Tomato at Rs. 208: టమోటా లేనిదే ఏ కూర వండలేం.. దాంతో కిచెన్‌కు టమోటాతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.. కానీ, క్రమంగా కిచెన్‌లో కనిపించకుండా మాయం అవుతోంది ఆ టమోటా.. దానికి ప్రధాన కారణం.. ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోవడమే.. సామాన్యులు టమోటా వైపు చూడడమే కానీ, కొనడం ఆపేశామని చెబుతున్నారు.. ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఆగమైపోతున్నారు. ఇది ఒక ప్రాంతానికో.. ఓ రాష్ట్రానికో పరిమితం కాలేదు.. దేశం మొత్తం ఇదే పరిస్థితి. టమోటా అంటే బెంబేలెత్తిపోయేలా ధర పలుకుతోంది.. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నాశనం కావడమే దీనికి ప్రధాన కారణం..
Read Also: Heat Month July: జులై చాలా హాట్ గురూ… 2019లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను కూడా ఇప్పుడు మించి
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో టమోటాకు పెట్టినపేరైన మదనపల్లె మార్కెట్‌లో కొత్త రికార్డు సృష్టించింది టమోటా.. 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు రైతులు, వ్యాపారులు.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ దాటేసింది.. ఈ రోజు కిలో టమోటా ధర 208 రూపాయలుగా పలికింది.. ఇక, 25 కేజీల టమోటా బాక్స్ ధర 5200 రూపాయిలు పలికింది.. మరోవైపు సాధారణ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.230 నుండి రూ.250 వరకు పలుకుతోంది.. మొత్తంగా 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నయా రికార్డులను సృష్టించింది టమోటా ధర. అయితే, నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలోనూ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. మరి టమోటా దిగుబడి ఎప్పుడు పెరుగుతుందో.. టమోటా ధర ఎప్పుడు కిందకు దిగివస్తుందో చూడాలి.