యార్లగడ్డను లైట్ తీసుకున్న వైసీపీ..! నెక్ట్స్ ఏంటి..?
గన్నవరం పాలిటిక్స్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి.. గన్నవరంలో ప్రస్తుత రాజకీయాలపై సజ్జల స్పందిస్తూ.. యార్లగడ్డ వెంకట్రావు ఎటు వెళ్లాలన్నది అతని ఇష్టం.. ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చోట.. మరొకరికి సర్దుబాటు చేస్తాం.. కాదనుకుంటే వారి ఇష్టమన్నారు.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి నిర్ణయాలు వారివే కదా అని చెప్పుకొచ్చారు.. అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారాన్ని వైసీపీ అధిష్టానం లైట్‌గా తీసుకున్నట్టు స్పష్టమైంది.. అంతేకాదు.. ఉంటే పార్టీలో ఉండండి.. లేదా వెళ్లిపొండి అనే సంకేతాలు కూడా ఇచ్చేశారు. దీంతో, తన భవిష్యత్‌పై కసరత్తు ప్రారంభించారు యార్లగడ్డ వెంకట్రావు. ఇప్పటి వరకు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన సంగతి తేల్చాలని అడుగుతానన్న యార్లగడ్డకు.. అలాంటివేవీ ఉండవనే సంకేతాలు ఇచ్చేశారు సజ్జల.. వైసీపీకి దూరం అయ్యేందుకు కొంతకాలంగా యార్లగడ్డ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతూ వచ్చింది.. రెండ్రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని అవేదన కూడా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. పార్టీ వీడటానికే ఆ సమావేశాన్ని యార్లగడ్డ ఏర్పాటు చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.. యార్లగడ్డ వైఖరిని పసిగట్టిన వైసీపీ అధిష్టానం.. మాటల్ లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్.. అన్నట్టుగా.. చర్చించడాలు లేవని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తంగా యార్లగడ్డను వదిలేసిన వైసీపీ.. ద్వారాలను మూసివేసినట్టే అనే చర్చ సాగుతోంది.. పార్టీలో ఉండటం ఉండకపోవడం యార్లగడ్డ ఇష్టం అని తేల్చేయడంతో.. ఇక, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారట యార్లగడ్డ.. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రేపో మాపో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయమనే చర్చ సాగుతోంది.
మళ్లీ విశాఖకు పవన్.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర విశాఖలో కొనసాగుతోంది.. ఇప్పటికే రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. అక్కడ జరుగుతోన్న పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఇక, ఈ రోజు మధ్యాహ్నం విశాఖపట్నానికి చేరుకోనున్నారు పవన్.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయం నుంచి విశాఖ వెళ్లనున్న ఆయన.. 6వ రోజు వారాహి విజయ యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.. జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ఎర్రమట్టి కొండలను పరిశీలించనున్నారు.. ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తోంది జనసేన పార్టీ.. ఓవైపు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చిస్తూనే మరోవైపు వారాహి విజయయాత్రలో అధికార పార్టీపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వస్తున్నారు.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ విమర్శల దండ యాత్ర కొనసాగుతూనే ఉంది.. మొత్తంగా ఈ నెల 19వ తేదీ వరకు పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్ర ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో కొనసాగనుంది.. విశాఖ జిల్లాలోని ప్రజల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పవన్ కల్యాణ్.. కాగా, వారాహి తొలి, మలి విడత యాత్రలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన జనసేనాని.. మూడో విడతకు విశాఖపట్టణాన్ని ఎంచుకున్న విషయం విదితమే.
వంగవీటి ఇంట పెళ్లి భాజాలు.. రాధా పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే..?
