ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థలు, టీచర్లు, గ్రాడ్యుయేట్ల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై విప్ జారీ చేయాలని భావించింది టీడీపీ. ఈ నెల 23వ తేదీ జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. 23 మంది పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది టీడీపీ. టీడీపీ ఎమ్మెల్యే విప్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీచేశారు.
Read Also: Ram Charan: చరణ్ హైదరాబాద్ లో అడుగు పెడితే అర్ధరాత్రి కూడా ర్యాలీ చేశారు
విప్ ను ఆయా ఎమ్మెల్యేలకు స్పీడ్ పోస్టులో పంపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా అందజేసింది టీడీపీ. 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాల్సిందిగా ఆదేశించింది. ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా టీడీపీ కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. సంఖ్యాబలం లేకున్నా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడం ఆసక్తిగా మారింది. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు తమకు ఓటేస్తారనే నమ్మకంతోనే అనురాధను రంగంలోకి టీడీపీ దించినట్టు తెలుస్తోంది.
ఏడుగురు ఎమ్మెల్సీలు నారా లోకేశ్, పోతుల సునీత, ఇటీవల మరణించిన బచ్చల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణ పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరి స్థానంలో శాసనమండలికి ఎన్నికలు నిర్వహించనున్నారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారి అండతో తమకు ఒక ఎమ్మెల్సీ సీటు వస్తుందని టీడీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఏడు ఎమ్మెల్సీ సీట్లు ఖచ్చితంగా గెలవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారని అంటున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా జరగనుంది.
Read Also: Sleeping Disorder: సరిగా నిద్రపోవడం లేదా? అయితే ఈ రిస్క్ తప్పదు