ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్:
ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు. జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే బాబు-పవన్ ఓ అవగాహనకు వచ్చారట. జనసేనకు 25 స్థానాలు ఇస్తామని చంద్రబాబు అంటుండగా.. ఎక్కువ స్థానాలు కావాలని పవన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లను జనసేనాని ఆశిస్తున్నారట. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పవన్ పట్టుబడుతున్నారని తెలుస్తోంది.
మూడు రాజ్యసభ స్థానాలు మాకే:
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తనకు వ్యూహం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు అన్నారు. తమకు మెజారిటీ ఉందని, మూడు రాజ్యసభ స్థానాలు తమకే వస్తాయని ప్రసాద్ రాజు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అడ్డదారులు తొక్కాలని, ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షం అడిగే ఏ అంశంపై అయినా చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు చెప్పారు. ఆదివారం ‘ఎన్టీవీ’తో చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడారు.
వేమిరెడ్డి అసంతృప్తిపై పెద్దిరెడ్డి:
నెల్లూరుకు చెందిన వైసీపీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అసంతృప్తిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందన్నారు. వారు అసంతృప్తితో ఉండటం సాధారణమే అని, పార్టీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటుందని పెద్దిరెడ్డి చెప్పారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. తన పరిధిలో వచ్చే మూడు శాసనసభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థులను మార్చాలని ఆయన ముందునుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్ఠానం స్పందించకపోవడంతో.. కొన్ని రోజుల నుంచి వేమిరెడ్డి అసంతృప్తితో ఉంటున్నారు. తనకు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే కానీ.. ఆ గౌరవం దక్కడం లేదని వేమిరెడ్డి తన అనుచరుల ఎదుట వాపోయినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం ఉన్నపళాన నెల్లూరు నుంచి ఆయన పయనమయ్యారు. కొద్దిరోజుల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులకు, సిబ్బందికి సూచనలిచ్చారని తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థిగా పోటీలో కోమటిరెడ్డి కూతురు?:
నల్గొండ ఎంపీ సీటుపై కాంగ్రెస్ నాయకులు కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఊపు కనిపిస్తోంది. మరికొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్గొండ ఎంపీ సీటుకు ఇప్పటికే జానారెడ్డి కుమారుడు రఘు వీర్ దరఖాస్తు చేసుకోగా.. తాజాగా భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి పవన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈరోజు నల్గొండ ఎంపీ సీటు నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి బరిలో ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతల చూపు నల్గొండ ఎంపీ సీటుపై పడింది.
హెచ్‌జీఎల్ ఎండీగా ఐఏఎస్ అమ్రపాలి:
ఐఏఎస్ ఆమ్రపాలికి రేవంత్ సర్కార్ మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఆమ్రపాలి ప్రస్తుతం HMDA- IT – ఎస్టేట్ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ MD గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆమెకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ డా.ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేంద్రంలో పనిచేసిన యువ ఐఏఎస్ లు ఎన్నికల అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చేశారు. అనంతరం హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా రేవంత్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లలో అమ్రపాలి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మందు కొట్టి మత్తులోకి జారుకున్న టీచర్:
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ టీచర్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు చేరుకున్నాడు. అతని శరీరాన్ని కూడా నియంత్రించలేకపోయాడు. అతి కష్టం మీద స్కూల్ మెట్ల దగ్గరకు చేరుకుని కూర్చుండిపోయాడు. అది చూసిన విద్యార్థులు టీచర్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. జబల్‌పూర్ జిల్లా బాఘ్‌రాజీ క్లస్టర్‌లోని జమునియా స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఉపాధ్యాయుడు మద్యం మత్తులో అక్కడక్కడ తిరుగుతూ కనిపించాడు.
నాలుగు డిమాండ్లతో లడఖ్ రోడ్లపైకి వచ్చిన వేలాదిమంది జనాలు:
రక్తం గడ్డకట్టే చలి మధ్య లడఖ్‌లో భారీ ప్రదర్శన జరిగింది. వేలాదిమంది జనాలు వీధుల్లోకి వచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాష్ట్ర హోదా, రాజ్యాంగ రక్షణ డిమాండ్ కోసం ఈ ప్రదర్శన జరిగింది. లడఖ్ శనివారం మూసివేయబడింది. కార్గిల్, లేహ్ వీధుల్లో ప్రజలు గుమిగూడారు. ఈ ప్రదర్శన ఈ వారం ప్రారంభంలో ప్రకటించబడింది. ఈ ప్రాంత ప్రజల డిమాండ్లపై హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ రెండో రౌండ్ సమావేశాన్ని శుక్రవారం కేంద్రం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగించబడిన తరువాత, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబడింది. అది జమ్మూ, కాశ్మీర్ నుండి వేరు చేయబడింది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం:
మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. గుంటూరు కారం ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
టైమ్స్ స్క్వేర్‌పై చిరు సినీ లైఫ్ జర్నీ వీడియో;
వెండితెర రారాజులా.. మెగా మహారాజులా.. ‘స్వయంకృషి’కి చిరునామాలా.. అభిమానుల ‘విజేత’గా.. అన్నార్తులకు అపద్బాంధవుడుగా.. అభిమానులకు అన్నయ్యగా.. అనుభవంలో మాస్టర్‌గా.. హోల్ ఇండస్ట్రీకి మెగాస్టార్‌గా ఎదిగిన నిలువెత్తు సినీ శిఖరం చిరంజీవిని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అత్యున్నత గౌరవం అందుకున్న చిరంజీవికి అదే స్థాయిలో శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ఎన్నారైలు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ అరుదైన సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. మెగా అభిమాని, తెలుగు ఎన్నారై రాజ్ అల్లాడ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైల సంఘాల ప్రతినిధులు పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు అందించారు. తమ అభిమాన హీరో చిరంజీవి భవిష్యత్‌లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకోవాలని ఆకాంక్షించారు.