జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. లద్దాఖ్ లో నది దాటుతూ యుద్దట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అందులో కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, బాపట్లజిల్లా జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్, ప్రకాశంజిల్లాకి చెందిన ఎం.ఆర్కే రెడ్డి ఉన్నారు. వారి పార్థివ దేహాలకు ఎయిర్ పోర్టు టెర్మినల్ వద్ద ఆర్మీ లాంఛనాలతో అధికారులు నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో పార్థివ దేహాలను స్వస్థలాలకు తరలించారు.
READ MORE: Sudheer Babu: పాన్ ఇండియా లెవల్లో నవ దళపతి సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్..
కాగా.. తూర్పు లద్దాఖ్ లోని సాసర్ బ్రాంగ్సా సమీపంలో షియోక్ నదీప్రవాహంలో ఆర్మీ ట్యాంక్ కొట్టుకుపోయిన ప్రమాదంలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి వారు టీ 72 యుద్ధ ట్యాంక్ పై నదిని దాటుతుండగా, అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో, ఆ ప్రవాహంలో ట్యాంకు కొట్టుకుపోయింది. ఆ ట్యాంక్ లో ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) సహా ఐదుగురు భారత ఆర్మీ (ARMY) జవాన్లు నీటిలో మునిగిపోయి చనిపోయారు. యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటే విషయంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగిన సైనిక శిక్షణ కార్యక్రమం నుంచి వైదొలగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రక్షణ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నప్పటికీ నదీ ప్రవాహం, నీటి మట్టం తీవ్రంగా ఉండటంతో వారిని కాపాడలేకపోయారని వెల్లడించింది. తూర్పు లద్దాఖ్ లో విధులు నిర్వహిస్తూ ఐదుగురు వీర జవాన్లను కోల్పోవడంపై భారత సైన్యం విచారం వ్యక్తం చేసిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అందులో ఏపీకి చెందిన జవాన్లు ముగ్గురు ఉన్నారు.