Site icon NTV Telugu

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరం : ఎమ్మల్యే కోటం రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనకున్న ఆదరణను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని అయినా. తాను వాటిని పట్టించుకోనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్న తనతో పాటు తన తమ్ముడిని విమర్శించినా..సహిస్తామని.. చివరకు భార్య ..కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమన్నారు.. ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని..సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగులు భరించలేని పరిస్థితుల్లో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విమర్శలు. తీవ్రం చేస్తారన్నారు. ఎవరూ వాటికి స్పందించవద్దని కోటంరెడ్డి కోరారు.

 

పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి : సీపీఐ రామకృష్ణ

సీపీఐ రామకృష్ణ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు సీపీఐ నేతలు. పాదయాత్రకు ప్రత్యేక అనుమతులు ఏమీ ఉండవవి, ప్రజలకు ఇబ్బంది కలిగితే తాము జోక్యం చేసుకుంటామని ఎస్పీ చెప్పారన్నారు సీపీఐ నాయకులు. రామకృష్ణ పాదయాత్ర కు సీపీఐ రాష్ట్ర, జాతీయ నాయకులతో పాటు మిగిలిన రాజకీయ పార్టీల మద్దుతు ఉందని వెల్లడించారు సీపీఐ నాయకులు. ఉక్కు పరిశ్రమ కోసం మలి విడత ఉద్యమంలో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర చేసి తీరుతామన్నారు.

 

తుపానుపై అప్రమత్తతంగా ఉండండి – కలెక్టర్లుకు సీఎం ఆదేశాలు

బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం సీఎంఓ అధికారుల సమావేశంలో తుపాను పరిస్థితులపై సీఎం సమీక్షించారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం ఆదేశించారు.

 

బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు

లిక్కర్ కేసులో ఉందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ కవితని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆందోళన నిర్వహించింది . కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నాలు చేశారు. గిరిజన మహిళలతో బిజెపి నాయకులు కదిలి వచ్చారు . దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . బిజెపి నాయకులు మహిళలతో కలిసి వస్తారని ఊహించని పోలీసు యంత్రాంగం కొంత ఇబ్బందులకు గురైంది. మరింత ఫోర్స్ ని తీసుకుని వచ్చి పలువురు బిజెపి నాయకులని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌..

బ్యాంకు కస్టమర్లకు శుభవార్త చెప్పింది ఆర్బీఐ.. ఆన్‌లైన్‌ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే ఆప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్తే బ్యాంకులు బ్రాంచ్ స్థాయిలో వెరిఫికేషన్ అడగకూడదని స్పష్టం చేసింది.. ఒక కస్టమర్ ఈ-కేవైసీ చేసినట్లయితే లేదా సీ-కేవైసీ పోర్టల్‌లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే, బ్యాంకులు శాఖ స్థాయిలో ధృవీకరణలు/అప్‌డేట్‌లను అడగకూడదని పేర్కొంది.. ఆన్‌లైన్‌లో తమ KYC ధృవీకరణలను పూర్తి చేసిన బ్యాంక్ కస్టమర్లు వార్షిక అప్‌డేట్‌లను అలాగే ఆన్‌లైన్‌లో వారి వ్యక్తిగత వివరాలలో ఏవైనా మార్పులు ఉంటే చేయవచ్చు.. కానీ, ధృవీకరణ/అప్‌డేట్‌ల కోసం సంబంధిత బ్యాంక్‌ బ్రాంచ్‌కి కస్టమర్‌ రావాల్సిందేననే డిమాండ్‌ చేయకూడదని.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలాంటి నిబంధన లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు..

 

బీఆర్ఎస్‌ పార్టీ పేరు నాకే కేటాయించాలి..

బీఆర్ఎస్‌ పార్టీకి అనుమతి ఇస్తే ఆదినాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు వరంగల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు.. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరు తనకు కేటాయించాలని సెప్టెంబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని ఆధారాలు చూపుతున్నారు బానోత్‌ ప్రేమ్ గాంధీ నాయక్ అనే యువకుడు.. టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోన్న సమయంలో.. అసలు ఆ పేరు నాకే కేటాయించాలని మరోసారి ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు.. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరు తనకు కేటాయించాలని సెప్టెంబర్‌లోనే దరఖాస్తు చేశాను.. ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్ ప్రకారం… బీఆర్ఎస్‌ తనకే ఇవ్వాలంటూ ఈ నెల 6వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.. (ఎఫ్ నంబర్ 56/164/2022/పీ.పీ.ఎస్-4) నెంబర్ కోడ్ లేఖను ఈసీకి పంపారు ప్రేమ్ నాయక్… బీఆర్‌ఎస్‌ పార్టీ పేరు గనక తనకు కేటాయించకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు ప్రేమ్‌ నాయక్‌.

 

సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎప్పుడంటే

సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. మాదాపూర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపనలో భాగంగా.. రేపు (ఈనెల9)న సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్‌, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక, మాదాపూర్‌లోని రహేజ, మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉదయం 8.30 నుంచి ఈనేపథ్యంలో.. మధ్యాహ్నం 3గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

నేడు కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. మాజీ మేయర్ కూతురు వివాహ వేడుకకు హాజరు
నేడు సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కరీంనగర్ కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. అనంతరం మాజీ మేయర్ రవిందర్ సింగ్ కూతురు వివాహ వేడుకలో హాజరు కానున్నారు. నవ దంపతులను ఆశీర్వదించనున్నారు సీఎం. అక్కడి నుంచి అనంతరం మంత్రి గంగుల నివాసానికి వెళ్ళనున్నారు. పలు మంత్రులతో సమావేశ అనంతరం అక్కడి నుంచి 2 గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్న కేసీఆర్‌. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

షర్మిల పాదయాత్ర అనుమతిపై కొనసాగుతున్న ఉత్కంఠ

వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతికి పోలీస్ కు విధించిన 48 గంటల గడువు నేటితో పూర్తైంది. అయితే పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ నర్సంపేట ఏసీపీ వద్దకు YSRTP నేతలు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు నర్సంపేట ACP ను YSRTP నేతలు కలవనున్నారు. పాదయాత్రకి అనుమతి ఇస్తారా..? లేదా? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. డిసెంబర్ 14న పాదయాత్ర ముగిస్తామని, దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాం ” అని వైఎస్ షర్మిల పేర్కొన్న విషయం తెలిసిందే.

 

10 వేలు కాదు..20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్..

ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య పలు టెక్ కంపెనీలు వరసగా తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్ లో మొదలైన ఈ తొలగింపులు వరసగా కొనసాగుతున్నాయి. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ ఇలా ప్రముఖ టెక్ దిగ్గజాలు అన్నీ కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.

ఇదిలా ఉంటే రాబోయే కొన్ని నెల్లలో అమెజాన్ కంపెనీ తన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్లకు పైగా ఉద్యోగాలు ఉన్న టెక్ దిగ్గజం తన ఉద్యోగులను తొలగించనుంది. ఈ తొలగింపు అన్ని స్థాయిల్లోని ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల పనితీరును మదింపు చేయాలని మేనేజర్లు ఆదేశాలు ఇచ్చింది. గత నెలలో న్యూయార్క్ టైమ్స్.. అమెజాన్ 10,000 ఉద్యోగులను తొలగిస్తుందని నివేదించింది. ఉద్యోగులను తొలగించే ముందు 24 గంటల ముందు నోటీసుతో పాటు కంపెనీ కాంట్రాక్ట్ ప్రకారం చెల్లింపులు ఉంటాయని తెలుస్తోంది.

మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో ప్రపంచ మాంద్యం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ తన కంపెనీలో 50 శాతం అంటే దాదాపుగా 3800 మందిని, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 13 శాతం అంటే 13,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ 10,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే బాటలో అమెజాన్ కూడా పయణిస్తోంది. ఇదిలా ఉంటే నెట్ ఫ్లిక్స్, డిస్నీ వంటివి కూడా తమ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నాయి.

 

జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ..

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చరిత్ర సృష్టించింది. జాతీయ పార్టీ హోదాను సంపాదించుకుంది. గుజరాతీల ఓట్లే ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మార్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం అన్నారు. ‘‘ గుజరాత్ ప్రజల ఓట్లతోనే నేడు ఆప్ జాతీయపార్టీగా అవతరిస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో విద్యా, ఆరోగ్య రాజకీయాలతో ముద్ర వేస్తున్నామని.. ఇందుకు దేశానికి అభినందనలు అని ఆయన అన్నారు. ఆప్ జాతీయ ఆశయాలకు “జాతీయ పార్టీ” అనే ట్యాగ్ మరింత బూస్ట్ ని ఇస్తుందని ఆయన అన్నారు.

ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గోవాలో కూడా ఆప్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో కూడా తన ముద్రను వేసింది. దాదాపుగా ఆరు స్థానాలను గెలిచే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆప్ జాతీయ హోదా పొందినట్లు అయింది. ఓ పార్టీ జాతీయ హోదా పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లతో రాజకీయపార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 సీట్లు, 6 శాతం ఓట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్ నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాప్రతినిధులను కలిగి ఉంది. దీంతో జాతీయ పార్టీ హోదాకు లైన్ క్లీయర్ అయింది.

ఢిల్లీతో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఒక రోజు క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆప్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ ఇచ్చింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేసింది.

 

 

Exit mobile version