Naravane Book Row: మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మంగళవారం తన పుస్తకం ‘‘ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టనీ’’ పుస్తక వివాదంపై తొలిసారిగా స్పందించారు. ప్రచురించబడని పుస్తకంపై ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలో, మోడీ ప్రభుత్వం చైనాతో ఘర్షణ సమయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదని ఉందని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నరవాణే మౌనాన్ని వీడారు. ‘‘ఇది పుస్తక స్థితి’’ అని పుస్తక పబ్లిషర్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోషల్ మీడియా పోస్టును ఆయన షేర్ చేశారు. ‘‘ఈ పుస్తకం ప్రచురణ హక్కులు తమవేనని, పుస్తకం ఇంకా ఫ్రింటింగ్‌కు వెళ్లలేదని, ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ లేదా ఏ రూపంలోనూ మేము ఎక్కడా విడుదల చేయలేదు’’ అని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. ఇదే సమయంలో ఇంటర్నెట్లో సర్క్యూలేట్ అవుతున్న అనధికారిక ప్రింట్లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని, వెంటనే వాటిని ఆపాలని చెప్పింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నరవాణే కూడా చెబుతున్నారు.
పార్లమెంట్లో వివాదం:
కొన్ని రోజలు క్రితం రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పుస్తకం కాపీని చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 లడఖ్‌లో భారత్-చైనా ఘర్షణ సమయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదనే విషయాలు ఇందులో ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఈ పుస్తకం అధికారికంగా విడుదల కాలేదని చెబుతూ లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని భాగాలను చదివేందుకు అనుమతించలేదు. మరోవైపు, ఇంకా పబ్లిష్ కాని పుస్తకం అక్రమంగా పంపినీ చేయడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026