వనమా పై అనర్హత వేటు.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు..
తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చారు. వనమా విజయంపై జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు. జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. వనమా వెంకటేశ్వరరావు 1989లో తొలిసారి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4,120 ఓట్ల తేడాతో గెలుపొందారు. జలగం వెంకటరావు ఆంధ్ర ప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. ఆయన సోదరుడు జలగం ప్రసాదరావు కూడా మాజీ మంత్రి. వెంకటరావు 2004లో తొలిసారిగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీ(బీఆర్)ఆర్‌ఎస్ తరపున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) తరఫున ఖమ్మం (ఉమ్మడి) నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే.
వైసీపీకి బిగ్ షాక్..! జగనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్..?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తప్పదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే కాగా.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఈ పంచాయితీ.. పార్టీ అధిష్టానం, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరకు కూడా వెళ్లింది.. పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నవారు.. ఇంకా ఎన్ని సీట్లు గెలిపించాలి అనేదిపై ఫోకస్ పెట్టాలి.. కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలపై పట్టుపట్టుకూడదు.. మీ కుమారుడి సీటు వ్యవహారం నేను చూసుకోనా? అంటూ తనను కలిసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తో సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ బహిరంగంగా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అధిష్టానం బుజ్జగించినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలోనే ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారని.. జనసేనలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది.. మొత్తంగా.. వైసీపీకి పిల్లి బోస్ గుడ్‌బై చెబుతారనే చర్చ జోరుగా సాగుతోంది.. ఇదే సమయంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట బోస్.. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌ను సైతం ఖాళీ చేసే ప్రయత్నాల్లో పిల్లి బోస్ ఉన్నారని తెలుస్తోంది.. కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్‌కు జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని.. ఆయనకు జనసేన టికెట్ ఖరారు చేశారనే వార్త కూడా హల్‌చల్ చేస్తోంది.. తాను పట్టుపడుతోన్న రామచంద్రాపురం నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారట పిల్లి సూర్య ప్రకాష్.. ఈ మేరకు జనసేనలోకి వెళ్ళేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారని ప్రచారం సాగుతోంది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రాపురం నియోజకవర్గం టికెట్ వచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో.. వైసీపీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోగా.. పిల్లి సుభాష్, ఆయన కుమారుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అధికారిక ప్రకటన ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాదీలకు అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు.. నిన్న సాయంత్రం కురిసిన వర్షాలకు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు..హఠాత్తుగా దంచి కొట్టిన వానతో భాగ్యనగరం చివురుటాకులా వణికిపోయింది. ఓవైపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా.. నగరం నలుమూలలా రెండు గంటలపాటు కుంభవృష్టి కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. భాగ్యనగర వీధులు మహాసంద్రాన్ని తలపించాయి.. నగరంలోని రోడ్లు అన్ని జలమయం అయ్యాయి.. భారీ వర్షంతో హైదరాబాద్ యాకత్‌పురాలో ఓ పాతభవనం కూలిపోయింది. లంగర్‌హౌజ్‌లో పిడుగుపాటుతో 400 ఏళ్ల కుతుబ్‌షాహీ మసీద్‌కు చెందిన ఓ గోపురం కూలిపోగా.. మిగతా ప్రాంతంలో పగుళ్లు వచ్చాయి. నాంపల్లి యుసుఫిన్ దర్గాలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. అత్తాపూర్‌లో పిడుగుపాటుతో ఓ వ్యక్తి అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక.. మూసీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.. రెండు గంటలు కురిసిన వర్షాలకు ప్రాంతమంతా సముద్రంగా మారాయి.. ఇప్పటికి వర్షం తగ్గలేదు పడుతూనే ఉంది..మరో మూడు రోజులు కురవనున్న భారీ వర్షాలకు జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు..
ఏపీకి తెలంగాణ లేఖ.. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..
ఎగువ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. దీంతో, వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి.. ఇక, గోదావరి నదిలో వరద పోటెత్తుతోంది.. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. మళ్లీ వరద ఉధృతి తగ్గడంలో ఉపసంహరించుకున్నారు.. మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది తెలంగాణ.. పోలవరం ప్రాజెక్టులోని గేట్లన్నీ తెరిచే ఉంచి… వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(PPA)ని తెలంగాణ కోరింది. ఈమేరకు తెలంగాణ ENC మురళీధర్.. PPAకు లేఖ రాశారు. 2022 జులైలో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల.. భద్రాచలం ముంపునకు గురైందనే విషయాన్ని తన లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేదాకా.. వాటర్ ఇయర్‌లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని లేఖలో కోరారు. కాగా, గత ఏడాది గోదావరి ఎప్పుడూ లేనంత స్థాయిలో ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగడం.. దీంతో, ముంపు మండలాలు, చివరకు భద్రాచలం కూడా ముంపునకు గురైన విషయం విదితమే.
