టీడీపీ అధిష్టానంపై పెరుగుతున్న ఒత్తిడి..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్ది.. నేతల్లో టెన్షన్ పెరుగుతోంది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థులను ఖరారు చేసేపనిలో బిజీగా ఉంది.. ఇప్పటికే ఐదు జాబితాలను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం.. మార్పులు, చేర్పులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోందట.. హైదరాబాద్‌లో నిన్నంతా సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఖరారు పైనే పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు వివిధ నియోజకవర్గాల నేతలు.. ఆశావహుల ప్రయత్నం చేస్తు్న్నారు.. క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ నేతలు. కసరత్తు చివరకు దశకు రావడంతో పార్టీ హైకమాండ్ పై నేతలు ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోంది.. మరోవైపు.. జనసేన పార్టీ ఆశిస్తున్న సీట్లపై పీఠముడి నెలకొంది.. సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు చంద్రబాబు భరోసా ఇచ్చారట.. ఎంపీ స్థానాల విషయంలోనూ టీడీపీ కసరత్తు కొలిక్కివస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేల చేరికలు ఉండడంతో ఆచి తూచి కసరత్తు చేస్తోంది టీడీపీ.. ఇక, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో పాత లీడర్లు.. కేడర్ మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని అధిష్టానం స్పష్టంగా చెబుతోందట. అభ్యర్థుల ఖారారు చేస్తూ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపిస్తోన్న నేపథ్యంలో.. టీడీపీ కూడా సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించింది..
టెన్షన్ పెడుతోన్న పులి.. ఆనవాళ్లు చూసి వణికిపోతున్నారు..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను పెద్దపులి గత కొంతకాలంగా వణికిస్తోంది. కొద్ది రోజులుగా పలు మండలాల్లో పెద్దపులి సంచరిస్తుంది సమీప గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా, నల్లజర్ల మండలం పోతవరంలో కూడా పెద్దపులి సంచరించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పొలంలో పులిపాద ముద్రలతో పాటు, ఫెన్సింగ్ దాటిన సమయంలో తీగలకు చిక్కిన పెద్దపులి జుట్టును గుర్తించారు స్థానిక రైతులు. దీంతో, ఎప్పుడు..? ఎక్కడి నుంచి? ఎలా? ఆ పులి దాడి చేస్తుందోనంటూ భయాందోళనకు గురవుతున్నారు.. ఇక, ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు స్థానికులు. పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గత వారం రోజుల క్రితం బయటికి వచ్చిన పెద్దపులి దెందులూరు వరకు సంచరించింది. ఆ తర్వాత పుల తిరుగు ప్రయాణంలో ఉన్నట్టుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు చోట్ల పశువులపై దాడి చేసి తినేసింది పెద్దపులి. దాని కదలికలను ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. పులి సంచారం తెలుసుకోవడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.. పులికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తమకు వెంటనే చేరవేయాలని.. భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని ధైర్యం చెబుతున్నారు. అయితే, పంట పొలాల్లోకి వెళ్లే రైతులు.. పశువులను, గొర్రెలను పొలానికి తీసుకెళ్లేవారు.. పొలం పనులకు వెళ్లే కూలీలు, స్థానిక గ్రామాల ప్రజలు అంతా పులి భయంతో ఆందోళనకు గురిఅవుతున్నారు.
గుంతలు పూడ్చడం కాదు.. టెండర్లు ఇప్పిస్తా రోడ్డు పూర్తి చేయి..!
ధర్మవరంలో నాలుగు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే సూరి ప్రచార ఆర్భాటం కోసమే హడావుడి చేస్తున్నాడని దుయ్యబట్టారు.. టీడీపీలో టికెట్ కోసం పరిటాల శ్రీరామ్ తో పోటీపడేందుకే సూరి రోడ్ల గుంతల మరమ్మత్తుల కార్యక్రమం జిమ్మిక్కు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిందని తెలుసుకున్న తర్వాతే సూరి గుంతలు పూడ్చే కార్యక్రమంతో నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణకు దమ్ముంటే గుంతలు పూడ్చడం కాదు.. నాలుగు కోట్ల రూపాయల టెండర్లు ఇప్పిస్తాను రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అంటూ సవాల్ చేశారు. ఇక, 4 వేల కోట్ల రూపాయిల అవినీతి అంటున్నాడు.. అందులో 10 శాతం ఇస్తే నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను అని బహిరంగా సవాల్ విసిరారు. మరో రెండు నెలలో ఎన్నికలు వస్తాయనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
ఒంగోలు ఎంపీ స్థానానికి దాదాపు అభ్యర్థి పేరు ఖరారు.. ఆయనే ఫైనల్..!
