కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు.
జనవరి 10, 11, 12వ తేదీలకు గాను 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మిగిలిన తేదీలకు ఒకరోజు ముందుగా జారీ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని సూచించారు. టోకెన్లు లేని భక్తులకు పది రోజుల పాటు శ్రీవారి దర్శనం ఉండదని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
వైకుంఠ ఏకాదశి కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో క్యూలైన్లు, బారీకేడ్లు పెడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. టోకెన్ల కోసం వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సర్వదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు తమకు కేటాయించిన సమయానికి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహా అధికారులు బుధవారం తనిఖీ చేశారు.