సీఎం జగన్‌కు హరిరామజోగయ్య మరో లేఖ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. టీటీడీ చైర్మన్ రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపు కులస్తుల అవసరం మీకు ఉన్నదని రుజువు చేసుకోవాలన్న కాపుల పట్ల సానుభూతి ఉన్నా.. టీటీడీ చైర్మన్ బలిజకి ఇవ్వాలని కాపు కులస్తుల తరఫున కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు 22 శాతం జనాభా ఉన్నారని గుర్తుచేశారు. ఇక, ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కాపులను వాడుకోవడం తప్ప కాపులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా ఏ రెడ్డి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయలేదు.. చివరకు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం అవకాశం ఉండి కూడా కాపులకు రిజర్వేషన్ కల్పించలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.
జగనన్న ముద్దు.. రక్షణ నిధి వద్దు.. కరపత్రాల కలకలం..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.. ఎమ్మెల్యే రక్షణ నిధి మాకొద్దు అంటూ వెలిసిన కరపత్రాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.. అయితే, తిరువూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వర్గ విభేదాలు నడుస్తున్నాయి.. గడప గడపకు ముగింపు సభలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే రక్షణ నిధి అంటూ కొందరు నేతలు పొగడ్త వర్షం కురిపించారు.. ఎమ్మెల్యే రక్షణ నిధిపై కొందరికి అభిప్రాయా బేధాలు ఉంటే మనసులో పెట్టుకోకుండా మంచి మెజారిటీతో 2024లో జరిగే ఎన్నికల్లో గెలిపించాలి అని కూడా నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.. అయితే, నేతల ప్రసంగం, ఎమ్మెల్యే పై గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యక్తులు కరపత్రం ముద్రించి పంచారు.. తిరువూరు నగర పంచాయతీ పాలకవర్గం, చైర్మన్ నీ మార్పు విషయంలో వైసీపీ పాలకవర్గం సభ్యులు రెండుగా చీలిన విషయం విదితమే కాగా.. చైర్మన్ మార్పు విషయంలో పార్టీలో అంతర్గత వర్గవిబేధాలు బయటపడిన విషయం విదితమే కాగా.. మరోసారి ఇప్పుడు తిరువూరు వైసీపీలో వర్గ విబేధాలు కరపత్రాల రూపంలో బయటపడ్డాయి.. ఎమ్మెల్యే రక్షణ నిధి మాకొద్దు అంటూ కరపత్రాలు ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి.. తిరువూరు పట్టణంలో జగనన్న ముద్దు.. రక్షణ నిధి వద్దంటూ కరపత్రాలు వెలుగు చూడటంతో ఒకేసారిగా అవాక్కు అవుతున్నాయి వైసీపీ శ్రేణులు. వైసీపీ ఆఫీసు ముందు, షాపుల ముందు కరపత్రాలు కనబడటంతో ఒకేసారి అవాక్కయి ఇది ఎవరు చేశారనే ఆరా తీసే పనిలో పడిపోయారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. అయితే, ఇది వైసీపీలోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పనా? ప్రతిపక్షాల పనా? అనేది కూడా తేలాల్సి ఉంది.
సర్జరీ ఫెయిల్.. గుర్తుపట్టలేనంతగా మారిన బోల్డ్ బ్యూటీ..
