*బీఆర్ఎస్‌కు భేతి సుభాష్ రెడ్డి గుడ్ బై..
బీఆర్‌ఎస్ పార్టీ మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపారు. మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికై పాటు పడ్డానని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో సముచిత స్థానం దక్కకపోవటంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు భేతి సుభాష్ రెడ్డి. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని మన తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీ కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి టికెట్ ఇచ్చే ముందుకు కూడా తనకు మాట మాత్రమైనా చెప్పలేదని లేఖలో తెలిపారు. మీ మీద విశ్వాసంతో పార్టీ గెలుపుకు కృషి చేశానని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో అయినా అవకాశం వస్తుందని ఆశించాను.. కానీ మళ్లీ మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ను రాగిడి లక్ష్మారెడ్డికి చర్చ జరపకుండా ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవకాశవాద ఎంపీలను గెలిపించటం కంటే.. ఉద్యమ సహచరుడు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నానని లేఖలో తెలిపారు. కావునా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. అని భేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
*తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చింది..
తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి పది లక్షల కోట్లు ఇచ్చింది కేంద్రం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 1947-2014 వరకు 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే.. గత తొమ్మిది ఏళ్ల నుంచి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామన్నారు. 26 వేల కోట్లతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నాం.. పూర్తిగా కేంద్రమే నిర్మిస్తుందన్నారు. కాజీపేటలో RMU, వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ కు మోడీ భూమి పూజ చేశారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ వయబిలిటి ఫండ్ 1204 కోట్లు ఇచ్చిందన్నారు. రైతులకు అండగా RFCL ను ప్రధాని ప్రారంభించారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ ధరలు పెరిగితే మన దగ్గర కొరత లేకుండా ఇచ్చామన్నారు. ఒక యూరియా బస్తా మీద 2236 రూపాయల సబ్సిడీని ఇస్తుంది కేంద్రం అన్నారు. పీఎం కిషన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని తెలిపారు. ఆసియలోనే అది పెద్ద బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు హైదరాబాద్ లో భూమి పూజా చేశామన్నారు. 889 కోట్లతో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు నన్ను గెలిపించారు.. వారికి జవాబు దారిగా ఉండాలన్నారు. నేను చేశానో దాదాపు 300 పేజీలతో పుస్తకాన్ని తయారు చేశామన్నారు. మొదటి సారి హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశానని తెలిపారు. సహాయ మంత్రిగా 8 రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉన్నానని అన్నారు. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు నేను హోం శాఖలోనే ఉన్నానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దులో నేను భాగం కావడం నా అదృష్టం అన్నారు. కరోనా వచ్చినప్పుడు హోం శాఖను నోడల్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని తెలిపారు. నోడల్ సెంటర్ కు ఇంచార్జ్ గా పని చేసి.. కరోనా టైంలో సేవ చేశానని తెలిపారు. రెండున్నర ఏళ్ల తరువాత నాకు మూడు శాఖలు ఇచ్చి క్యాబినెట్ మినిస్టర్ గా అవకాశం ఇచ్చారన్నారు. కల్చర్ మినిస్టర్ గా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించానని అన్నారు. DoNER మినిస్టర్ గా కూడా బాగా పని చేశాననుకుంటున్నానని తెలిపారు. కేంద్ర మంత్రిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.
