Jasprit Bumrah could be rested for IND vs ENG 3rd Test: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి భారత జట్టును గెలిపించిన వైస్ కెప్టెన్, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నాడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు బావిస్తున్నారని సమాచారం. బుమ్రా గైర్హాజరీలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్ట్ ఆరంభం కానుంది.
జస్ప్రీత్ బుమ్రా గత కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ముందు నుంచి విరామం లేని క్రికెట్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024 ఉన్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతి దక్కే అవకాశం లేదు. అందుకే అతడికి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: U19 World Cup 2024: నేడు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్.. సూపర్ ఫామ్‌లో యువ భారత్!
రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపుగా 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మిగతా భారత బౌలర్లతో పోలిస్తే.. బుమ్రా ఎక్కువ ఓవర్లు వేశాడు. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేయడం విశేషం. రెండో టెస్ట్‌లో బుమ్రా 91 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బుమ్రాతో పాటు యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) సెంచరీలు చేయడంతో భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో టెస్ట్‌కు భారత జట్టును ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది.