Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే హృదయం కలచివేస్తుందని ఆయన పేర్కొన్నారు. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రభుత్వ ఆరోగ్య భద్రత కార్డుతో ఆసుపత్రికి వెళ్లినా, ఆ కార్డు చెల్లుబాటు కావడం లేదని వైద్యసేవలు అందడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీస్ ఉద్యోగికి శాపంగా మారిందని ఆయన అన్నారు.
Also Read: iQOO Neo 10R:పవర్ ఫుల్ ఫీచర్స్ తో.. ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
ఇది ఒక్క నారాయణ సింగ్ గారి సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీకు ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నట్లయితే వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి. వీరికి వైద్య సేవలు అందేలా ఈహెచ్ఎస్ (EHS), పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులను ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.