తాజాగా బాలివుడ్ బోల్డ్ బ్యూటీఉర్ఫి జావెద్ కూడా సర్జరీ చేయించుకుంది.. అది ఫెయిల్ అయిందని తన అనుభవాలను తెలుపుతూ పోస్ట్ చేసింది.. పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు ఇప్పుడు సర్జరీ చేయించుకొని ఉన్న అందాన్ని పోగొట్టుకుంది. ఉర్ఫీ జాదవ్ తన పెదవులకు సర్జరీ చేయించుకున్నా అని దాంతో తన అందం పోయిందని తెలిపింది. తన 18 సంవత్సరాల వయస్సు నుంచి లిప్ ఫిల్లర్‌లను ఆశ్రయిస్తున్నా అని తెలిపింది. నా పెదవులు చాలా చిన్నగా ఉంటాయి. కానీ నాకు పెదవులు పెద్దగా.. నిండుగా ఉండాలని కోరిక. కానీ సర్జరీ చేయించుకోవడంతో నా అందమంతా పోయింది అని తెలిపింది.. అంతేకాదు ఇలా కావాలని సర్జరీ చేయించుకొనేవారికి జాగ్రత్తలను కూడా తెలిపింది.. ఇక తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి తో గొడవ పెట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
అది కుదరని పని..! 2 వేల నోటుపై కీలక ప్రకటన
2000 రూపాయల నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెలలో ప్రకటించింది. దీంతో పాటు వాటిని మార్చుకునేందుకు లేదా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కూడా సమయం ఇచ్చింది.. ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మరియు మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. అయితే, ఆ తర్వాత ఆ నోట్లు చలమణిలో ఉండకూడదని గానీ, అవి చెట్లుబాటు కావు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో, 2 వేల నోటు మార్చుకోవడానికి మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.. అయితే, ఇప్పుడు కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది.. సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ గడువును సెప్టెంబర్ 30, 2023 తర్వాత పొడిగించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల మార్పిడి గడువును సెప్టెంబర్ 30 తర్వాత పొడిగించే ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తెలిపారు. కాగా, నల్లధనం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేయాలని యోచిస్తోందా? అని సభలో మరో ప్రశ్న తలెత్తింది. దీనిపై కూడా మంత్రి ధీటుగా సమాధానమిచ్చారు. మే 19న రిజర్వ్ బ్యాంక్ అకస్మాత్తుగా రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు. మరోవైపు.. ఆర్బీఐ ప్రకారం, చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడ్డాయి లేదా మార్పిడి చేయబడ్డాయి. చలామణిలో ఉన్న రూ.2000 నోట్లు మే 19న ప్రకటించిన రోజున రూ.3.56 లక్షల కోట్లు ఉండగా జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి. తిరిగి వచ్చిన నోట్లలో 87 శాతం ప్రజల తరపున బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఆర్బీఐ తెలిపింది. మిగిలిన 13 శాతం మార్చారు. కాగా, నరేంద్ర మోడీ సర్కార్.. 2000 రూపాయల నోటును నవంబర్ 10, 2016న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత అప్పట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను బ్యాన్ చేసింది.. ఆ తర్వాత కొత్త 500 నోటును కూడా తీసుకొచ్చిన విషయం విదితమే.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న ‘ఇండియా’
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి సిద్ధమైంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే మణిపూర్‌తో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీల కొత్త కూటమి ముట్టడిస్తోంది. ఉభయ సభలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్‌పై ఒక ప్రకటన విడుదల చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించాలని డిమాండ్ ఉంది. వర్షాకాల సమావేశాల మొదటి రోజునే మణిపూర్ వీడియో కేసులో దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, ప్రతిపక్షాలపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇలాంటి దిక్కులేని వ్యతిరేకత కనిపించలేదన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు చర్చలో పాల్గొనాల్సిందిగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు చెల్లాచెదురుగా, నిరాశలో ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎక్కువ కాలం అధికారంలో ఉండాలనే కోరిక ప్రతిపక్షాలకు లేనట్లు కనిపిస్తోందన్నారు. ప్రధాని మోడీ మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అతను ప్రతిపక్ష పార్టీల కూటమి పేరును ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చాడు.
చైనాపై నమ్మకం పోయింది: అజిత్ ధోవల్
రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. అలా కొనసాగినప్పుడు రెండు దేశాల మధ్య ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే భారత చైనాతోనూ, పాకిస్థాన్‌తోనూ ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి యుద్ధానికి సైతం దారితీస్తాయి. ఇప్పటి వరకు గతంలో చైనాతో.. పాకిస్థాన్‌తో యుద్ధాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనాపై తమకు నమ్మకం సన్నగిల్లుతోందని భారత జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ సంచనల వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ముందుగా జోహన్సెస్‌బర్గ్ లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)ల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమయ్యింది
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్న రవితేజ… ఈసారి బౌండరీలు దాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియాకి గురి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వర రావు సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు రివీల్ చేయడమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ కు వాయిస్ కూడా అందించి, ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చారు. టైటిల్ రివీల్ గ్లిమ్ప్స్ రవితేజ మాములుగా లేడు. “జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..? ” అని రవితేజ పవర్ ఫుల్ వాయిస్ తో చెప్పే డైలాగ్ గ్లిమ్ప్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్ళింది. గ్లిమ్ప్స్ కే ఇలా ఉంటే మనం పెంచిన పులి ఇప్పుడు వేటాడడానికి సిద్ధమయ్యింది, కాస్త ఓపిక పట్టండి టీజర్ బయటకి వచ్చేస్తుంది అంటూ డైరెక్టర్ వంశీ సూపర్బ్ న్యూస్ చెప్పాడు. రవితేజ ఫాన్స్ టైగర్ నాగేశ్వర రావు టీజర్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉండడంతో డైరెక్టర్ వంశీ రెస్పాండ్ అవుతూ త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేస్తాం అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సమాధానంతో రవితేజ ఫాన్స్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఆ మచ్ అవైటెడ్ టీజర్ టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఎలాంటి హైప్ పెంచడానికి కారణం అవుతుందో చూడాలి.
