Tirupati laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు, నాణ్యత విషయంపై గత కొన్నిరోజులుగా స్వామి వారి భక్తుల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై ఓ యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రాన్ని అసిస్టెంట్ కంట్రోలర్ పి.సుధాకర్‌తో కలిసి తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ సీహెచ్ దయాకర్‌రెడ్డి సందర్శించారు. కౌంటర్లలో లడ్డూలను తూకం వేసిన అధికారులు బరువును పరిశీలించారు. వారి పరిశీలనలో 160 నుంచి 194 గ్రాముల మధ్య లడ్డూ బరువు ఉన్నట్లు గుర్తించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, నిబంధనల మేరకే బరువు, నాణ్యత ఉంటుందని స్పష్టం చేశారు. లడ్డూ విక్రయకేంద్రాన్ని తరచూ తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారని అధికారి దయాకర్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో ఎటువంటి తేడాలు లేవని ఆయన పేర్కొన్నారు. లడ్డూ బరువుపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోను పరిశీలించామని అన్నారు. బరువు తక్కువ చూపించిన తూనిక యంత్రాన్ని పరిశీలించగా అందులో ఓ వైరు మధ్యలో పడటంతో తేడా వచ్చినట్లు గుర్తించామని, దీనిపై సంబంధిత కౌంటర్ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో వివాదం నెలకొందని తెలిపారు.