రేపు సూర్యగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలను ఉదయం నుంచి రాత్రి వరకూ మూసివేస్తారు. సూర్యగ్రహణం వేళ కాణిపాకం వినాయకుని ఆలయం మూసివేస్తారు. ఉదయం ఎనిమిది నుండి రాత్రి ఏడున్నర వరకు ఆలయం మూసివేస్తారు. సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయం మూసివేస్తామని టీటీడీ తెలిపింది. రేపు ఉ. 8 గంటల నుంచి రాత్రి 7.30 వరకూ శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. గ్రహణం తర్వాత సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది.
సూర్యగ్రహణం మంగళవారం సాయంత్రం 5.01 నుండి సాయంత్రం 6.26 నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. కానీ దేశంలో కొన్ని ఆలయాలు మాత్రం తెరిచి వుంచుతారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తీశ్వరాలయం అందులో ఒకటి. ఏ గ్రహణం ఏ సమయంలో వచ్చినా.. ఆ సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరిచి ఆలయంలో కొలువైన శ్రీజ్ఞాన ప్రసునాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ వెలిసిన వాయులింగేశ్వరున్ని.. సూర్యచంద్రాగ్ని లోచనుడు అంటారు. ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతువుల ఆటలు సాగవంటారు. వారి ప్రభావం ఈ ఆలయంపై వుండందంటారు.
Read Also: Leopard Attack: ఏడాది బాలుడిపై చిరుత దాడి.. ముంబైలో ఘటన
అందుకే గ్రహణ కాలానికి శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే భక్తులందరూ ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకుని వారి దోషాలను పోగొట్టుకుంటారు. సూర్య గ్రహణం అయితే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలో, అదే చంద్ర గ్రహణం అయితే విడిచే సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సమయంలో దర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయంలోకి నిరభ్యంతరంగా ఎంట్రీ వుంటుంది.
తిరుపతి జిల్లాకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం వుంది. ఏ గ్రహణం సమయంలోనైనా గుడి తలుపులు తెరిచే ఉంటాయి. పంచ భూతాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణం వేళ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అంతేకాదు మన రాష్ట్రంలో రాహువు, కేతువులను పూజించే దేవాలయం కూడా ఇదే కావడం మరో విశేషం. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న ఈ గుడిలో సూర్య గ్రహణ సమయంలో అరుణ హోమం కూడా నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయం వర్షకాలం మునిగిపోయి వుంటుంది.
అలాగే, కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో తిరువరప్పు లేదా తిరువేరపులో ఈ ఆలయం ఉంది. గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచుతారు. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు. అలాగే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో కూడా గ్రహణం సందర్భంలో తలుపులను తెరిచే ఉంచుతారు. గ్రహణం కాలంలో ఇక్కడ శివ లింగాన్ని మాత్రం తాకనివ్వరు. ప్రత్యేక పూజలు, అభిషేకాలను తాత్కాలికంగా నిలిపేస్తారు. కానీ ఆలయ ప్రధాన ద్వారాలన్నింటినీ తెరిచే ఉంచుతారు. గ్రహణం తర్వాత ఆలయం అంతా పవిత్ర గంగాజలంతో శుభ్రం చేస్తారు. అనంతరం యధావిధిగా పూజలు నిర్వహిస్తారు. గ్రహణం పట్టే ముందు పట్టు స్నానాన్ని, విడిచిన తరువాత విడుపు స్నానం చేయాలని చెబుతున్నారు. గ్రహణం సమయంలో ఇళ్ళల్లో ఉండే అన్ని ఆహార పదార్థాల పైన గరికను వేయాలి.
Read Also: Solar Eclipse: రేపటి నుంచి బుధవారం ఉదయం వరకు దర్శనాలు బంద్