పులులు, ఏనుగులు, వన్యప్రాణులు అరణ్యాలను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పులి సంచారం స్థానికులను, పర్యాటకులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పులిని పట్టుకునేందుకు బోను సిద్ధం చేశారు ఫారెస్ట్ అధికారులు. అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల సరిహద్దులో పులి సంచరిస్తున్నట్టు ఆధారాలు దొరకడంతో పులిని పట్టుకునేందుకు బోను సిద్ధం చేసినట్లు అనంతగిరి రేంజర్ దుర్గాప్రసాద్ తెలిపారు. అనంతగిరి మండలం చిలకలగెడ్డలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద బోనును సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోనును గ్రామానికి తరలిస్తామన్నారు. సంబందిత గ్రామాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రేంజర్ తెలిపారు.
Read Also: Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ
మరోవైపు తిరుపతి జిల్లాలో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. చంద్రగిరి(మం) ఏ.రంగంపేటలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గూండాలకోన ప్రాంతంలో మేకను ఎత్తుకెళ్లింది చిరుతపులి. గ్రామస్తులు కేకలు వేయడంతో మేకను వదలి పారిపోయింది చిరుత పులి. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. చిరుత తిరుగుతుండడంతో రైతులు, పశుకాపరులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.
Read Also: BJP: కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి.. అదానీతో ఉన్న రాబర్ట్ వాద్రా ఫొటోలు విడుదల