Heat Month July: గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు ఎక్కువయ్యాయి. ఇది ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి. కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే జులై నెల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డులకెక్కింది. 2019లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను కూడా ఈ ఏడాది జులై నెలలో అధిగమించినట్టు నిపుణులు చెబుతున్నారు. లక్ష సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా వేడి జులై నెలలో నమోదయింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా జులై చరిత్రకెక్కింది. 2019లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను కూడా ఇప్పుడు మించిపోనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీస్, ప్రపంచ వాతావరణ సంస్థ గురువారం పబ్లిష్ చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించాయి. లక్ష సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా వేడి వాతావరణం గత మూడు వారాల్లో నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గాలి ఉష్ణోగ్రతలను సేకరించి ఈ రికార్డులను తయారు చేశారు. ఈ ఏడాది జులై తొలి 23 రోజుల్లో సగటున 16.95 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2019 జులైలో నమోదైన 16.93 రికార్డు కంటే ఎక్కువ. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. జూన్‌లో కూడా ఎండలు మండిపోయాయి. చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత ఈ నెల 6న నమోదైంది. ఈ నెల 6న ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.08 డిగ్రీల సెల్సియస్ (62.74 డిగ్రీల ఫారన్‌హీట్).
Read also: Russia: ఆఫ్రికా దేశాల శాంతి ప్రతిపాదనలు.. పరిశీలిస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్
అమెరికాలో 20 కోట్ల మందికి (60 శాతం జనాభా) వేడిగాలులు, తుపాన్ల ముప్పు పొంచి ఉన్నట్లు జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. గురువారం ఈశాన్య, మధ్య అట్లాంటిక్‌లో ప్రమాదకరమైన వేడిగాలులు మొదలయ్యాయని, అవి ఈ వారాంతం దాకా కొనసాగవచ్చని పేర్కొంది. ఈశాన్య, దక్షిణ, న్యూ ఇంగ్లాండ్, దక్షిణ ఫ్లోరిడా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గత కొన్ని దశాబ్దాలుగా భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలా భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం.. ప్రజలకు ఒకరకంగా ప్రమాదకరం. ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ గురువారం వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూలైలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. భూమి వేడెక్కుతున్న దశ నుండి గ్లోబల్ బాయిలింగ్ యుగంలోకి అడుగుపెట్టబోతున్నామని తెలిపారు. ఆయన న్యూయార్క్‌లో మాట్లాడుతూ.. ఉత్తర అర్ధగోళంలో వేడిమి విపరీతంగా పెరిగిపోయిందని, తద్వారా ఈ వేసవి ప్రజల పట్ల భయానకంగా మారిందని వివరించారు.మొత్తం గ్రహానికి ఇదోక విపత్తు అనీ, వాతావరణ మార్పు విపత్తు, ఇది ప్రారంభం మాత్రమేననీ, భూమండలం వేడెక్కడం ముగిసింది… ఇప్పుడు ఆ వేడితో భూమండలం ఉడికిపోవడం మొదలైంది. ఈ గణనీయమైన మార్పు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై చర్యలు వెంటనే చేపట్టకుంటే మానవాళి వినాశనం తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. గాలి పీల్చ లేనంతగా మారుతున్నదని ఆయన హెచ్చరించారు.