ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు రోజే రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కానీ, అందరూ ఆశించినట్లు ఆమె హీరోయిన్‌గా కాకుండా, బన్నీకి సిస్టర్ రోల్‌లో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. ఎంతో ఎమోషనల్ టోన్ ఉన్న ఈ పాత్ర చుట్టూనే కథ మలుపు తిరుగుతుందని సమాచారం. ‘సీతారామం’తో అందరి గుండెల్లో హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న మృణాల్‌ను ఇలాంటి పాత్రలో చూడటం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మరోవైపు, ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ భామలు దీపికా పడుకోణె, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ డాన్ కథగా ఉండబోతుందట. అట్లీ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి, ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్స్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాడట. మరి మృణాల్ పాత్ర నిజంగానే సిస్టర్ రోల్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.