Today Business Headlines 27-04-23:
అత్యధిక.. పేటెంట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో పేటెంట్ ఫైలింగ్స్ సంఖ్య 13 పాయింట్ 6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం కావటం విశేషం. ఈ విషయాన్ని నాస్‌కామ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. డొమెస్టిక్ పేటెంట్ ఫైలింగ్స్ వాటా 41 శాతం నుంచి 44 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. మరీ ముఖ్యంగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలకు సంబంధించిన పేటెంట్ల సంఖ్య బాగా పెరిగిందని నాస్‌కామ్ తెలిపింది.
ఆధార్ లావాదేవీలు
ఆధార్ నంబర్ల ఆధారంగా.. అంటే.. ఇ-కేవైసీని బేస్ చేసుకొని నిర్వహించిన లావాదేవీల సంఖ్య మార్చి నెలలో 2 పాయింట్ మూడు ఒకటి బిలియన్‌లుగా నమోదైంది. ఫిబ్రవరిలో జరిగిన ట్రాన్సాక్షన్ల కన్నా మార్చిలో 16 శాతం ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిగాయి. దేశంలో డిజిటల్ ఎకానమీ డెవలప్ అవుతోందనటానికి దీన్నొక ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నారు. ఈ లావాదేవీల్లో ఎక్కువ శాతం బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ తీసుకోవటం ద్వారా నిర్వహించారు. ఆ తర్వాతి స్థానాల్లో డెమోగ్రఫిక్ మరియు ఓటీపీ ఆథెంటికేషన్లు నిలిచాయి.
మోడీకి ముఖేష్ గిఫ్ట్
రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తనకు రైట్ హ్యాండ్ లాగా ఉండే మనోజ్ మోడీకి భారీ కానుక ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ గిఫ్ట్ విలువ ఏకంగా 1500 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ముంబైలోని నేపియన్ సీ రోడ్ ఏరియాలో బృందావన్ పేరుతో ఉన్న 22 అంతస్తుల భవనాన్ని బహుమతి కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌తోపాటు మరికొన్ని సంస్థలతో రిలయెన్స్ పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవటంలో మనోజ్ మోడీ కీలక పాత్ర పోషించారని, అందుకే ముఖేష్ అంబానీ ఈ రేంజ్‌లో గుడ్‌విల్ ఇచ్చారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘పీఎల్ఐ’కి పేమెంట్లు
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్.. పీఎల్ఐ పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మార్చి నెల వరకు 2 వేల 874 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, టెలికం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 8 సెక్టార్లలోని సంస్థలకు ఈ ప్రయోజనం కలిగినట్లు తెలిపింది. 3 వేల 420 కోట్ల రూపాయలకు కంపెనీల నుంచి క్లెయిమ్‌లు అందాయని వెల్లడించింది. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా ఎక్స్‌పోర్ట్‌లను పెంచటం కోసం పీఎల్ఐ పథకాన్ని 2020వ సంవత్సరంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
2 తెలుగు రాష్ట్రాల్లోకి
గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులను అందించే వి-ట్రాన్స్ ఇండియా సంస్థ సౌతిండియాలో విస్తరించాలని చూస్తోంది. తద్వారా.. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఒకటీ రెండేళ్లలో 600 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వివిధ సంస్థలతో బిజినెస్ పార్ట్నర్‌షిప్‌లను ఏర్పరచుకోనున్నట్లు తెలిపింది. 2026 నాటికి 3 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ సీఎండీ మహేంద్ర షా పేర్కొన్నారు. వి-ట్రాన్స్ ఇండియాకి ప్రస్తుతం 2 వేల 500లకు పైగా వాహనాలు, 3 వేల 300 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు.
డివిడెండ్.. 1800%..
మారుతీ సుజుకీ ఇండియా మార్చి క్వార్టర్‌లో అద్భుతమైన ఫలితాలను సాధించింది. 42 శాతం ఎక్కువ లాభాలను ఆర్జించింది. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 1800 శాతం డివిడెండ్ ప్రకటించింది. 5 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేర్‌కి 90 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. విదేశీ మారకపు సానుకూలతలు లాభాలు పెరగటానికి దోహదపడ్డాయని వెల్లడించింది. ప్రతి సంవత్సరం మరో 10 లక్షల కార్ల తయారీ కోసం కొత్త ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన కూడా చేసింది.