వంగవీటి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. దానికి ప్రధాన కారణం వంగవీటి రంగా.. ఇక, ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణ కూడా రాజకీయాల్లో.. తన కమ్యూనిటీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా విజయవాడలో వంగవీటి ఫ్యామిలీకి పెద్ద ఎత్తున అనుచరులున్నారు.. అయితే, వంగవీటి ఫ్యామిలీని అభిమానించేవారికి, వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. ఎందుకంటే.. వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాయి.. మొదట ఈ నెల 19వ తేదీన వంగవీటి రాధా-జక్కం పుష్పవల్లీల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ, పలు కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.. పెళ్లి మాత్రం ముందుగా నిర్ణయించిన మూహూర్తానికి అంటే సెప్టెంబర్ 6న జరిపించనున్నారు.. వంగవీటి ఫ్యామిలీ అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.. ఆ ఫ్యామిలీతో వియ్యం అందుకునేది ఎవరు? అనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది.. అయితే, వంగవీటి రాధాకు కాబోయే భార్య.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన అమ్మాయి. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిర్ణయించారు. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లుగా తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. నరసాపురం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జీల చిన్నకుమార్తె జక్కం పుష్పవల్లీ.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని చెబుతున్నారు.
తిరుమలలో చిరుత దాడులపై టీడీపీ హాట్ కామెంట్లు.. ఇది వైసీపీ ‘పుష్పా’ల వల్లే..!
తిరుమలలో చిన్నారి లక్షితను బలితీసుకున్న చిరుతలు.. ఇప్పటికీ అక్కడక్కడ సంచరిస్తూ కలకలం రేపుతూనే ఉన్నాయి.. తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. అయితే, తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయన్న ఆయన.. వైసీపీలో పుష్పాలు ఎక్కువయ్యారు అంటూ విమర్శించారు. వైసీపీ పుష్పాలు ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా చేస్తున్నారు.. ఎర్ర చందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయన్నారు. చిరుత పులిని తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట అని ఎద్దేవా చేశారు. ఆ రూళ్ల కర్రలతో భక్తులు ప్రభుత్వానికి బడితే పూజ చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక రూళ్ల కర్ర ఇస్తామంటారా..? అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి మాటలు.. తుగ్లక్ చేష్టలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బోండా ఉమ.
గొంతులో ఇరుక్కున్న వేరుశనగ.. రెండేళ్ల చిన్నారి మృతి
చిన్న పిల్లలకు ఏది దొరికితే అది నోట్లు పెట్టుకుంటారు.. పళ్లు రాకున్నా.. వాటిని నమిలే ప్రయత్నం చేస్తుంటారు.. అదే కొన్నిసార్లు వాళ్ల ప్రాణాల మీదకు తెస్తుంది.. గొంతులో చిన్న చిన్న గింజలు ఇరుక్కుపోయి చిన్నారులు ప్రాణాలు వదిలిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఘటన వెలుగు చూసింది.. శ్రీ సత్యసాయి జిల్లాలో వేరుశనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి నయనశ్రీ ప్రాణాలు విడిచింది. ఇంట్లో ఆడుకుంటూ.. ఆడుకుంటూ వేరుశనగ విత్తనం తినడానికి నోట్లో పెట్టుకున్న చిన్నారి.. దానిని మింగేందుకు ప్రయత్నం చేసింది.. అయితే, వేరు శనగ విత్తనం గొంతులో ఇరుక్కుపోవడంతో.. ఊపిరాడక చిన్నారి నయనశ్రీ ఇబ్బంది పడింది.. ఇది గమనించిన బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది.. ఎందుకంటే అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. కర్ణాటక బాగేపల్లికి చెందిన హనుమంతు కుటుంబం.. శ్రీ సత్యసాయి జిల్లాలోని నల్లచెరువులోని తమ బంధువుల ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది..
రామాంతపూర్ లో విషాదం.. షెటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..
