Thugs threatened Fabian Allen with a gun in South Africa: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న అలెన్‌ను కొందరు దుండగలు తుపాకితో బెదరించి.. అతడి సెల్ ఫోన్, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకెళ్లారు. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రఖ్యాత శాండ్‌టన్ సన్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
‘వెస్టిండీస్ ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ ఫాబియన్ అలెన్‌తో మాట్లాడాడు. విండీస్ క్రికెటర్ ఒబెడ్ మెక్‌కాయ్ కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. మెక్‌కాయ్ ద్వారా ఆండ్రీ కోలీ సంప్రదింపులు జరిపాడు. ప్రస్తుతం ఫాబియన్ అలెన్ బాగానే ఉన్నాడు. అయితే ఈ ఘటనపై క్రికెట్ సౌతాఫ్రికా, పార్ల్ రాయల్స్ స్పందించాల్సి ఉంది’ అని విండీస్ క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కి తెలిపారు. ఈ సంఘటన సౌతాఫ్రికా 20 టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్ల భద్రత గురించి ఆందోళన కలిగించింది.
Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రా దూరం!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో పార్ల్ రాయల్స్ టీమ్ తరఫున ఫాబియన్ అలెన్ ఆడుతున్నాడు. లీగ్‌లో ఇప్ప్పటివరకు అలెన్ దారుణ ప్రదర్శన చేశాడు. 8 మ్యాచ్‌లు ఆడి 7.60 సగటుతో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. 8.87 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. పార్ల్ రాయల్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. నేడు జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో పార్ల్ రాయల్స్ తలపడుతుంది. ఇక అలెన్ వెస్టిండీస్ తరఫున 20 వన్డేలు ఆడి.. 200 పరుగులు, ఏడు వికెట్లు తీశాడు. 34 టీ20ల్లో 267 పరుగులతో పాటు 24 వికెట్లు పడగొట్టాడు.