరగనుంది. బ్యారేజీ మొదటి ప్రమాద హెచ్చరికను మించి వరద ప్రవాహం కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవాహిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయ ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!
ఈ రోజు ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. వాతావరణ శాఖ నిన్న మధ్యాహ్నం ఇచ్చిన అప్‌డేటెడ్ ప్రకారం అల్లూరి సీతారామరాజు, తీరప్రాంత పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇదే సమయంలో.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడన వర్షాలు పడతాయని పేర్కొంది.. ఈ సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక, అల్లూరి, ఏలూరు, ఎగువ పశ్చిమ గోదావరి జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది వాతావరణశాఖ. దక్షిణ ఒడిషా-ఉత్తరాంధ్రను అనుకుని స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. నెమ్మదిగా కదులుతూ ఇవాళ రోజంతా భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గాలులు తీవ్రంగా వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది వాతావరణశాఖ.
మోడీకి పదవిలో ఉండే అర్హత లేదు.. అవిశ్వాస తీర్మానానికి ఏపీ ఎంపీలు మద్దతివ్వాలి..
నరేంద్ర మోడీపై బీఆర్ఎస్‌తో సహా అనేక పార్టీ లు అవిశ్వాస తీర్మానం పెట్టాయి.. కానీ, మన ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలు 25 మంది మోడీకి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు అని మండిపడ్డారు శ్రీనివాసరావు.. ఏపీకే మోడీ తీవ్రమైన అన్యాయం చేశారు.. కానీ, అంతా బాగుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడానికి సిగ్గుందా? అంటూ ఫైర్ అయ్యారు.. బీజేపీ బీ టీమ్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు నిర్ధారణ అయ్యిందన్న ఆయన.. టీడీపీ ఎంపీలు మౌనంగా ఉండి దోబూచులాడారని విరుచుకుపడ్డారు.. మణిపూర్ ఘటన చూసైనా మన ఎంపీలు మారలేదంటే వాళ్లకి మనసు ఉందా? అని నిలదీశారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, కేంద్రీయ విద్యాలయం హామీలు అమలు చేయలేదన్నారు. ఇక, గంగవరం పోర్ట్ ను ఏపీ ప్రభుత్వం జాతీయం చేయాలన్న ఆయన.. మోడీకి ప్రధాని పదవిలో ఉండే అర్హత లేదు.. అవిశ్వాస తీర్మానానికి ఏపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఏపీకి న్యాయం చేయాలని ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
వర్షంలో బండి ఆగిందా? ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనాలు బయట కాలు పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారు.. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి..లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.. రోడ్లు నదులుగా మారాయి.. ఎటు చూసిన నీళ్లు కనిపిస్తున్నాయి.. ఎక్కడ ఏది ఉందో తెలియక వాహన దారులు ఇక్కట్లు పడుతున్నారు.. ఇక బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు వాహనాలపై బయటికి అత్యవసర పని మీద వెళ్లిన జనాలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే మార్గమధ్యలో వర్షానికి ఇరుక్కుపోయిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు కీలక సమాచారం ఇచ్చారు.. హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.. ఎక్కడ బండి ఆగిన వెంటనే ఈ 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు..
హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలమయమైంది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో భారీ వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైనికాధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ను ఉపయోగించడం కష్టం కావడంతో ప్రభుత్వం సైన్యంతో చర్చలు జరుపుతోంది. కాగా, మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు. సైన్యం అనుమతించిన వెంటనే హెలికాప్టర్ ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మోరంచపల్లి గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.
నెహ్రూ మొదలు మోడీ వరకు అవిశ్వాస తీర్మానాలు ఇవే..
భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా విశ్వాస, అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వారే. ఒక్క చౌదరి చరణ్‌సింగ్‌కు మాత్రమే మినహాయింపు. 1962 చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వంపై ఆచార కృపలానీ 1963లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తొలి తీర్మానం వీగిపోయింది. కాకపోతే నాలుగు రోజులపాటు 21 గంటలు చర్చ జరిగింది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మూడుసార్లు, ఆపై ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. పీవీ నరసింహారావు సైతం మూడుసార్లు ఈ గండం గట్టెక్కారు. మొరార్జీ దేశాయ్, రాజీవ్‌గాంధీ, వీపీసింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవగౌడ, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ. ఇలా నెహ్రూతో మొదలుకొని మోడీ వరకు 27సార్లు అవిశ్వాస తీర్మానాల రుచి చూశారు. రెండుసార్లు మాత్రమే నో కాన్ఫినెడ్స్ మోషన్స్‌కు కేంద్ర ప్రభుత్వాలు పడిపోయాయి. 1979లో మొరార్జీ దేశాయ్.. 1999లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాలు కుప్పకూలాయి. వీటిల్లో వాజపేయి ప్రభుత్వమైతే ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. తీర్మానాల విషయంలో రెండు కీలక అంశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టేది అవిశ్వాస తీర్మానమైతే.. అధికారపార్టీయే సభా విశ్వాసం కోరుతూ పెట్టే తీర్మానం రెండోది. తీర్మానం ఏదైనా.. లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరగడం ఖాయం. సభలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీల సంఖ్యాబలం ఆధారంగా టైమ్ కేటాయిస్తారు సభాపతి. ఆ టైమ్‌లోనే ఆ పార్టీ నుంచి ఎంత మంది మాట్లాడతారో ఫిక్స్ చేసుకోవాలి.
జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఉత్కంఠ..
జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASIతో సర్వే చేయించాలన్న వారణిసి జిల్లా కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చిన స్టే ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం ఈ అంశంపై విచారణ జరుపుతామని తెలిపింది హైకోర్టు. శివాలయాన్ని ధ్వంసం చేసి… జ్ఞానవాపి మసీదును నిర్మించారన్నది హిందువుల వాదన. దీంతో ఈ విషయంపై సర్వే నిర్వహించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను వారణిసి జిల్లా కోర్ట్ ఆదేశించింది. అయితే దీనిని అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది అంజుమన్ ఇంతెజామియా మసీదు. దీంతో మసీదులో సర్వే ఎలా జరుగుతుందనే వివరాలను తెలుసుకోడానికి వారణాసి నుంచి ASI అధికారిని పిలిపించింది కోర్టు. సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని, నిర్మాణానికి ఎలాంటి నష్టం ఉండబోదని ASI అధికారి తెలిపారు. సర్వే కేవలం 5 శాతం మాత్రమే జరిగిందని, జూలై 31 నాటికి పూర్తవుతుందని వివరించారు. అయితే, శాస్త్రీయ సర్వే వల్ల మసీదు దెబ్బతింటుందని వాదించింది మసీదు కమిటీ. వారణాసి కోర్టు జూలై 21న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. మరోవైపు… మసీదుకు ఎటువంటి నష్టం జరగదని వాదించారు హిందువుల తరఫు న్యాయవాది. తవ్వకాలు జరపబోమని సొలిసిటర్ జనరల్ సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ASI సర్వేపై స్టే విధించింది. ఇవాళ విచారణ కొనసాగిస్తామని తెలిపింది. దీంతో ఇవాళ అలహాబాద్ హైకోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
పార్లమెంట్ ఆవరణలో ఎంపీపై కాకి దాడి.. బీజీపీ-ఆప్ మధ్య ట్వీట్ వార్..
పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న రాఘవ్ చద్దాను తలపై పొడిచింది ఓ కాకి. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది BJP. దీనికి అబద్దం ఆడితే కాకి పోడుస్తుందనే హిందీ సామెత – జూట్ బోలే కవ్వా కాటేను క్యాప్షన్‌గా పెట్టింది. మణిపూర్ అల్లర్లపై ఇటీవల పార్లమెంట్‌పై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. రాజ్యసభలో రాఘవ్ చద్దా సహా ఆమ్ ఆద్మీ నేతలు రచ్చ చేశారు. సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్న ఆప్ నేత సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలని అధికారపక్షం కోరింది. అయితే, తమ పార్టీ నేతపై సస్పెన్షన్ విషయంలో ఓటింగ్‌కు పట్టుబట్టారు రాఘవ్ చద్దా. అయితే, అతని వినతిని చైర్మన్ ధన్‌ఖడ్ తోసిపుచ్చారు. రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసిందంటూ BJP ట్వీట్ చేసింది. సభలో అబద్దం చెప్పడం వల్లే ఇలా జరిగిందన్నది కమలనాథులు సెటైర్లు పేల్చారు. అనుకోని సంఘటనను అవకాశంగా మలుచుకొని.. అబద్ధాడితే ఇలాగే కాకి కరుస్తుందంటూ ట్వీట్స్ చేశారు. కాకి దాడిపై BJP సెటైర్‌కు రాఘవ్ చద్దా గట్టిగానే కౌంటరిచ్చారు. రామచంద్ర కహే గయే సియా సే ఐసా కలియుగ్ ఆయేగా, హన్స్ చుగేగా దానా దుంకా… కవ్వా మోతీ కాయేగా అంటూ పోస్టు చేశారు. అంటే, హంస గింజలను, కాకి ముత్యాలను తినే రోజు కలియుగంలో వస్తుందని సీతకు రాముడు చెప్పాడు అంటూ తనను ముత్యంతో పోల్చుకున్నాడు చద్దా. మొత్తానికి BJP ట్వీట్‌కు గట్టిగానే కౌంటరిచ్చారు చద్దా. ఇంతకీ పార్లమెంట్ ఆవరణలోకి కాకి ఎలా వచ్చిందో.. ఎంపీనే ఎందుకు టార్గెట్ చేసిందో గానీ, ఇలా బీజేపీ, ఆప్ మధ్య మాటలయుద్ధానికి మాత్రం అవకాశం ఇచ్చింది.
జవాన్ ప్రాణాలు కోసం.. నాగ్‌పూర్ నుంచి గుండె.. పూణెలో ఆపరేషన్
కేవలం 31 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ ఓ మహిళ దేశాన్ని కాపాడుతున్న జవాన్ ప్రాణాలు నిలబెట్టింది. నాగ్‌పూర్‌లో మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన తర్వాత, ఆమె గుండెను భారత వైమానిక దళ సైనికుడికి అమర్చారు. ఈ ఆపరేషన్ పూణేలో జరిగింది, ఇక్కడ పోలీసుల సహాయంతో రెండు నగరాల్లో గ్రీన్ కారిడార్‌లను సిద్ధం చేశారు. ఈ డ్యూటీ కోసం వైమానిక దళ విమానాన్ని మోహరించారు. మహిళ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సహా మొత్తం నలుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. మహిళ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె గుండెతో పాటు కాలేయం, రెండు కిడ్నీలు కూడా మరో ముగ్గురికి అమర్చారు. నాగ్‌పూర్‌లో నివసిస్తున్న 31 ఏళ్ల శుభాంగి గన్యార్పవార్ జూలై 20న అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భర్త, కూతురితో కలిసి ఉంటున్న శుభాంగికి తీవ్ర తలనొప్పి రావడంతో అకస్మాత్తుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత అతడికి బ్రెయిన్ డెడ్‌గా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. శుభాంగి భర్త, సోదరుడు ఆమె శరీర భాగాలను దానం చేసేందుకు అంగీకరించారు. దీని తర్వాత, జూలై 26న పూణేలో ప్రాణాలతో పోరాడుతున్న వైమానిక దళానికి చెందిన వ్యక్తికి శుభాంగి గుండెను అమర్చాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా నాగ్‌పూర్‌లో, ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసుల సహకారంతో పూణేలో గ్రీన్ కారిడార్‌ను సిద్ధం చేశారు.