ఒంగోలు ఎంపీ స్థానానికి దాదాపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరును ఖరారు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఒంగోలు పార్లమెంట్, సంతనూతలపాడు, కందుకూరు, కావలి నియోజకవర్గాల రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.. అయితే, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సిట్టింగ్ సీటును కొనసాగించేందుకు పట్టుబడుతూ వచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. చివరకు అధిష్టానం మొత్తబడకపోవటంతో చేతులెత్తేశారు బాలినేని.. తన పని తాను చూసుకుంటానని తాజాగా వెల్లడించారు. మరోవైపు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో డోర్స్ క్లోజ్ కావటంతో ప్రత్యామ్నాయం వైపు మాగుంట చూస్తున్నారట.. తెలుగుదేశం పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన అనుచరులతో మాగుంట మంతనాలు పూర్తిచేశారట.. ఇక, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈసారి పోటీలో నిలపాలని భావిస్తున్నారట మాగుంట.. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ మార్పుపై మాగుంట త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మొత్తంగా జిల్లాలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ముగిసిన సర్పంచ్ పాలన.. డిజిటల్ కీలు తీసుకోవాలని ఆదేశం..
గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. నిన్నటితో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో పదేళ్ల తర్వాత మళ్లీ గ్రామాల్లో ప్రత్యేక పాలన ప్రారంభం కానుంది. నిన్నటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండడంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించంది. దీంతో రేపు బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు అధికారులు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, డీటీ, ఆర్‌ఐ, ఇంజనీర్లు, ఇతర గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ఉన్నతాధికారులు నియమించారు. ఈరోజు సాయంత్రం సర్పంచ్‌ల వద్ద ఉన్న డిజిటల్ కీలు, చెక్కులు, ఇతర రికార్డులన్నీ సీజ్ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక అధికారి, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. డిజిటల్ కీకి అధీకృత అధికారిగా ప్రత్యేక అధికారి ఉంటారు. డిజిటల్ కీ, చెక్కులు, రికార్డుల్లో ఏదైనా సమస్య తలెత్తితే కార్యదర్శిదే బాధ్యత అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామ పంచాయతీల్లో వచ్చే నిధులన్నింటికీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న 2011 నుంచి 2013 వరకు, 2018లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.
పురుషులకు మాత్రమే.. ఇబ్రహీంపట్నం-ఎల్బీనగర్ రూట్‌లో బస్సు సర్వీసు..!
ఇది నా సీటు అంటూ ధైర్యంగా కూర్చుని ప్రయాణం చేసే రోజులు మగవారికి వచ్చేశాయి. ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వ ‘మహాలక్ష్మి పథకం’లో భాగంగా టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించిన విషయం తెలసిందే. అయితే దీని వల్ల మగవారికి సీట్లు లేకుండా పోయాయి. ఎంత దూరమైన నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాగా..ఇప్పుడు పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘పురుషులు మాత్రమే’ అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. దీంతో మగవాళ్ళు మనకు కూడా స్వాతంత్య్రం వచ్చిందని ఎగిరి గంతేస్తున్నారు. హమ్మయ్య పురుషులకు కూడా సీట్లు దొరికి కూర్చునే రోజులు వచ్చేశాయంటూ.. లేచింది పురుష ప్రపంచం అంటూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈడీ అరెస్టును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఝార్ఖండ్ మాజీ సీఎం!
భూ కుంభకోణం కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ.. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ.. గురువారం హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. అత్యవసర విచారణ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు సోరెన్ విషయాన్ని ప్రస్తావించారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రంలో బంద్ పాటించనున్నట్లు గిరిజన సంస్థలు ప్రకటించాయి. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను ఆయన సమర్పించారు. జార్ఖండ్ తదుపరి సీఎం చంపై సోరెన్ అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆదాయపు పన్ను చెల్లింపులు మరింత ఈజీ.. 7 లక్షల వరకు పన్ను రాయితీ..
వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకటించారు. ఇంతకు ముందు పాత ఆదాయం పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ కింద 50 వేల రూపాయల వరకు మినహాయింపు ఉండేది.. కానీ, దాన్ని 25 వేల రూపాయలకు వరకు పొడిగించింది. అంటే 2.50 లక్షల రూపాయల నుంచి 3.25 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇక కొత్త పన్ను విధానంలో 7 లక్షల రూపాయల ఆదాయం వరకూ పన్ను రాయితీ కల్పించింది. కార్పొరేట్ సంస్థల ఆదాయంలో పన్ను చెల్లింపు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించింది. ఇక, ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుల విధానం యథాతథంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి 23.24 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయితే, ఎగుమతి, దిగుమతి సుంకాల విధానం యధాతథంగా కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొనింది.
కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భారతదేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సిస్టమ్‌ను బిగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దాంతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఆయా కుటుంబాలు పొందే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. వినియోగించుకున్న విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే వేగవంతం చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, మధ్య తరగతి ప్రజల కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇండ్లలో 70 శాతం మహిళల పేరుపైనే ఇస్తున్నామన్నారు. కోవిడ్ కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం అమలు చేశామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
11.1 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్.. సైనిక బలాన్ని పెంచేందుకు రూ.1,11,111 కోట్ల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రికి ఇది ఆరో బడ్జెట్, మోడీ ప్రభుత్వం రెండవ దఫాలో చివరి బడ్జెట్. ఈ బడ్జెట్‌లో భారీ ప్రకటనలు చేశారు. రైతులు, మహిళలు, యువత, పేదలను దృష్టిలో ఉంచుకుని 2024 మధ్యంతర బడ్జెట్‌లో అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. ‘పేదల సంక్షేమం, దేశ సంక్షేమం’ అనే మంత్రంతో పనిచేస్తున్నామని బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
* పేదలు, మహిళలు, యువత, రైతుల పట్ల తమ ప్రభుత్వం అత్యధిక శ్రద్ధ చూపుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. గత 10 సంవత్సరాలలో, ‘సబ్కా సాత్’ లక్ష్యంతో 25 కోట్ల మంది ప్రజలను వివిధ రకాల పేదరికం నుండి బయటికి తీసుకువచ్చాము.
* ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.2.34 లక్షల కోట్లు ఆదా చేసింది. డబ్బు తప్పు ప్రదేశానికి వెళ్లలేదని అర్థం. పీఎం స్వానిధి నుంచి 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించారు. వీరిలో మొత్తం 2.3 లక్షల మంది మూడోసారి రుణాలు పొందారు.
* రైతులు మా ఆహార ప్రదాతలు, 11.8 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం పొందారు. పంటల బీమా పథకం ద్వారా 4 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు.
* ఆర్థిక మంత్రి కొత్త పన్ను లేదా పన్ను శ్లాబ్‌లో మార్పును ప్రకటించలేదు. దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లను కొనసాగించాలని నేను ప్రతిపాదిస్తున్నానని ఆమె చెప్పారు. కొత్త పన్ను విధానం కోసం పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.7 లక్షలకు పెంచింది. ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదు.
* ఇప్పటి వరకు కోటి లక్షల దీదీలను సృష్టించామని నిర్మలా సీతారామన్ అన్నారు. 9 కోట్ల మంది మహిళలు 83 లక్షల సహాయ బృందాలతో అనుబంధం కలిగి ఉన్నారు. లఖపతి దీదీ లక్ష్యాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచారు.
ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’.సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో కెప్టెన్ మిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్‌గా 100 కోట్లకుపైగా గ్రాస్‌ను, 45 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమాపై ఉన్న బజ్ కారణంగా రెండు వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ధనుష్ యాక్టింగ్ బాగున్నా కానీ కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.తమిళంలో వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజవ్వగా…కేవలం కోటి వరకు మాత్రమే వసూళ్లు రాబట్టింది.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా సాగక పోడమే ఈ మూవీ పరాజాయానికి కారణంగా తెలుస్తుంది.. అయితే తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ ఓటీటీ వెర్షన్ మాత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్నట్లు సమాచారం.కెప్టెన్ మిల్లర్ సినిమాలో అగ్నీశ్వర అలియాస్ అగ్నిఅనే పాత్రలో ధనుష్ నటించాడు. ఊరిలో కులవివక్షను భరించలేక బ్రిటీష్ ఆర్మీలో సైనికుడిగా చేరిన అగ్ని అక్కడి నుంచి పారిపోయి ఎందుకు దొంగగా మారాడు. అగ్నిని చంపాలని బ్రిటీష్ సైన్యం ఎందుకు ప్రయత్నించింది..కుల వివక్షతో పాటు తన ఊరిలోని గుడి కోసం అగ్ని ఎలాంటి పోరాటం సాగించాడు అనే కథతో కెప్టెన్ మిల్లర్ సినిమాను డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించారు..కెప్టెన్ మిల్లర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ హీరో సందీప్‌కిషన్ గెస్ట్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌మోహన్ మరియు మాళవికా సతీషన్ హీరోయిన్లుగా నటించారు.
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత.. హీరో ఎవరంటే?
సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.. బిగ్ బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటిని సంపాదించుకున్న సీరియల్ నటుడు హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా చేయబోతుంది.. హీరోగా ఒక కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం బుల్లితెరపై సందడి చేసిన అమర్ దీప్ మొదటిసారి వెండితెరపై హీరోగా సందడి చేయబోతున్నాడు.. ఇండస్ట్రీకి రాక ముందే హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సుప్రీత. తల్లీ కూతురు ఇద్దరుహాట్ హాట్ డ్రస్ లతో,ఇన్ స్టా రీల్స్ స్పెషల్ ఫోటోస్ తో బాగా పాపులర్ అయిపోయారు. ఇక ఈ సినిమాతో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు ప్రొడక్షన్ నం.2 పూజ కార్యక్రమం ఫిబ్రవరి1 న ప్రసాద్ ల్యాబ్ , హైదరాబాద్ లో జరిగింది.. M3 మీడియా బ్యానర్లో,మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాణంలో తెరకెక్కనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు.. ఈ సినిమాలో సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవింద్ర, రూప లక్ష్మీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
ఆయన సినిమాలకి ఆ రేంజ్ రెస్పాన్స్ మాములే సార్…
వెట్రిమారన్… పేరుకే తమిళ దర్శకుడు కానీ పాన్ ఇండియా మొత్తం తెలిసిన వాడు. జక్కన్న తర్వాత ఫ్లాప్ లేని హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తున్న అతి తక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. అందరు దర్శకులు పాన్ ఇండియా సినిమాలు, హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమాల వైపు వెళ్తుంటే… కెరీర్ స్టార్ట్ చేసి దశాబ్దమున్నర అవుతున్నా వెట్రిమారన్ ఇంకా కథాబలం ఉన్న సినిమాలనే స్టార్ హీరోలతో కూడా చేస్తున్నాడు. రూటెడ్ కథలని… రస్టిక్ గా చెప్పడంతో న్యాచురల్ గా నేరేట్ చేయడం వెట్రిమారన్ స్టైల్. అందుకే ఆయన సినిమాలు కామన్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ సీన్స్, బ్లడ్ థంపింగ్ సీక్వెన్స్ లు వెట్రిమారన్ సినిమాలో మనకి రెగ్యులర్ గా కనిపించే విషయాలు. ఓవరాల్ గా నాలుగు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న వెట్రిమారన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ విడుదలై నుంచి పార్ట్ 2 రాబోతుంది. థియేటర్ రిలీజ్ కన్నా ముందు ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్తున్న విడుదలై పార్ట్ 2 సినిమాకి స్టాండింగ్ ఓవియేషన్ దక్కింది. రొట్టెర్ డామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో… విడుదలై పార్ట్ 1&2 సినిమాలు ప్రీమియర్ అవ్వగా… దాదాపు 5 నిమిషాల పాటు ఆడియన్స్ ఆపకుండా చప్పట్లు కొట్టి చిత్ర యూనిట్ ని అభినందించారు. 5 నిమిషాల స్టాండింగ్ ఓవియేషన్… ఇతర సినిమాలకి చాలా పెద్ద విషయం ఏమో కానీ వెట్రిమారన్ సినిమాలకి అది సర్వసాధారణం అనే చెప్పాలి. మరి వెస్టర్న్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్న విడుదలై పార్ట్ 2 థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. తెలుగులో ఈ సినిమాని గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తోంది.