కరీంనగర్ లో ఫ్రెషర్స్ డే రోజు ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరువకముందే షెటిల్ ఆడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రామంతపూర్ లో చోటుచేసుకుంది. ఉదయం సెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అయితే అక్కడే వున్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే కృష్ణారెడ్డిని పరీక్షించిన వైద్యులు మరణించినట్లు నిర్ధారించారు. కృష్ణారెడ్డికి గుండెపోటు రావడం వల్లే మృతి చెందారని తెలిపారు. షెటిల్ ఆడుతుండగా కృష్ణారెడ్డి ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగి ఉంటుందని అది గమనించకుండా షెటిల్ అలాగే ఆడినందువల్లే మృతి చెంది ఉంటారని వైద్యులు తెలిపారు. అయితే.. ఉదయాన్నే షెటిల్ ఆడటానికి ఇంటి నుంచి బయలు దేరిన వ్యక్తి ఇలా మృత్యువాత పడటం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంటికి పెద్దదిక్కైన కృష్ణారెడ్డి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రియుడు దూరమయ్యాడని.. 11 ఏళ్ల బాలుడిపై యువతి కిరాతకం
న్యూ ఢిల్లీకి చెందిన పూజ కుమారి(24) అనే యువతికి 2019లో జితేంద్ర అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. నిజానికి.. జితేంద్రకు అంతకుముందే పెళ్లయ్యింది. అతనికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. భార్యతో విభేదాలు తలెత్తడంతో అతడు భార్యని, పిల్లాడ్ని వదిలేసి.. పూజాతో కలిసి ఉండేవాడు. వీళ్లిద్దరు కలిసి మూడు సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత జితేంద్ర తన మనసు మార్చుకొని.. తిరిగి భార్య, కుమారుడి వద్దకు వెళ్లిపోయాడు. వారితోనే కలిసి జీవించసాగాడు. పూజా కుమారికి ఇది ఏమాత్రం నచ్చలేదు. ప్రియుడు తనని మోసం చేసి వెళ్లిపోయాడని.. జితేంద్రపై కోపం పెంచుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంది. తన ప్రియుడు జితేంద్ర ఇంద్రపురి కాలనీలో ఉంటాడని తెలుసుకున్న పూజాకుమారి.. ఆగస్టు 10వ తేదీన అక్కడికి వెళ్లింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో.. లోపలికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేరు. జితేంద్ర కుమారుడు దివ్యాంశ్ (11) ఒక్కడే నిద్రిస్తున్నాడు. అదే అదునుగా భావించిన పూజా.. దివ్యాంశ్‌ని చంపేసి, అక్కడే ఉన్న ఓ పెట్టెలో మృతదేహాన్ని పెట్టి, అక్కడి నుంచి పారిపోయింది. ఇంట్లో తమ కుమారుడు కనిపించకపోవడంతో.. జితేంద్ర, అతని భార్య ఎంతో వెతికారు. చివరికి పెట్టెలో శవమై కనిపించడంతో షాక్‌కి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, ఈ హత్య చేసింది పూజానే అని నిర్ధారించి, ఆమె ఎక్కడుందో జల్లెడ పట్టి, మూడు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
ఇండియాతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది..
ఇండియాతో తమకు ప్రత్యేక అనుబంధం ఉంటుందని.. వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించనున్నట్టు పలు దేశాధినేతలు, ప్రధాన మంత్రులు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించకున్న సంగతి తెలిసిందే. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లోని భారతీయులు తమ జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు భారత దేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల తెలిపారు. ఇండియాతో తమకు ప్రత్యేక అనుంబంధం ఉంటుందని.. ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తున్నట్టు వారు తమ సందేశాల్లో ప్రకటించారు.
