Today ( 26-04-23) Business Headlines:
రిలయెన్స్ బొమ్మలు
రిలయెన్స్ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకీ విస్తరిస్తోంది. మొన్న.. ఐస్‌క్రీమ్‌ల బిజినెస్‌లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఈ సంస్థ.. ఇప్పుడు.. పిల్లలు ఆడుకునే బొమ్మల తయారీలోకి సైతం అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిలయెన్స్ రిటైల్ కంపెనీ.. సర్కిల్ ఇ రిటైల్ అనే సంస్థతో కలిసి కంబైన్డ్ కంపెనీని ఏర్పాటుచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్కిల్ ఇ రిటైల్ అనేది హరియాణాకు చెందిన సంస్థ. రిలయెన్స్ ఇప్పటికే బ్రిటన్ బొమ్మల కంపెనీ హామ్లేస్‌తో మరియు దేశీయ బొమ్మల సంస్థ రోవన్‌లను కలిగి ఉంది.
కాలేజీ.. + కంపెనీ..
అమెరికా మాదిరి చదువులు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. అక్కడ స్టూడెంట్స్ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సంపాదిస్తుంటారు. అలాగే.. ఇక్కడ కూడా డిగ్రీ విద్యార్థులు వారంలో మూడు రోజులు కాలేజీకి, మూడు రోజులు కంపెనీకి వెళ్లే విధానానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారం తీసుకుంది. తద్వారా.. స్టూడెంట్స్ డిగ్రీ ఫస్టియర్ నుంచే నెలకు 10 వేల రూపాయల వేతనం తీసుకునే అవకాశం అందుబాటులోకి వస్తోంది.
అవార్డులు ఇస్తాం
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.. FTCCI.. గతేడాదికి గాను ఎక్స్‌లెన్సీ అవార్డులు ఇవ్వబోతోంది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే నెల 31వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని FTCCI అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ సూచించారు. ఇండస్ట్రియలిస్టులను ఎంకరేజ్ చేసేందుకు దాదాపు 50 ఏళ్లుగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం FTCCI డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ని వీక్షించాలని కోరారు. ఈ ఏడాది కొత్తగా స్టార్టప్ విభాగంలో కూడా అవార్డులు ఇవ్వనున్నామని తెలిపారు.
ఆర్థికం.. అప్రమత్తం..
ఈ ఏడాది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అలర్ట్ చేసింది. ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గటం, నిత్యావసరాల రేట్లు పెరగటం వల్ల ఇలాంటి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. ఈ మేరకు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భౌగోళిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం వంటి వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించింది. ఈ పరిణామాలు మన దేశ అభివృద్ధి మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది.
అలియా కొత్త ఫ్లాట్..
బాలీవుడ్ భామ అలియా భట్.. 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లాట్ కొనుగోలు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే రెండు ఇళ్లు కొన్న ఆమె.. తన భర్త రణవీర్‌తో కలిసి 8 అంతస్తుల భవనం నిర్మిస్తోంది. బాంద్రా ప్రాంతంలోని ఈ బిల్డింగ్‌కి అతిదగ్గరలో ఒక అపార్ట్‌మెంట్‌ని సైతం కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఏరియల్ వ్యూ కోపరేటివ్ హౌజింగ్ సొసైటీలోని వాస్తు అనే బిల్డింగ్‌లో ఉన్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసమే అలియా ఏకంగా 2 పాయింట్ రెండూ ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారని తెలుస్తోంది.
కాయంచూర్ణ అడ్వాన్స్
మలబద్ధకాన్ని నివారించటంలో ప్రజాదరణ పొందిన కాయం చూర్ణ.. ఇప్పుడు సరికొత్తగా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాయం చూర్ణ అడ్వాన్స్ పేరుతో దీన్ని రిలీజ్ చేశామని తయారీదారులు సేథ్ బ్రదర్స్ వెల్లడించింది. గ్రాన్యూల్స్ రూపంలో జీలకర్ర రుచితో ఉండే ఈ కొత్త మందును వేసుకున్నప్పుడు గొంతుకు అతుక్కోకుండా నేరుగా పొట్టలోకి వెళుతుందని చెప్పారు. దీనివల్ల కాయం చూర్ణ మరింత బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇందులో కూడా గులాబీ రేకులు, ఆముదం కలిసి ఉంటాయని వివరించారు.