One Vote Victory: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడో విడత ఎన్నికలతో గ్రామీణ స్థాయిలో ప్రజాప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. చివరి దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12,652 మంది, వార్డు సభ్యులుగా 75,725 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 80.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
READ MORE: Allu Arjun : అట్లీ మూవీలో.. పాపం మృణాల్‌కి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారేంటీ..!
నిర్మల్ జిల్లా: భైంసా మండలం లింగా గ్రామంలో పోస్టల్ ఓటు సర్పంచ్‌ను తేల్చింది. మొత్తం 329 ఓట్లలో 293 పోలవగా మూడు చెల్లలేదు, ఒకటి నోటాకు పడింది. గడ్‌పాలే సుష్మారాణి, స్వాతికి 142 ఓట్లు చొప్పున రాగా, చివరగా లెక్కించిన ఒక పోస్టల్ ఓటు సుష్మారాణికి పడటంతో ఆమె విజేతగా నిలిచారు. అదే జిల్లాలో ముథోల్ మండలం రువ్వి గ్రామంలో బీజేపీ మద్దతుదారు మల్లేశ్‌కు 183 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారు గంగాధర్‌కు 182 ఓట్లు రావడంతో మల్లేశ్ ఒక్క ఓటుతో గెలిచారు.
వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం గుర్రాలగండి రాజపల్లి పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు బూస నర్సయ్యకు 191 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మద్దతుదారు కత్తుల కుమారస్వామికి పోస్టల్ ఓటుతో కలిపి 190 ఓట్లు రావడంతో నర్సయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురంలో బీజేపీ మద్దతుదారు టేకుల మంజులకు 181 ఓట్లు, కాంగ్రెస్ బలపర్చిన బద్దం మమతకు 180 ఓట్లు రావడంతో మంజుల ఒక్క ఓటుతో విజయం సాధించారు.
సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో సర్పంచ్ పదవికి మేనల్లుడు ఊట్కూరి మాధవరెడ్డి, మేనమామ కందుకూరి సత్యనారాయణరెడ్డి మధ్య పోటీ జరిగింది. 798 పోలైన ఓట్లలో మాధవరెడ్డికి 397, సత్యనారాయణరెడ్డికి 396 ఓట్లు రావడంతో ఒక్క ఓటుతో మాధవరెడ్డి విజయం సాధించారు. ఇదే జిల్లాలో పాలకవీడు మండలం మహంకాళిగూడెంలో కాంగ్రెస్ రెబల్ పిడమర్తి దాసుకు 187 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి చిట్టిప్రోలు నారాయణకు 186 ఓట్లు రావడంతో దాసు ఒక్క ఓటుతో గెలిచారు.
నారాయణఖేడ్: ఈ ఎన్నికల్లో అనేక చోట్ల గెలుపోటములు ఒక్క ఓటుతోనే తేలడం ఆసక్తికరంగా మారింది. నారాయణఖేడ్ మండలం బానాపూర్ గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు పుప్పాల అనిల్, బీఆర్ఎస్ బలపర్చిన పుప్పాల శంకర్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మొత్తం 526 ఓట్లలో 496 పోలవగా 13 చెల్లనివిగా మారాయి. అనిల్‌కు 241 ఓట్లు, శంకర్‌కు 240 ఓట్లు రావడంతో ఒక్క ఓటు తేడాతో అనిల్ విజయం సాధించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు మండలం నల్లబండబోడులో స్వతంత్ర అభ్యర్థి గడిగె సింధుకు 70 ఓట్లు, ప్రత్యర్థి బచ్చల ఝాన్సీరాణికి 69 ఓట్లు రావడంతో సింధు గెలిచారు. అదే మండలం అనంతారంలో కాంగ్రెస్ మద్దతుదారు కుర్సా రమేశ్‌కు 263 ఓట్లు, ప్రత్యర్థి ఈసం స్రవంతికి 262 ఓట్లు రావడంతో రమేశ్ ఒక్క ఓటుతో విజయం సాధించారు.
పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు గంట రమేశ్‌కు 885 ఓట్లు, ప్రత్యర్థి నరేందర్‌కు 884 ఓట్లు రావడంతో రమేశ్ విజేతగా నిలిచారు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు శోభకు 213 ఓట్లు, కాంగ్రెస్ బలపర్చిన లక్ష్మికి 212 ఓట్లు రావడంతో శోభ ఒక్క ఓటుతో గెలుపొందారు.