భారతీయ జలాంతర్గామి కోసం పోటీపడుతున్న జర్మనీ, స్పెయిన్..4.8 బిలియన్ డాలర్ల డీల్
భారతదేశ జలాంతర్గామిని తయారు చేయడానికి రెండు భారీ రక్షణ తయారీ కంపెనీలు పోటీలో ఉన్నాయి. ఇవి 2 యూరోపియన్ కంపెనీలు అందులో ఒకటి జర్మనీకి చెందిన Thyssenkrupp AG కాగా మరొకటి స్పెయిన్‌కు చెందిన నవాంటియా. Thyssenkrupp AG ఈ ఆర్డర్ కోసం Mazagon Dock Shipbuilders Ltd of Indiaతో ఒప్పందం చేసుకుంది. స్పెయిన్‌కు చెందిన నవాంటియా లార్సెన్ & టూబ్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్డర్ విలువ రూ. 40,000 కోట్లు ($4.8 బిలియన్లు). అయితే భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లార్సెన్ & టూబ్రో, మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు. జర్మనీకి చెందిన థైసెన్‌క్రూప్ బిడ్‌ను ధృవీకరించారు. ఇది కాకుండా స్పానిష్ కంపెనీ నవాంటియా కూడా సమాధానం కోసం వేచి ఉంది. దేశంలో ఆరు నౌకలను నిర్మించడానికి భారత అధికారులు ప్రస్తుతం పోటీ బిడ్‌లను అంచనా వేస్తున్నారు. జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్‌ను ప్రకటించింది. ఈ టెండర్ కింద జలాంతర్గాములకు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ఉంది. దీని సాయంతో నౌకలు నీటి అడుగున ఎక్కువ కాలం ఉండేందుకు సహాయపడేలా వాటిని రూపొందించాల్సి ఉంటుంది.
ఆగష్టు 23న రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ భారత్ మార్కెట్లో తన రియల్‌మీ 11 5జీని త్వరలోనే లాంచ్ చేయనుంది. ఆగష్టు 23న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ రిలీజ్ అవుతుందని రియల్‌మీ అధికారికంగా తెలిపింది. అంతేకాదు రియల్‌మీ 11 ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా భారతదేశంలో అదే రోజు లాంచ్ అవుతుంది. ఈ లంచ్ ఈవెంట్‌ను రియల్‌మీ కంపెనీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మీరు ట్విట్టర్ (X) మరియు పేస్ బుక్ ద్వారా కూడా అప్‌డేట్‌లను పొందవచ్చు. రియల్‌మీ కంపెనీ తన రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్ ధరను అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. అయితే పలు నివేదికల ప్రకారం… రియల్‌మీ11 5జీ ఫోన్ 8GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ. 18,000 (1599 చైనా యువాన్లు)గా ఉండనుంది. అదే సమయంలో 12GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ. 20,600 (1799 చైనా యువాన్లు)గా ఉంటుంది. నలుపు, లేత గోధుమరంగు మరియు నీలం రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. రియల్‌మీ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అమ్మకాలు అందుబాటులో ఉండనున్నాయి.
కంప్యూటర్ విద్యను గ్రామాలకు పరిచయం చేసిన గొప్పవ్యక్తి.. అనిల్ పంత్ కన్నుమూత
కంప్యూటర్ కంపెనీ ఆప్టెక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ పంత్ (Aptech CEO) కన్నుమూశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ అనిల్ పంత్ మరణ సమాచారాన్ని ఇచ్చింది. కంపెనీ తెలిపిన ప్రకారం.. అనిల్ పంత్ ఆగస్టు 15 న మరణించాడు. పంత్ సహకారం, సహాయక శక్తిని ఆప్టెక్ బృందం కోల్పోతుందని కంపెనీ తెలిపింది. అనిల్ పంత్ తన ఆకస్మిక అనారోగ్య కారణంగా నిరవధిక సెలవుపై వెళ్లారు. గత సంవత్సరం జూన్ 19 న కంపెనీ ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది, దీనిలో సాఫీగా వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణ కొనసాగింపును నిర్ధారించడానికి సెలక్టెడ్ బోర్డు సభ్యులతో కంపెనీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యంతర సీఈవోని ఎన్నుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని Aptech బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కమిటీకి సూచించబడింది. జున్‌జున్‌వాలా కుటుంబానికి కూడా ఆప్టెక్‌లో స్టాక్స్ ఉన్నాయి.
