Today (20-02-23) Business Headlines:
జీ20 విత్త మంత్రుల భేటీ
జీ20 దేశాల ఆర్థికమంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల మీటింగ్ ఈ నెలాఖరులో.. అంటే.. శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరగనుంది. జీ20 దేశాలకు ఇండియా అధ్యక్షత చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి సమావేశమిది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ భేటీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సహధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. జీ20 దేశాలతోపాటు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన దేశాల ఆర్థిక మంత్రులు, ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లు మరియు వివిధ అంతర్జాతీయ సంస్థల అధిపతులు.. మొత్తం 72 మంది హాజరవుతారని భావిస్తున్నారు.
టీసీఎస్‌లో తీసివేతల్లేవ్
తమ సంస్థలో ఉద్యోగుల తీసివేతలు ఉండవని, కూడికలు మాత్రమే ఉంటాయని ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ పేర్కొంది. ఉద్యోగుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి కొనసాగిస్తాం తప్ప ఇంటికి పంపే ఉద్దేశంలేదని స్పష్టం చేసింది. వేతనాల పెంపు విషయంలోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, వ్యాపార పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గతంలో మాదిరిగానే ఇంక్రిమెంట్లు ఉంటాయని తెలిపింది. స్టార్టప్ సంస్థల్లో పనిచేసి ఇటీవల లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించింది. ఈ సంవత్సరం కొత్తగా 40 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది.
సఫోలా బ్రాండ్ సూపర్
గతంలో వంట నూనెలకు మాత్రమే పరిమితమైన సఫోలా బ్రాండ్.. గత రెండేళ్లలో వివిధ ప్రొడక్టులను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ క్రమంలో తాజాగా 2 వేల కోట్ల రూపాయల విలువైన బ్రాండ్‌గా ఎదిగింది. మారికో కంపెనీ బ్రాండ్ అయిన సఫోలా కింద ఈ రెండు సంవత్సరాల్లో తేనె, పీనట్ బటర్, సోయా చంక్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్ తదితర ఉత్పత్తులు వచ్చాయి. మార్కెట్‌ను మరింత పెంచుకునే లక్ష్యంతో మరిన్ని ఫుడ్ ప్రొడక్టులను తీసుకురానున్నట్లు పేర్కొంది. సఫోలా ఇప్పటికే హెల్దీ లైఫ్‌స్టైల్ ప్రీమియం ఫుడ్ ప్రొడక్ట్స్ బ్రాండ్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.
బ్యాంకుల వడ్డీల రికార్డ్
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నికర వడ్డీ ఆదాయం భారీగా పెరిగింది. తొలిసారిగా 1 పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు చేరింది. ఈ మేరకు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు వెల్లడయ్యాయి. పోయినేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు ఈ ఆదాయం 25 శాతం కన్నా ఎక్కువ పెరగటం విశేషం. అయితే ఈ విషయంలో ప్రభుత్వ బ్యాంకుల కన్నా ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నికర వడ్డీ ఆదాయం 2 పాయింట్ ఎనిమిదీ ఐదు శాతం మాత్రమే కాగా ప్రైవేట్ బ్యాంకుల నికర వడ్డీ ఆదాయం 4 పాయింట్ సున్నా మూడు శాతంగా నమోదైంది. ఈ గణాంకాలను రేటింగ్స్ సంస్థ కేర్ విడుదల చేసింది.
రష్యా చమురుదే పైచేయి
రష్యా నుంచి ఇండియాకి చమురు దిగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. జనవరి నెలలో రోజుకి 14 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. మొత్తమ్మీద రోజుకి 50 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా ఇందులో రష్యా వాటా దాదాపు 27 శాతానికి చేరింది. ఈ వాటా డిసెంబర్‌లో కేవలం 9 పాయింట్ 2 శాతమే కావటం ప్రస్తావించాల్సిన అంశం. దీంతో మన దేశానికి అత్యధిక చమురును విక్రయిస్తున్న దేశాల జాబితాలో ఇప్పటికీ రష్యానే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఇరాక్ మరియు సౌదీ అరేబియా ఉన్నాయి. ఈ వివరాలను వాణిజ్య వర్గాలు తెలిపాయి.
ఆ రోజొస్తుంది జాగ్రత్త
పంటలను సాగు చేసేవారి సంఖ్య పరిమితంగా ఉండటంతో భవిష్యత్తులో విపరీతమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హెచ్చరించారు. ప్రజల చేతిలో డబ్బు ఉంటుంది కానీ కొనటానికి ఉత్పత్తులులేని రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిన్న ఆదివారం చౌదరీ చరణ్ సింగ్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన 4వ కాన్వొకేషన్ ప్రోగ్రామ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వ్యవసాయ రంగంలోకి వస్తున్నవారి సంఖ్య తగ్గిపోతుండటం రానున్న రోజుల్లో సవాల్‌గా మారనుందని అన్నారు.