Local Body Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా.. గ్రామ సర్పంచ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్తరకపు హామీలతో ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వరాల జల్లుల్లా పథకాలు ప్రకటిస్తుండగా.. మరికొందరు ఏకంగా బాండ్ పేపర్లపై హామీలతో ఓటర్లకు నమ్మకం కల్పిస్తున్నారు. ఈ వినూత్న పోకడలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
IT Raids On Restaurants: ప్రముఖ హోటళ్లపై ఐటీ పంజా.. ఆర్థిక లావాదేవీలపై ఆరా..!
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పనుల వనమ్మ నరసింహ యాదవ్ ప్రకటించిన మ్యానిఫెస్టో గ్రామంలో సంచలనాన్ని రేపుతోంది. గ్రామంలోని ప్రతి ఇంటికి రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానన్న ఆయన హామీ అత్యంత ఆకర్షణీయమైనదిగా నిలిచింది. గ్రామంలో సుమారు 700 ఇళ్లు ఉండటంతో, దీనికి ఐదేళ్ల కాలానికి రూ.42.5 లక్షల ప్రీమియం అవుతుందని గ్రామస్థుల అంచనా. దీనితోపాటు ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహానికి రూ.5,116 సహాయం, ఆడబిడ్డ పుట్టినప్పుడు రూ.5,000 ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకటించడం ఆయన ప్రచారాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసే సమయంలో రూ.21,000 సహాయం, శస్త్రచికిత్స అవసరమైతే రూ.15,000 సాయం, దహన సంస్కారాలకు రూ.10,000 మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదండోయ్.. గ్రామానికి ఉచిత అంబులెన్స్, నెలకోసారి మెడికల్ క్యాంపులు, గ్రంథాలయం ఏర్పాటు, వీధులన్నింటిలో సీసీ కెమెరాలు, అంత్యక్రియల కోసం ప్రత్యేక వైకుంఠ రథం అందుబాటులో ఉంచుతానని వెల్లడించారు. శివరాత్రి, శ్రీరామనవమి, మొహరం వంటి పండుగల సందర్భంగా అన్నదానం, రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందు కూడా నిర్వహిస్తానని ప్రకటించడం ఆయన ప్రచారానికి మరింత ఊపు తెచ్చింది. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, బూట్లను ఉచితంగా అందించడం, ఉన్నత విద్యకు ఆర్థిక సాయం కూడా ఆయన హామీల్లో భాగమయ్యాయి.
World’s Best Cities: 2025లో ప్రపంచంలోని ఉత్తమ నగరాలు లిస్ట్.. భారత్ నుండి మూడు నగరాలకు చోటు..!
ఇక గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో మరో సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు.. తన 22 హామీలను రూ.100 బాండ్ పేపర్‌పై రాసిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ హామీలను అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్‌లోనే స్పష్టంగా పేర్కొనడం గ్రామస్తులకు నమ్మకాన్ని పెంచుతోంది. అలాగే నల్గొండ జిల్లాలోని చిన్న ఆడిశర్లపల్లి, ములకలపల్లి గ్రామాల్లో దేవాలయ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చిన అభ్యర్థులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆసక్తికర పరిణామంగా నిలిచింది. ఈ విధంగా వరాల హామీల వల్ల అనేక గ్రామాల్లో పోటీ లేకుండానే ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే సర్పంచ్ ఎంపిక కోసం వేలం పాటలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల జిల్లాల వారీగా ఏకగ్రీవంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌లో 22 మంది, నిజామాబాద్‌లో 10 మంది, నిర్మల్‌లో 8 మంది, ఖమ్మం & జనగాం జిల్లాలో 6 మంది చొప్పున, కామారెడ్డి & వరంగల్‌లో 5 మంది చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్‌లో 3, మహబూబ్‌నగర్‌లో 2 , ములుగు & భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కొక్కరు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా నిలిచారు.