స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
తాగితే చాలా మంది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఫుల్ గా తాగితే ప్రపంచం ఎటుపోతున్నా దానితో మాకు పనిలేదంటారు. కొంతమంది తాగి ఇంట్లో పడుకుంటే మరికొందరు మాత్రం రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘనలను కొంతమంది వీడియో తీస్తూ ఉంటారు. సోషల్ మీడియా వినియోగం ఎక్కవయ్యాక ఇటువంటి వీడియోలు కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వీటిలో కొన్ని చిరకు తెప్పించేలా ఉంటే కొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఓ తాగుబోతు చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరిగినట్టు మాత్రం వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియోలో ఓ తాగుబోతు రద్దీగా ఉన్న రోడ్డుపై వాహనాల మధ్యలో నుంచి వెళుతూ ఉంటాడు. అంతేకాదు వాహనాలను ఆపాలంటూ చేయి అడ్డుపెడుతూ ఉంటాడు. అయినా ఏ వాహనం కూడా ఆగదు. దీంతో ఆ తాగుబోతూ ఓ స్కూటీని గట్టిగా పట్టుకొని ఆపుతాడు. అయితే ఆ స్కూటీ నడుపుతున్న వ్యక్తి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెల్లటి బట్టలు ధరించి జాతీయ జెండా ఉన్న కండువాను పైన కప్పుకొని ఉంటాడు. స్కూటీని రోడ్డుపై అలా అడ్డంగా ఆపడంతో పాటు అతనికి చేయి చూపిస్తూ ఏదో అంటాడు. దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చి స్కూటీ దిగివచ్చి ఆ తాగుబోతు కాలర్ పట్టుకొని అతడి చెంపపై కొడతాడు. అంతేకాకుండా అతని మెడ పట్టుకొని నేలపై పడవేసి తన్నడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అటుగా బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి అతడిని కొట్టకుండా ఆపి గొడవను సద్దుమణిగేలా చేస్తాడు. అయితే ఇక్కడ చివరిలో ఒక కొసమెరుపు జరిగింది. అది చూస్తే మాత్రం కచ్ఛితంగా నవ్వు వస్తుంది. అన్ని దెబ్బలు తిన్న తరువాత కూడా ఆ తాగుబోతు వెళుతూ వెళుతూ తనని తన్నిన వ్యక్తిని చూసి డ్యాన్స్ చేస్తాడు. ఇది కూడా మనకు వీడియోలో కనిపిస్తోంది. ఇది చూస్తే ఆ తాగుబోతుకు ఇంకా బుద్ధి రాలేదు ఇంకా రెండు పడాల్సింది అనిపిస్తోంది. అంతేకాదు ఇక్కడ విశేషం ఏంటంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజు మువన్నెల రంగు టోపీని ధరించాడు.
‘కల్కి’లో యంగ్ హీరో ఫైనలా?
‘సలార్’ రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ‘కల్కి’ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా సలార్‌తో పాటు కల్కి కూడా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై జెండా పాతేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. వైజయంతి బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ‘కల్కి’ తెరకెక్కుతోంది. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఊహకందని విధంగా రూపొందిస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన కల్కి గ్లింప్స్ అదిరిపోయింది. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ ఉన్న స్టార్ కాస్ట్ తో పాటు కల్కి సినిమాలో మరో యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అతనెవరో కాదు మళయాళ యంగ్ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అనే టాక్ కూడా ఉంది. గతంలో వైజయంతి బ్యానర్ నిర్మించిన సీతారామం సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. అందుకే ‘కల్కి’లో దుల్కర్ కామియో ఉండే ఛాన్స్ ఉందనే టాక్ ఉంది. లేటెస్ట్ అప్డేట్ మాత్రం దుల్కర్ దాదాపుగా ఫైనల్ అయ్యాడని చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో దుల్కర్ రోల్ కథను మలుపు తిప్పేలా ఉంటుందట. సెకండ్ హాఫ్‌లో కీలక పాత్రలో ఓ 10 నిమిషాలు కనిపించనున్నాడట దుల్కర్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ఒకవేళ దుల్కర్ ‘కల్కి’లో ఉంటే మాత్రం ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి సౌత్ లో మరింత వెయిట్ పెరిగినట్టే.