తెలంగాణ కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నియమితులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు తెలంగాణ నూతన సీఎస్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. తనకు సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసిఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
Also Read : Errabelli Dayakar Rao : కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి దయాకర్ రావు సవాల్
అయితే.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి.. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసేందుకు సిద్దమయ్యారు. డీవోపీటీ ఆదేశాల మేరకు సోమేష్ కుమార్.. రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు.
Also Read : Fight: రెండు గ్రూపుల మధ్య ఆన్‌లైన్ పోస్ట్‌ల చిచ్చు.. ముగ్గురికి కత్తిపోట్లు