Thummala Resigns: సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్‌లో కొనసాగుతారా? రాజీనామా చేస్తారా? ఏ పార్టీలో చేరతారు అనే చర్చ గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ఆయనతో వరుసగా కాంగ్రెస్ నేతలు సమావేశం కావడంతో.. ఆయన కాంగ్రెస్ గూటికే చేరుతారనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక, వచ్చే ఎన్నికలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీకి దూరమైన తుమ్మల నాగేశ్వరరావు.. ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ మేరకు ఈ రోజు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు.. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు.. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
Read Also: NTR Sreeleela: ఎన్టీఆర్, శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ… ఒక్కసాంగ్ పడితే ఉంటది
అయితే, ఇక్కడే మరో చర్చ సాగుతోంది.. ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాజకీయ పార్టీగా మారింది.. ఇక, ఈ మధ్య జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్.. టీఆర్ఎస్‌ను కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ తీర్మానం చేయించడం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ తీర్మానం అందజేయడం అన్ని జరిగిపోయాయి.. ఇప్పుడు తమ రాజీనామా లేఖలో తుమ్మల.. తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు.. అని రాసుకొచ్చారు.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్నారు.. ఆ తర్వాత మళ్లీ టీఆర్ఎస్‌లో యాక్టివ్ రోల్ పోషించారు. కానీ, బీఆర్ఎస్‌గా మారిన తర్వాత క్రమంగా ఆయన్ని దూరం పెట్టారని తుమ్మల అనుచరులు చెబుతున్నమాట.. అదే కోణంలో.. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు.. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అని పేర్కొంటూనే.. బీఆర్ఎస్‌లో తనకు సరైన సహకారం అందలేదు అనే విషయాన్ని తన లేఖ ద్వారా తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ సాగుతోంది.