Today Business Headlines 19-04-23:
ఆర్బీఐ లేటెస్ట్ గైడ్‌లైన్స్
రుణ బకాయిలపై విధించే జరిమానాల మీద వడ్డీ వసూలు చేయొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన అధీనంలోని బ్యాంకులను ఆదేశించింది. లోన్లు తీసుకున్నప్పుడు రీపేమెంట్‌కి సంబంధించిన రూల్స్ మాతృ భాషలో ఉండాలని సూచించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. రుణాలను తిరిగి చెల్లించకపోతే ఎంత జరిమానా విధిస్తారనే విషయాలను లోన్ డాక్యుమెంట్లలో పొందుపరచాలి. రీపేమెంట్లకు సంబంధించి.. ఖాతాదారులు క్రమశిక్షణ పాటించేలా చేయటమే లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలని కోరింది.
వారంలో 3 రోజులైనా
వచ్చే నెల నుంచి వారానికి మూడు రోజులైనా ఆఫీసులకు రావాలని ఇన్ఫోసిస్ సంస్థ తమ ఉద్యోగులకు సూచించింది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్నవాళ్లను కొన్ని రోజులైనా కార్యాలయాలకు రప్పించాలని నిర్ణయించింది. హైబ్రిడ్ విధానాన్ని కొనసాగిస్తూనే వర్క్ ఫ్రం ఆఫీసును పెంచాలని భావించింది. ఈ మేరకు ఉద్యోగులకు లేఖ రాసింది. డెలివరీ సెంటర్లలో పనిచేస్తున్నవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. గ్రూప్ సభ్యుల మధ్య అవగాహన, స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
అంచనా తలకిందులు
ఏటీఎంలపై రైల్వే పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. రైల్వే స్టేషన్లు మరియు వాటి ఆవరణల్లో ఏటీఎంలను ఏర్పాటుచేయటం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనుకున్న ఆ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. పదేళ్లలో 2 వేల 500 కోట్ల రూపాయలు సంపాదించాలని ఆశించగా నాలుగేళ్లలో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. కాగ్.. తన నివేదికలో తెలిపింది. ఆన్‌లైన్ పేమెంట్లు పెరగటం, ఏటీఎంల సంఖ్య తగ్గటం దీనికి కారణమని పేర్కొంది.
హైదరాబాద్.. టాప్-5
రియల్ ఎస్టేట్‌కి గిరాకీ నెలకొనటంతో బిల్డర్లు, ఈక్విటీ ఇన్వెస్టర్లు మేజర్ సిటీల్లో కొత్త వెంచర్లను ఏర్పాటుచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గడచిన ఐదేళ్లలో భారీఎత్తున భూములు సేకరించారు. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. భాగ్య నగరంలో 970 ఎకరాల భూమి తీసుకున్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపరంగా హైదరాబాద్ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాలను రియాల్టీ కన్సల్టెన్సీ కంపెనీ సీబీఆర్ఈ వెల్లడించింది. హైదరాబాద్‌లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ విలువ 90 కోట్ల డాలర్లని తెలిపింది.
అదానీ రుణ బాధలు
గౌతమ్ అదానీ గ్రూప్ అప్పులు 2 పాయింట్ 3 లక్షల కోట్ల రూపాయలని బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన నమోదిత సంస్థల రుణాలు ఇవి అని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించింది. అదానీ గ్రూపు అప్పులు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 20 పాయింట్ 7 శాతం ఎక్కువని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనంతరం కూడా అదానీ గ్రూపు రుణాల వేటను కొనసాగిస్తుండటం గమనించాల్సిన అంశం.
మళ్లీ విండ్‌ఫాల్ ట్యాక్స్
దేశీయ క్రూడాయిల్ ఉత్పత్తిపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఒక టన్ను ముడి పెట్రోలియంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ గతంలో సున్నా కాగా ఇప్పుడు 6 వేల 400 రూపాయలకు పెంచింది. పెట్రోలియం సెక్టార్‌లోని పన్నుల విధానాన్ని క్రమబద్ధీకరించటంతోపాటు పెట్టుబడులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మరియు విమాన ఇంధనానికి సంబంధించి ఎలాంటి మార్పులూ చేయలేదు. వాటిని ఇప్పటికీ జీరోగానే కొనసాగిస్తోంది.