భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. నస్తూరుపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా.. మహదేవపూర్ దిశగా వెళ్తున్న పెద్దపులి కనిపించిందని స్థానికులు అంటున్నారు.
మహదేవపూర్ పరిసరాల్లో పెద్దపులి కనిపించిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిప్యూటీ రేంజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది అడవుల్లోకి వెళ్లి పెద్దపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పలు చోట్ల పులి పాద ముద్రలు కనిపించాయి. దీంతో పులి ఎప్పుడు వచ్చింది, ఎటు వెళ్లిందని అటవీ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రజలు అడవుల్లోకి వెళ్లొందని సూచిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు.