గతేడాది డిసెంబర్ 27నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తొలుత 15 రోజులు మాత్రమేనని చెప్పిన పోలీసుశాఖ.. సాంకేతిక కారణాలతో పలుమార్లు సర్వర్ మొరాయించి ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెలాఖరి (జనవరి 31) వరకు గడువు పొడిగించింది. దీంతో పెంచిన గడువు నేటితో ముగియనుండడంతో ఇంకా చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆన్‌లైన్ ద్వారా త్వరగా చెల్లించాలని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చు అని పోలీస్ శాఖ తెలిపింది.
అయితే, పెండింగ్ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు మళ్లీ గడువు పెంచేది లేదని పోలీసుశాఖ తేల్చి చెప్పింది. మళ్లీ గడువు పెంచుతారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రేపటి నుంచి పూర్తి మొత్తం వసూలు చేయనున్నట్లు పోలీస్ శాఖ హెచ్చరించింది. కాబట్టి పెండింగ్ చలాన్లు ఉన్న వారు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అయితే భారీ రాయితీతో పెండింగ్ చలాన్లు కట్టించుకుంటున్నా.. ఇంకా సగం మంది చలాన్ల చలన్లు కట్టేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.. పెండిగ్ చలాన్ల ద్వారా పోలీసుశాఖకు భారీగానే ఆదాయం వచ్చింది. అయితే, ఆశించిన మేర వసూలు కాలేదంటున్నారు. గతంలో దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు అయింది.. ఇప్పుడు అందులో సగం మేర మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇక, భారీ మొత్తంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించినా.. వాహనదారులు ఏమాత్రం లెక్క చేయకుండా.. పదేపదే ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెండింగ్ చలాన్లే దీనికి నిదర్శనమని పోలీసులు తెలిపారు.