జులై 28 ధనుష్ సోషల్ మీడియాని కబ్జా చేయనున్నాడు…
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న వారిలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఎవరు అనే లిస్టు తీస్తే అందులో తప్పకుండా వినిపించే టాప్ టెన్ పేర్లలో ధనుష్ పేరు తప్పకుండా ఉంటుంది. వీడు హీరో ఏంట్రా అనే దగ్గర నుంచి హీరో అంటే వీడేరా అని ప్రతి ఒక్కరితో అనిపించుకునే వరకు వచ్చిన ధనుష్, పాన్ ఇండియా రేంజ్ సినిమాలని అన్ని భాషల్లో చేస్తున్నాడు. హిందీలో, తెలుగులో స్ట్రెయిట్ సినిమాలని చేస్తూ హిట్స్ కొడుతున్న ధనుష్ జులై 28న సోషల్ మీడియాని కబ్జా చేయబోతున్నాడు. రీసెంట్ గా సార్ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హిట్ కొట్టిన ధనుష్ నుంచి జులై 28న ఎలాంటి అప్డేట్స్ వస్తాయని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జులై 28న ధనుష్ బర్త్ డే కాబట్టి ఆ రోజు తప్పకుండా సర్ప్రైజ్ న్యూస్ లు బయటకి వస్తాయి. ధనుష్ పుట్టిన రోజున బయటకి రానున్న వార్తల్లో మొదటిది ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా టీజర్. పాన్ ఇండియా రేంజులో భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ మేకింగ్ వీడియో, ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక టీజర్ కూడా బయటకి వస్తే కెప్టెన్ మిల్లర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకడం గ్యారెంటీ. ధనుష్ 50గా సెట్స్ పైకి వెళ్లిన లేటెస్ట్ మూవీని ధనుష్ స్వయంగా డైరెక్ట్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా జులై 28నే బయటకి రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు ధనుష్ నటిస్తున్న హిందీ సినిమా అప్డేట్ కూడా అనౌన్స్ అవ్వనుంది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ధనుష్ ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు. లేటెస్ట్ గా హ్యాట్రిక్ కోసం మళ్లీ కోలాబ్ అయిన ఈ హీరో-డైరెక్టర్ ‘తేరే ఇష్క్ మెయిన్’ అనే సినిమా చేస్తున్నారు. జులై 27 రాత్రే ఈ మూవీ నుంచి అప్డేట్ బయటకి వస్తుందని సమాచారం. మూడు సినిమాల అప్డేట్ ఒకే రోజున బయటకి వస్తే ధనుష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ హంగామా చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
రాజమౌళి కాదు… RRR 2 డైరెక్టర్ అతనే?
దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని… చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఇండియన్ టాప్ 5 లిస్ట్‌లో ట్రిపుల్ ఆర్ నిలిచింది. అందుకే ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌లోనే సీక్వెల్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేశాడు. రీసెంట్‌గా విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ స్టోరీ రెడీ అయింది, కాకపోతే రాజమౌళి డైరెక్షన్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ప్రాజెక్ట్ అయిపోగానే… జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం స్టార్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో… ట్రిపుల్ ఆర్ 2ని డైరెక్ట్ చేసేది ఎవరు? రామ్ చరణ్ ఎన్టీఆర్ లని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ముందుకి నడిపించేది ఎవరు? అసలు జక్కన్న చరిష్మాని మేనేజ్ చేసేది ఎవరు అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ 2ని తెరకెక్కించడానికి ఒక పేరు చాలా బలంగా వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజులో రూపొందనున్న ఈ సీక్వెల్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, సాహసం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్ యేలేటి… చివరగా నితిన్‌తో ‘చెక్’ అనే సినిమా చేశాడు. ఈయన రాజమౌళికి దగ్గరి బంధువు. కమర్షియల్ ట్రాక్ రికార్డ్‌ను పక్కకు పెడితే… డైరెక్టర్‌గా చంద్రశేఖర్ యేలేటికి మంచి పేరుంది. అందుకే.. ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌కు యేలేటి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈయన డైరెక్షన్ చేసినా కూడా రాజమౌళి పర్యవేక్షణలోనే ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుందని అంటున్నారు. మరి ఈ రూమర్స్‌లో ఎంతవరకు నిజముందో చూడాలి.