తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి నేడు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేశారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు.. బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య జారీ చేశారు.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మహతి ఆడిటోరియం వద్ధ టోకెన్లు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘గత నెల 18వ తేది స్థానికులకు శ్రీవారి దర్శనం పునరద్దరిస్తూ నిర్ణయం తీసుకున్నాం. టీటీడీ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించా. సీఎం సూచనల మేరకు తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించాం. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి స్థానికులు ధన్యవాదాలు తెలపాలి’ అని అన్నారు. ‘స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ జరిగిన ఈ రోజు శుభదినం. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం ఉంటుంది. రెండు రోజుల ముందు స్థానికులకు టోకెన్లు జారీ చేస్తాం. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలో కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు జారీ చేస్తాం’ అని ఈఓ శ్యామల రావు చెప్పారు.
‘ఎన్నికల హామీ మేరకు ఎన్డీఎ కూటమి ప్రభుత్వం స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ చేసింది. ఐదేళ్ల తరువాత స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. స్థానికుల ఐదేళ్ల కల ఇవాళ నెరవేరింది. స్థానికుల కల నెరవేరడానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారకులు. అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ, టీటీడీ సిబ్బందికి నా కృతజ్ఞతలు. తిరుపతితో పాటు చంద్రగిరి, రేణిగుంట వాసులకు దర్శనం కల్పిండం మంచి పరిణామం’ అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ‘చంద్రగిరి వాసులకు శ్రీవారి దర్శనం కల్పించడం సంతోషం. చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీవారి మెట్టు ఉన్నాయి. చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించాలని కోరిన వెంటనే సీఎం చంద్రబాబు అంగీకరించారు. చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించిన టీటీడీ చైర్మన్‌కు నా కృతజ్ఞతలు’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్థి నాని పేర్కొన్నారు.