నిందితుల్ని పట్టించిన బీర్ బాటిల్ మూత.. కథలో మరో షాకింగ్ ట్విస్ట్
ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సీసీటీవీ కెమెరాల్లోనూ వారి కదలికలు కనిపించలేదు. దీంతో.. నిందితుల్ని ఎలా పసిగట్టాలన్నది పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. అప్పుడే వారికి బీర్ సీసా మూత ఒకటి దొరికింది. అదే ఈ కేసులో ప్రధాన ఆధారంగా అవతరించింది. దాని కోణంలో అధికారులు విచారణ చేపట్టగా.. చివరికి నిందితులు దొరికిపోయారు. అసలేం జరిగిందంటే.. జులై 16వ తేదీన బెంగళూరులోని మిలీనియం బార్ వద్ద మిథున్‌రాజ్, ముత్తురాజ్ అనే స్నేహితులు ఒక ఆటోలో కూర్చున్నారు. ఆటోలో పాటలు పెట్టుకొని, సరదాగా మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అప్పుడు నలుగురు వ్యక్తులు సడెన్‌గా ఆ ఇద్దరి వద్దకు వచ్చి, బీర్ బాటిళ్లతో వారిపై దాడి చేశారు. అనంతరం ఆ నిందితులు తమ బైక్‌ల్లో అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుల్ని స్థానికులు గమనించి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. మొదట్లో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరికి సీసీటీవీ కెమెరాలు పరిశీలించినా.. అందులో నిందితుల కదిలికలు లేవు. దీంతో మళ్లీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు.. అక్కడ ఒక బీర్ బాటిల్ మూత దొరికింది. దానిపై బ్యాచ్ నంబర్ ఉండటంతో.. దాని ఆధారంగా బార్ ఆచూకీ కనుగొన్నారు. ఆ బార్ వద్దకు వెళ్లి చూడగా, అక్కడ సీసీటీవీ కెమెరాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా.. నిందితులు బీర్లు కొనుగోలు చేసి, బైక్‌లో వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.
వర్షాకాలంలో ఉదయాన్నే ఈ టీ తాగండి.. ఎటువంటి రోగాలు దరిచేరవు..
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ లో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆలాగే అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.అదే విధంగా డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే అల్లం టీని ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అల్లం టీ ఎక్కువగా తాగితే గుండెల్లో మంట,విరేచనాలు, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అల్లం టీలో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి.
బికినీ అందాలతో రెచ్చగొడుతున్న జాను బ్యూటీ..
గౌరీ జీ కిషన్ ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. గౌరీ జి కిషన్..చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్ హిట్ ఫిల్మ్ `96` చిత్రం లో ఆమె టీనేజ్ అమ్మాయిలా కనిపించి ఎంతగానో మెప్పించింది.. ఈ ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన సంగతి తెలిసిందే. తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది.ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్ కాంబినేషన్ లో జానూ పేరు తో రీమేక్ కూడా చేశారు. 96 మూవీ దర్శకుడే ఈ సినిమాను రూపొందించారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. జానూ సినిమా లో నూ టీనేజ్ అమ్మాయి గా గౌరీ నే నటించింది. ఆ తరువాత గౌరీ జి కిషన్ తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన `మాస్టర్` మూవీ లో నటించింది. అలాగే మరో స్టార్ హీరో ధనుష్‌తో `కర్ణన్`సినిమాలో కూడా నటించింది. తెలుగు లో ‘శ్రీదేవి శోభన్ బాబు` చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈసినిమా యావరేజ్‌గా నిలిచింది.. ప్రస్తుతం ఈ భామకి తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు దీనితో మలయాళం, తమిళ్ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.సోషల్ మీడియాలో కూడా ఈ భామకి మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు…ప్రస్తుతం మాల్డీవుల్లో బాగా ఎంజాయ్ చేస్తుంది గౌరీ కిషన్. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంతగానో రిలాక్స్ అవుతుంది.దీనికి తోడు ఈ భామ బికినీలో అందాల విందు చేసి అందరికి షాక్ ఇచ్చింది .గౌరీ జి కిషన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన హాట్ ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది.. ఇందులో ఆమె బికినీలో కనిపించి రెచ్చగొట్టింది.వెకేషన్ లో భాగం గా గౌరి ఇలా హాట్ ట్రీట్ ఇచ్చింది.అయితే ఈ భామ బికినీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.