చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. పద్మావతి తెలిపారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్.. కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుందని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా.. వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని పేర్కొన్నారు.
Read Also: Alleti Maheshwar Reddy: హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి
పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే తాకిన తరువాత అదే చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకటం ద్వారా మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు నిర్ధారించారు. వైరస్ సోకిన తరువాత వ్యాధి లక్షణాలు 3 నుండి 10 రోజులలోగా బయటపడతాయన్నారు. హెచ్ఎంపీవి సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయని అన్నారు. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది దారి తీస్తుందని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
Read Also: Renu Desai: అఖిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్!
వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినపుడు, తుమ్మినపుడు, నోటిని, ముక్కుని చేతిరుమాలుతో అడ్డు పెట్టుకోవాలని చెప్పారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా వుండటం, వాడిన వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండాలన్నారు. తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవాలి.. తగినంత నిద్ర పోవాలని అంటున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారు క్వారంటైన్ లో ఉండటం మంచిది.. ఇప్పటి వరకూ మన భారత దేశంలో కానీ, ఏపీలో కానీ ఎక్కడా కేసులు నమోదు కాలేదని డా. పద్మావతి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాయని తెలిపారు.