TS High Court: పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల కోసం పోలీసులున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందన్న హైకోర్టు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని డీజీపీని ఆదేశించింది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా.. కరీంనగర్ 2వ పట్టణ పీఎస్‌లో మహిళ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సీజే ధర్మాసం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశంతో వ్యక్తిగతంగా ఎస్‌హెచ్‌ఓ ఓదెల వేంకటేశ్ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ వాదనలు వినిపిస్తూ.. 14న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరఫున ఏఏజీ క్షమాపణలు కోరారు.
తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు తెలిపింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని ధర్మాసనం వెల్లడించింది. ఎస్‌హెచ్‌ఓ ఎఫ్‌ఐర్ నమోదు చేయకపోవడానికి కారణాలేమిటో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.