*పశ్చిమ బెంగాల్‌లో రామ నవమి సందర్భంగా హింస.. ఎన్ఐఏ దర్యాప్తుకు డిమాండ్
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం రామ నవమి సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో రాళ్లతో దాడి చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిలో సుమారు రెండు డజన్ల మంది గాయపడినట్లు సమాచారం. రామ నవమి ఊరేగింపు ముర్షిదాబాద్ జిల్లా శక్తిపూర్ మీదుగా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత 144 సెక్షన్ విధించడంతో పాటు ఎక్కువ మంది గుమిగూడకుండా నిషేధం విధించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోల ప్రకారం, రామనవమి ఊరేగింపుపై పైకప్పులపై నుండి కూడా రాళ్లు విసిరారు. అదుపు చేయలేని దుండగులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతోపాటు లాఠీచార్జి కూడా చేశారు. లాఠీచార్జి, టియర్ గ్యాస్ షెల్స్‌తో పాటు అదనపు బలగాలను కూడా రప్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఇది కాకుండా, హింసలో గాయపడిన వారిని బెర్హంపూర్, ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలలో చికిత్స కోసం చేర్చారు. ర్యాలీపై రాళ్లు రువ్వారని, హిందూ సమాజానికి చెందిన దుకాణాలను ధ్వంసం చేశారని బీజేపీ బెంగాల్ యూనిట్ ఆరోపించింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత శుభేందు అధికారి మాట్లాడుతూ, ‘పరిపాలన నుండి పూర్తి అనుమతితో శాంతియుతంగా రామనవమి ఊరేగింపు జరిగింది. శక్తిపూర్‌లో ఊరేగింపుపై దుండగులు దాడి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మమత పోలీసులు కూడా అక్రమార్కుల వెంటే ఉన్నారు. రామభక్తులపై లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో పాదయాత్రను మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ఘటన అనంతరం కాంగ్రెస్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా బుధవారం సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో శుభేందు అధికారి గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ హింస వెనుక కుట్ర ఉందని భయపడ్డారు. ఎన్ఐఏ దర్యాప్తునకు సిఫారసు చేయాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ఈ విషయమై అధీర్ రంజన్ చౌదరి టీఎంసీ, బీజేపీపై ఆరోపణలు చేశారు. ముందస్తు ప్రణాళికలో భాగమే ఈ హింస అని అన్నారు. ఇది బీజేపీ పనితీరుతో రుజువైంది. ఎన్నికల సంఘంతో మాట్లాడాను. అదనపు బలగాలను రప్పించి ఎస్పీ సంఘటనా స్థలంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాను. రామ నవమి నాడు హింస చెలరేగే అవకాశం ఉందని సిఎం మమతా బెనర్జీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా మమత హిందూ పండుగలను కించపరుస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
*కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. బాతులను చంపాలని నిర్ణయం
కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. బర్డ్ ఫ్లూ కేసులను కనుగొన్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యాక్టివ్ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. కేరళలోని అలప్పుజా జిల్లాలో రెండు చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎడత్వ గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 1, చెరుతన గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 3 ఉన్నాయి. పెంచిన బాతులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో బాతుల నమూనాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపారు. అక్కడ వ్యాధి నిర్ధారించబడింది. శాంపిల్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (హెచ్5ఎన్1) ఉన్నట్లు నిర్ధారించినట్లు జిల్లా పరిపాలన అధికారి ఒకరు తెలిపారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎపిక్ సెంటర్‌కు కిలోమీటరు పరిధిలో పెంచే పక్షులను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాధి మరింత ఊపందుకుంటుందని ప్రజలు భయపడుతున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, జంతు సంరక్షణ శాఖ ద్వారా వీలైనంత త్వరగా సన్నాహాలను పూర్తి చేస్తామని పాలనా యంత్రాంగం చెబుతోంది. అయితే అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం ప్రజలకు తెలిపింది. ఈ వ్యాధి మనుషుల్లో వ్యాపించే అవకాశం లేదు.
*రూ.200కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. నలుగురు విదేశీయుల అరెస్ట్
గ్రేటర్ నోయిడాలోని దాద్రీలో డ్రగ్స్ ఫ్యాక్టరీని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. విదేశాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేసినట్లు చెబుతున్నారు. దాద్రీ పోలీస్ స్టేషన్, ఎకోటెక్ ప్రథమ్ పోలీసుల సంయుక్తంగా ఈ చర్య జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్న యాంటీ నార్కోటిక్ యాక్ట్ కింద ఈ చర్య తీసుకున్నారు. అరెస్టయిన నలుగురు విదేశీయులు నైజీరియాకు చెందినవారే. ఒకరికి కొద్ది రోజుల క్రితం వచ్చిన వీసా ఉంది. మిగిలిన ముగ్గురికి వీసాలు లేవు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఎండీఎంఏ. పరిమాణం 25 కిలోలు అని చెప్పారు. ఇంతకు ముందు రెండుసార్లు ఈ ప్రాంతంలో పెద్దఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ కేసులో 140 కిలోల డ్రగ్స్, మరో కేసులో సుమారు 36 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తులు నైజీరియాతో పాటు స్థానికంగా డ్రగ్స్ సరఫరా చేస్తారు. గురుగ్రామ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నోయిడా తదితర ప్రాంతాల్లో జరిగే రేవ్ పార్టీలకు కూడా ఈ వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు.
*ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లింట తీవ్ర విషాదం.. ఏడుగురు దుర్మరణం..
పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొనడంతో వివాహ వేడుకకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణేకు 200 కిలోమీటర్ల దూరంలోని కవ్తే మహాకల్ తహసీల్ లోని విజాపూర్ – గుహాఘర్ రహదారిపై జంబుల్ వాడి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా., ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించగా.. కోలుకోలేక వారు కూడా తనువు చాలించారు. బాధితులు కర్ణాటకలోని బాగల్ కోట్ కు చెందిన వివాహ వేడుకలో భాగంగా సాంగ్లీ జిల్లాలోని సవర్దేకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. జాట్ జిల్లా సాంగ్లీ సమీపంలో కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర సంఘటన జరిగింది. వీరంతా వారి బంధువు ఇంట పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి చేర్చారు. వేగంగా వచ్చిన కారు.. బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. వలస కూలీలతో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు జాట్ నుంచి ముంబైకి వెళ్తున్నట్లు పోలీస్ అధికారలు తెలిపారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు కొద్దిమందికి గాయాలు కావడంతో వారిని కూడా సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. బస్సులోని దాదాపు 10 నుంచి 15 మంది వరకు ప్రమాదంలో గాయపడ్డారని.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
*భారీ అగ్నిపర్వత విస్ఫోటనం.. సునామీ హెచ్చరికలు జారీ..
తాజాగా ఇండోనేషియాయలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దేశానికీ సంబంధించిన సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. ఇక ఈ అగ్నిపర్వతం గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 5 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ విషయాన్ని ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ విస్ఫోటనంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నట్లు జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇక అక్కడి పరిస్థితులను అంచనా వేసిన అధికారులు అక్కడ సునామీ హెచ్చరికలను జారీ చేసారు. ఇందులో భాగంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ చేసారు అధికారులు. అగ్నిపర్వతం నుండి వెలబడుతున్న పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత లావా పెద్ద ఎత్తున సమీప ప్రాంతాలకు చేరడంతో దేశ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇక 725 మీటర్ల పొడవు ఉన్న రుయాంగ్ అగ్నిపర్వతం నుండి ప్రజలు సుమారు 6 కి.మీ. మేర దూరంగా ఉండాల్సిందిగా ఉండాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మేరకు స్థానికులకు పలు సూచనలు చేస్తూ.. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలోకి కూలిపోవడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలోని దాదాపు 11 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే.
*మరోసారి గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు!
టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఏఐ వల్ల టెక్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన ఉత్పత్తులను అందించడానికి ఇది ఒక మంచి అవకాశం. అయితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. మన ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి.. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా నైపుణ్యం కలిగిన కొంతమంది సభ్యులను తొలగించాల్సి వస్తోంది. ఇది చాలా కష్టమైన విషయం అని మాకు తెలుసు. కానీ తప్పడం లేదు’ అని రూత్ పోరాట్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి గూగుల్ బదిలీ చేస్తోంది. భారత్‌కు కొంతమందిని తీసుకొస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు?, ఎంత మందిని బదిలీ చేస్తున్నారు? అనే విషయాన్ని గూగుల్ ఇంకా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెస్లా, యాపిల్, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయి. 2024లో ఇప్పటివరకు 58 వేల మంది ఉద్వాసనకు గురైనట్లు తెలుస్తోంది.
*ఎన్నికల ప్రచారంలో గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు!
కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. వేలూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. పక్కనే ఉన్న వాలంటీర్లు మన్సూర్‌ను కేకే నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. మన్సూర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. వేలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పనసపండు గుర్తు ఆయనకు దక్కగా.. వేలూరులో ఎన్నికల ప్రచారం ఆరంభించారు. ‘డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పార్టీని ఆయన ప్రారంభించారు. అయితే తన పార్టీకి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు రాకపోవడంతో.. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయనకు ఛాతిలో స్వల్ప అసౌకర్యం కలిగింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్సూర్ అలీ ఖాన్.. వాటిన లెక్కచేయకుండా ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చి మరి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక ఇటీవల హీరోయిన్ త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. లియో మూవీలో త్రిష, మన్సూర్ నటించారు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని, ఆమెను బెడ్ రూంలోకి తీసుకెళ్లే ఛాన్స్ వస్తుందని తాను ఆశపడ్డానని మన్సూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఖండించారు.