కాకినాడ జిల్లా వాసులకు మూడు వారాలుగా గుండెల్లో దడపుట్టిస్తోంది ఆ పెద్దపులి. తాజాగా శంఖవరం మండలం కొంతంగి ఎర్రకొండ పై పులి సంచారం కనిపించిందంటున్నారు. పులి కనిపించిందని చెప్తున్న కొండపై జీడిపిక్కల కోసం వెళ్ళారు కొందరు యువకులు. భయంతో పరుగులు తీసిన యువకులు ఈ సంగతి ఊళ్ళోకి వచ్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా ఎక్కడో చోట అలజడి కలిగిస్తూనే వుంది. దానిని బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. దీంతో చీకటి పడ్డాక గడప దాటి కాలు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు జనం. పులి ఎటు నుంచి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం లోగానే తమ పనులు ముగించుకుని.. తలుపులేసుకుని బిక్కబిక్కుమంటున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో గత మూడు వారాలుగా పెద్దపులి సంచరిస్తుంది. గత నెల 23న ఒమ్మంగి, శంకర్ల పూడి, పొదురుపాక సరిహద్దుల్లో పెద్దపులిని చూశారు రైతులు. ఆ తర్వాత పోతులూరు, శరభవరం ప్రాంతాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేసింది. ఈ నెల 4 వరకు దాదాపు 10 పశువులపై దాడి చేసింది పులి. అందులో 5 పశువులు చనిపోయాయి. ఆ తర్వాత పులిజాడ ఎక్కడా కనిపించలేదు. ఊద రేవుడి మెట్టపై పెద్దపులి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. మూడు రోజుల పాటు పెద్ద శంకర్ల పూడి గ్రామ పరిసరాల్లో తిరిగినట్టు భావిస్తున్నారు. పొడి వాతావరణం కారణంగా పులి అడుగు జాడలు కనిపించడం లేదు. అలాగే, గతంలో పులి గాండ్రింపులు వినిపించేవని… ఇప్పుడు లేదని చెబుతున్నారు రైతులు.
పెద్దపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెద్దపులి కదలికలు గల ప్రాంతాల్లో నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు. మేక, గొర్రె, లేగదూడలను ఎరగా వేశారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి… పులి కదలికల్ని కనిపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ… ఎక్కడా పెద్దపులి జాడ కనిపించలేదు. వారం క్రితం బోను దగ్గరికి వచ్చినా… ఎర జోలికి వెళ్లలేదు పెద్దపులి. తర్వాత పాండవులుపాలెం చెరువు ప్రదేశంలో పులి సంచరించినట్టు గుర్తించారు అటవీ శాఖ అధికారులు.
ప్రత్తిపాడు మండల ప్రజలకు మూడు వారాలుగా పులి భయం పట్టుకుంది. ఒంటరిగా వెళ్లాలంటే వణికిపోతున్నారు. చీకటిపడితే చాలు గుమ్మం దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పొలాల్లో ఉండే పశువులను కొందరు ఇళ్లకు తెచ్చేశారు. పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకోడానికి శ్రీశైలం నుంచి షూటర్లు వచ్చారు. కానీ… వారం రోజులుగా పులి జాడ లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు ఏకంగా పొలాలకు వెళ్లడం మానేశారు. తొలకరి సీజన్ కావడంతో పొలం పనులు ప్రారంభించాల్సి ఉంది. కాని పులి భయంతో… ఆ ఆలోచన విరమించుకున్నారు చాలా మంది. మొత్తానికి ఓ వైపు జనాన్ని భయపెడుతూ… మరోవైపు ఫారెస్ట్ అధికారుల్ని ముప్పతిప్పలు పెడుతోంది పెద్దపులి. మళ్లీ పులి కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా దొరికితే… దానిని బంధిస్తామంటున్నారు అధికారులు.
Telugu Indian Idol : బెస్ట్ సింగర్ గా వాగ్దేవికే పట్టం!