TKA : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ను తీవ్ర ఆరోపణలు కకావికలాన్ని సృష్టిస్తున్నాయి. అసోసియేషన్‌లో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తోట సురేష్ చేసిన ఫిర్యాదులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీష్ యాదవ్ , కోశాధికారి కె.బి. శ్రీరాములుపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత 40 ఏళ్లుగా వారు పదవుల్లో కొనసాగుతూ సంఘ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అంతర్-జిల్లా కబడ్డీ టోర్నమెంట్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జిల్లా సంఘాలకు పంపకుండా వారు స్వాహా చేశారని సురేష్ పేర్కొన్నారు.
Vemulawada : ఆగని రాజన్న కోడెల మృత్యు ఘోష.. మరో ఐదు కోడెల మృతి
అసోసియేషన్‌కు అధికారికంగా ఒకే బ్యాంక్ ఖాతా ఉన్నప్పటికీ, అదనంగా అనధికారిక ఖాతా ఓపెన్ చేసి దాదాపు రూ.60 లక్షలు విత్‌డ్రా చేశారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులను సైతం వీరు దారి మళ్లించారని సురేష్ తెలిపారు. 2021లో సూర్యాపేటలో జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం విడుదలైన రూ.1.20 కోట్లలో రూ.50 లక్షలను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని అన్నారు. ఏజీఎం, ఈసీ సమావేశాల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే సంఘ నిధులను జగదీష్ యాదవ్, శ్రీరాములు ఇష్టారీతిన వాడుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కోసం చింతల స్పోర్ట్స్ సంస్థ ఇచ్చిన రూ.20 లక్షల నిధులు కూడా జిల్లా సంఘాలకు ఇవ్వకుండా దుర్వినియోగం చేశారని సురేష్ వివరించారు. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకే తనను మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుండి అన్యాయంగా తొలగించారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుతో నిధుల వినియోగంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.
IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?